బంగారు ఆవు - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   ఒకూర్లో రంగన్నని ఒకడుండేటోడు. వాడు చానా బీదోడు. ఆడా ఈడా పనిచేసి వచ్చిన డబ్బులతో బతికేటోడు. ఆయనకో కూతురుంది. ఆమె సక్కదనాల సుక్క. మంచి గుణవంతురాలు. పనిమంతురాలు. కూతురంటే రంగన్నకు చానా ప్రేమ. తాను తిన్నా తినకపోయినా కూతురికి మాత్రం ఏ లోటూ రాకుండా చూసుకునేటోడు. కొంతకాలానికి ఆమె పెద్దగైంది. పెద్దగైనాక పెండ్లి చేయాల గదా... పెండ్లి చేయాలంటే చానా డబ్బులు కావాల గదా... అంత డబ్బు రంగన్న దగ్గర లేదు. అందుకని ఆ వూరి రాజు దగ్గరకు పోయి “రాజా... రాజా... నా కూతురికి పెండ్లి వయసొచ్చింది. సాయం చేయవా" అనడిగినాడు.
ఆ రాజుకు అరవై ఏండ్ల వయసుంటాది. వాడు చానా దుర్మార్గుడు. రంగన్న కూతురి అందాన్ని చూసి “ఇంతందమైన పిల్లను ఎవరికో ఇచ్చి ఏం పెండ్లి చేస్తావు. నాకు నచ్చింది. నేనే చేస్కుంటా" అన్నాడు. ఆ మాటలకు రంగన్న అదిరిపడ్డాడు. ఇయ్యనంటే ఏం చేస్తాడో ఏమో అని భయపడి లోలోన తిట్టుకుంటా సరేనన్నాడు.
విషయం తెలిసి రంగన్న కూతురు కండ్లనీళ్ళు పెట్టుకోనింది. ఆ ముసలిరాజు నుండి ఎలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించీ... ఆలోచించి... “రాజా... రాజా... నువ్వంటే నాకిష్టమే. కానీ నాకో పెద్ద బంగారు ఆవును చేపిచ్చియ్యి. అట్లాగైతే చేస్కుంటా" అనింది. సరేనని రాజు ఆమె కంటే ఎత్తయిన ఒక పెద్ద బంగారు ఆవును చేపిచ్చి ఆమెకిచ్చినాడు.
పెండ్లి రోజు ఆమె పట్టుచీర కట్టుకొస్తానని లోపలికిపోయి ఎవరికీ కనబడకుండా మట్టసంగా ఆవు లోపల దూరి దాచి పెట్టుకోనింది. ఎంతసేపైనా ఆమె రాకపోయేసరికి రాజు పెండ్లికూతుర్ని తీసుకురమ్మని భటుల్ని పంపిచ్చినాడు. వాళ్ళు పోయి చూస్తే ఇంగేముంది. యాడా కనబళ్ళేదు. భటులు రాజభవనం మొత్తం అడుగడుగునా వెదికినారు. ఐనా ఆమె యాడుందో ఎవరూ కనిపెట్టలేకపోయినారు. దాంతో రాజు పెండ్లి ఆగిపోయింది.
రాజు ఇంట్లో వున్న ఆ బంగారు ఆవును చూసి "పెండ్లే ఆగిపోయింది. ఇంక ఈ బంగారు ఆవెందుకు. దీన్ని తీస్కోనిపోయి అమ్మెయ్యండి" అన్నాడు. భటులు దాన్ని తీస్కోనిపోయి సంతలో అమ్మకానికి పెట్టినారు. పక్కపూరి రాజు కొడుకు ఆ ఆవును చూసి “అబ్బ. ఎంత చూడముచ్చటగా వుందిది" అనుకోని దాన్ని కొనుక్కోనిపోయి తన గదిలో పెట్టుకున్నాడు. ఆ
ఆ రాజకుమారునికి అంతకుముందే పెళ్ళయ్యింది. ఆమె చానా టక్కరిది. చీటికీ మాటికీ మొగున్తో కొట్లాడి పుట్టింటికి పోయేది. ఎప్పుడూ పుట్టింట్లోనే వుండేది. ఈ రాకుమారుడు బంగారు ఆవును తెచ్చుకున్నప్పుడు గూడా ఆమె పుట్టింట్లోనే వుంది.
బంగారు ఆవు రాజకుమారుని గదిలో వుంది గదా... రోజూ రాత్రి కాగానే ఆమె ఆవులోంచి బైటకొచ్చి అక్కడున్న అన్నం, పండ్లు బాగా తిని మళ్ళా ఎవరికీ కనబడకుండా ఆవు లోపల దూరి దాచి పెట్టుకొనేది. రాకుమారుడు "ఇదేందబ్బా నేను తినకుండానే రోజూ పొద్దునకల్లా అన్నీ మాయమైపోతా వున్నాయ్. ఇదేందో కనుక్కోవాల" అనుకున్నాడు.
ఆ రోజు రాత్రి నిద్ర రాకుండా చిటికెనవేలు కోసుకోని దానికి నిమ్మకాయ పెట్టుకున్నాడు. వేలు సుర్రుమంటా వుంటే ఇంక నిద్ర యాన్నుంచొస్తాది. దాంతో మంచమ్మీద కదలకుండా పండుకోని ఒక కన్ను తెరచి చీకట్లో బాగా చూడసాగినాడు.
ఆవు లోపలున్నామెకి ఈ విషయం తెలియదు గదా. దాంతో ఎప్పట్లాగే అర్ధరాత్రి కాగానే బంగారు ఆవులోంచి బైటకొచ్చి అన్నీ తినడం మొదలు పెట్టింది. అది చూసి రాకుమారుడు వెనుక నుండి చప్పుడు కాకుండా నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చి చటుక్కున చేయి పట్టుకొని “ఎవర్నువ్వు. దేవతవా? దయ్యానివా? రాక్షసివా? మానవ కన్యవా? చెప్పు" అనడిగినాడు. అప్పుడామె కండ్లల్లో నీళ్ళు కారిపోతావుంటే జరిగిందంతా ఏడుస్తా చెప్పింది. అప్పుడా రాకుమారుడు ఆమె కండ్లు తుడ్చి “ఇంకేం భయపడొద్దు. ఇప్పన్నుంచి నువ్వు నాతోనే వుండు" అంటూ ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఆమె మొగున్ని, అత్తా మామలను దేవుళ్ళలాగా చూసుకొనేది. పనివాళ్ళ, దాసీల కష్టసుఖాలు కనుక్కుని అవసరమైన సహాయాలు చేసేది. అందరికీ తలలో నాలుకలా ఉండేది.
రాజు పెద్ద భార్యకు ఈ విషయం తెలిసి వురుకులు, పరుగుల మీద ఇంటికొచ్చింది. చిన్న రాణిని చూసి “ఇబ్బ... ఇది నాకన్నా చూడముచ్చటగా అచ్చం నెమలీక అంత అందంగా  వుంది. దీన్నెలాగైనా ఈన్నించి తరిమెయ్యకపోతే రాజు నావంక అస్సలు చూడడు" అనుకోనింది.
ఒకరోజు చిన్నామె దగ్గరకు పోయి “మన తోట చానా అందంగా వుంటాది. పోయొద్దాం రా" అంటూ తీస్కోని పోయింది. అక్కడ ఒక పెద్ద చెరువుంది. ఆ చెరువుకాడికి తీసుకోని పోయి “నీవందంగా వున్నావో. నేనందంగా వున్నానో నీళ్ళలో చూసుకుందామా" అనింది. దానికి చిన్నరాణి "ఎవరందం వాళ్ళదిలే అక్కా... మనలో మనకు పోటీ ఎందుకు" అనింది. ఐనా పెద్దరాణి ఒప్పుకోలేదు. దాంతో సరేనని చిన్నామె చెరువులోనికి తొంగి చూసింది. వెంటనే పెద్దరాణి వెనుక నుంచి దభీమని ఆమెను చెరువులోనికి తోసేసింది. యువరాజుకి ఇదంతా తెలీదు కదా.... దాంతో చిన్న పెళ్ళాం కనబడక కళ్లనీళ్లతో చుట్టుపక్కల రాజ్యాలన్నీ వెదికించాడు. కానీ ఎక్కడా దొరకలేదు.
చెరువులో పడిన చిన్నరాణి కొంత కాలానికి అందమైన వేయి రేకుల తామరపూవై పుట్టింది. ఒకరోజు రాకుమారుడు చెరువులో స్నేహితులతో ఈదులాడతా వుంటే వాళ్ళకు తామరపువ్వు కనబడింది. “అబ్బ... ఎంతందంగా వుందీ తామరపువ్వు" అనుకుంటా అందరూ దాన్ని పట్టుకోడానికి పోయినారు. అది ఎవరికీ దొరకలేదు. కానీ ఆ తామరపూవు రాకుమారుడు ఎటువైపు ఈదులాడితే అటువైపు రాసాగింది. అది చూసి “ఇదేందబ్బా ఇది నా దగ్గరికే వస్తా వుంది" అనుకోని ఆశ్చర్యపోయి దాన్ని కోసుకోని ఇంటికి తీసుకోని పోయినాడు.
పెద్దరాణి ఆ వేయి రేకుల తామరపూవును చూసి “ఓహో... చిన్న పెళ్ళాం తామరపూవై పుట్టి మళ్ళా ఇంట్లోకి వచ్చిందే" అని కనుక్కోని దాని రెక్కలన్నీ ఇష్టమొచ్చినట్టుగా తెంపి విసిరి పెరట్లో పాడేసింది. పెరట్లో పడిన ఆ తామరపూవు అన్నే మల్లెతీగై మొలిచింది.
రాత్రికి రాత్రి పెద్ద చెట్టయి కుప్పలు తెప్పలుగా పూలు కాయసాగింది. ఆ పూలవాసన రాజభవనమంతా నిండిపోయింది. రాకుమారుడు “ఇదేందబ్బా ఇంత మంచి వాసనొస్తా వుంది" అని ఆ మల్లెపూలన్నీ తెంపుకోనొచ్చి గదంతా చల్లుకున్నాడు.
పెద్దరాణి ఆ మల్లెపూలను చూసి “ఓహో! ఇది మళ్ళా మల్లెతీగై పుట్టిందా" అనుకోని రాజు బైటకు పోయినప్పుడు ఆ చెట్టు మొత్తం పెరికి కుప్పేసి అంటించింది. అది కాలి బూడిద కాగానే దాన్ని వూరిబైట పాడేసింది. వెంటనే బూడిద పన్నచోటల్లా రాత్రికి రాత్రి పెద్ద పెద్ద మామిడి చెట్లు మొలిచినాయి.
ఆ వూరి రాణి దగ్గర ఒక చాకలాయన వుండేటోడు. ఆయన బట్టల మూటెత్తుకోని వస్తా వుంటే మామిడితోట కనబడింది. "ఇదేందబ్బా నిన్నటి వరకూ ఈడ ఒక్క చెట్టు కూడా లేదు.
రాత్రికి రాత్రి తోట తయారైంది." అని ఆశ్చర్యపోయినాడు. తోట మధ్య పోతా వుంటే ఒక చెట్టుకు పనసకాయంత పెద్ద మామిడికాయ కనబడింది. "ఇదేందబ్బా ఇంత లావుంది. నేనింత వరకు ఇంతలావు పండును ఎప్పుడూ చూన్నేలేదు" అనుకోని నెమ్మదిగా దానిని తెంపి పెద్ద గోనెసంచిలో మూటగట్టుకోని ఇంటికి తీసుకోని పోయినాడు.
కత్తి తీసుకోని దాన్ని కోయబోతున్నంతలో లోపల్నుంచి “జాగ్రత్త...! జాగ్రత్త...! నా కాలో చేయో తెగకుండా నెమ్మదిగా కోయి" అని వినబడింది. "ఇదేందబ్బా మామిడిపండు మాట్లాడతా వుంది" అని ఆశ్చర్యపోయి నెమ్మదిగా కోసి చూస్తే ఇంగేముంది లోపల్నుంచి కిలకిలకిల నవ్వుకుంటూ చిన్నరాణి బైటకొచ్చింది. వాడు ఆమెను చూసి "నాకెట్లాగూ పిల్లల్లేరు. దేవుడే నిన్ను పంపిచ్చినాడు. నువ్వు నా దగ్గరే వుండు" అని పెంచుకోసాగినాడు.
ఒకసారి ఆ చాకలాయనకి పెద్ద జ్వరమొచ్చి మంచమ్మీద నుండి లేవలేకపోయినాడు. ఎన్ని రోజులైనా బట్టలు తేకపోయేసరికి పెద్దరాణి “ఏమయిందబ్బా వీనికి" అని వానింటికొచ్చింది. అక్కడ వాని కూతుర్ని చూసి “ఇది అచ్చం చిన్నరాణి లెక్కనే వుందే. ఐతే ఇది మళ్ళా చాకలాయన కూతురి లెక్క పుట్టిందన్న మాట. ఎట్లాగైనా సరే దీన్ని చంపెయ్యాలి" అనుకోనింది.
ఇంటికి పోయి మంచమ్మీద పండుకోని “అమ్మా... అబ్బా..." అని మూలగడం మొదలు పెట్టింది. అది చూసి రాజు "ఏమైందే. అట్లా బాధ పడతా వున్నావ్" అనడిగినాడు. దానికామె తల పట్టుకోని "నిన్నటి నుంచీ ఒకటే తలనొప్పి. ఎన్ని మందులేసుకున్నా తగ్గడం లేదు. మన చాకలాయన వున్నాడు గదా. ఆయన కూతుర్ని చంపి ఆ రక్తం నా తలకు పూస్తే తప్ప నా నొప్పి తగ్గదు" అని చెప్పింది. ఆమెది దొంగ తలనొప్పని తెలీని ఆ రాకుమారుడు మంత్రిని పిల్చి ఆమెను చంపి నెత్తురు తెమ్మన్నాడు.
మంత్రి భటులను తీసుకోని చాకలాయన కూతురిని చంపడానికి వాళ్ళింటికి పోయినాడు. ఆమెను చూసి “ఈమెవరబ్బా. అచ్చం తప్పిపోయిన మా చిన్నరాణి లెక్కనే వుందే" అనుకోని, ఆమెను చంపకుండా వురుక్కుంటా పోయి రాకుమారునికి విషయమంతా చెప్పినాడు.
వెంటనే రాకుమారుడు గుర్రమెక్కి వేగంగా ఆడికొచ్చి ఆమెను చూసి ఆశ్చర్యపోయి “ఎవర్నువ్వు. అచ్చం నా చిన్న పెళ్ళాం మాదిరే వున్నావ్" అనడిగినాడు. అప్పుడామె జరిగిందంతా చెప్పింది.
దాంతో రాజు సంబరంగా ఆమెను ఇంటికి తీసుకోనిపోయి పెద్ద రాణిని పిలిచి “చీ... చీ... నీవింత దుర్మార్గురాలివనుకోలేదు. ఫో నా ఇంట్లోంచి" అని తోసేసినాడు. అది చూసిన చిన్న రాణి మొగుని చేయి పట్టుకోని "ఏమోలెండి. తెలియక తప్పు చేసింది. ఆమెను క్షమించి ఇంట్లోకి రానీయండి" అని బతిమలాడింది. రాజు చిన్న రాణి మంచితనాన్ని మెచ్చుకోని ఆమెను ఐదంతస్తుల మేడలో పెట్టి,  పెద్ద రాణిని పశువుల కొట్టంలో పెట్టినాడు.
***********
కామెంట్‌లు