ఎంతెంత దూరం... చానా చానా దూరం- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక అడవిలో ఒక చక్కని పూలతోట వుండేది. అందులో రంగురంగుల సీతాకోకచిలుకలు చానా వున్నాయి. అవి హాయిగా ఆడతా, పాడతా, ఎగురుతా, దుంకుతా ఆకలైనప్పుడల్లా తనివితీరా తేనె తాగుతా సంబరంగా వుండేవి. ఒకరోజు ఒక సీతాకోకచిలుక అక్కడ ఆడుకుంటా వుంటే అనుకోకుండా పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్టుకొమ్మలే ఓ అని కిందికీ, మీదికీ వూగిపోతా వున్నాయి. ఇక సీతాకోకచిలుకలు ఎంత. ఈ సీతాకోకచిలుక ఆ గాలికి రయ్యిమని కొట్టుకోని పోతాపోతా దూరంలో ఆగి వున్న ఒక కారులో పడింది.
అంతలో అక్కడికి వురుక్కుంటా ఒకతను ముగ్గురు పిల్లలతో వచ్చినాడు. ''రేయ్‌-తొందరగా ఎక్కి కిటికీలు వేసేయండి. లేకుంటే కారంతా దుమ్ముతో గబ్బులేసి పోతాది అంటా గట్టిగా అరిచినాడు. వెంటనే పిల్లలంతా బెరబెరా లోపలికి దూరి సరసరా కిటికీలు వేసేసినారు.
సీతాకోకచిలుక ఆ పిల్లలను చూసి భయంతో వణికిపోయింది. ''అమ్మో... ఈ పిల్లలకు గానీ కనబన్నానంటే ఇంకేమన్నా వుందా... ఛటుక్కున రెక్కలు పట్టేసుకుంటారు. కొంచం గట్టిగా వత్తితే చాలు నుసినుసి అయిపోతాయి. బాధతో నరాలు జివ్వుమంటాయి. ఈ పిల్లలకు మంచేదో చెడేదో తెలీదు. వాళ్ళకేమో ఆనందం, మాకేమో చావు భయం అనుకుంటా నెమ్మదిగా వెనుక సీటు కిందికి పోయి మట్టసంగా దాక్కోనింది. కారు దాదాపు గంటసేపు రయ్యిమని పోయి ఒకచోట ఆగింది. పిల్లలు అంతా ఒక్కొక్కరే దిగుతా వున్నారు. అది చూసి సీతాకోకచిలుక ''వెంటనే తప్పించుకోవాలి. లేదంటే మళ్ళా తలుపులు వేసి కిటికీలు బిగించి వెళ్ళిపోతారు. లోపల గాలి వేడెక్కి వూపిరి ఆడక చచ్చిపోతా'' అనుకోనింది. వెంటనే సర్రున వాళ్ళ తలల మీద నుంచి ఎగురుకుంటా వేగంగా బైటకు వెళ్ళిపోయింది.
ఆ సీతాకోకచిలుకకు అక్కడ అంతా కొత్తగా వుంది. పచ్చని మొక్కలు లేవు. విచ్చిన పూవులు లేవు. పక్షుల కూతలు లేవు. చల్లని గాలులు లేవు. ఎక్కడ చూసినా ఆకాశమంత భవనాలు, రయ్యిమని తిరిగే వాహనాలు, చెవులు పగిలిపోయేలా చప్పుళ్ళు, ఆకాశమంతా నిండిపోయిన దుమ్ము మేఘాలు. సీతాకోకచిలుకకు ఇంటికి ఎలా పోవాలో తెలీడం లేదు. ఎవరు సాయపడతారా అని వెదకసాగింది. అలా వెదుకుతా వెదుకుతాపోతావుంటే ఆఖరికి ఒకచోట దానికి ఒక చిన్నపిట్ట కనబడింది.
వెంటనే సీతాకోకచిలుక సంబరంగా దగ్గరకు పోయి ''పిట్టమామా... పిట్టమామా నేను సీతాకోకచిలుకను. దారి తప్పిపోయినాను. నువ్వు నా ఇంటికి నన్ను తీసుకోని పోగలవా'' అని అడిగింది దీనంగా. పిట్టకు జాలి వేసింది. అది గూడా చిన్నప్పుడు వాళ్ళ అమ్మానాన్నల నుంచి తప్పిపోయినదే. వెదకీ వెదకీ అలసిపోయి ఒంటరిగా తిరుగుతా వుంది. అందుకే దానికి ఆ బాధ తెలుసు. దాంతో ''అల్లుడూ... బాధపడకురా... నేనున్నా గదా... చెప్పు నువ్వు ఎక్కడ వుంటావు'' అని అడిగింది.
అప్పుడు ఆ సీతాకోకచిలుక కళ్ళు మూసుకోని ''నాది చానా అందమైన తోట. ఎక్కడ చూసినా రంగురంగుల పూలతో కళకళలాడతా వుంటాది'' అనింది. ఆ మాటలకు పిట్ట నవ్వి ''అది కాదు అల్లుడూ... తోటలంటే చానా వుంటాయి. ముందు ఇది చెప్పు. నీ తోటకు చుట్టుపక్కల జంతువులు మొక్కలు వుంటాయా లేక ఇళ్ళు, మనుషులు వుంటారా'' అని అడిగింది. అప్పుడు సీతాకోకచిలుక ''మా తోట చుట్టూ మొక్కలూ, జంతువులే వుంటాయి మామా'' అని చెప్పింది. దానికి పిట్ట ''ఓహో... అలాగా... ఐతే అది అడవే. నాకు అడవి గురించి పెద్దగా ఏమీ తెలీదు. ఐనా దిగులు పడకు. ఏదయినా అడవి పావురం కనబడితే అడుగుదాం. నా వెంబడిరా'' అనింది.
రెండూ ఎగురుకుంటా ఎగురుకుంటా తిరుగుతా వుంటే ఒక చెట్టు మీద ఒక అడవి పావురం కనబడింది. వెంటనే పిట్ట దాని దగ్గరికి పోయి ''ఓ పావురం మామా... పావురం మామా... కొంచెం సాయం చేయవా. ఈ చిన్ని సీతాకోకచిలుక దారి తప్పిపోయింది'' అంటా జరిగిందంతా చెప్పింది.
అప్పుడు పావురం నవ్వి ''చూడండి అల్లుళ్ళూ ఈ వూరి చుట్టూ వుండే అడవిలో చానా తోటలు వున్నాయి. నీది ఏ తోటనో ఎలా కనుక్కోవడం. బాగా ఆలోచించు. తోట చుట్టుపక్కల ఇంకా ఏమైనా వున్నాయా'' అని అడిగింది.
సీతాకోకచిలుక బాగా ఆలోచించి ''ఆ... మతికి వచ్చింది. ఆ తోట పక్కనే ఒక పెద్ద చెరువు వుంది'' అనింది సంబరంగా. అప్పుడు ఆ పావురం నవ్వి చెరువులు ఎక్కడెక్కడ వుంటాయో కొంగలకు బాగా తెలుసు. అవి ఎప్పుడూ చేపల కోసం చెరువులను వెతుకుతుంటాయి గదా! దాన్ని పోయి అడుగు. నీ తోట ఎక్కడుంటాదో తెలిసిపోతుంది'' అనింది.
దాంతో పిట్ట, సీతాకోకచిలుక కలిసి ఎక్కడయినా కొంగ కనబడుతుందేమో అని వెదకసాగినాయి. అlaa తిరుగుతా తిరుగుతా వుంటే ఒకచోట ఒక పెద్ద కొంగ కనిపించింది. పిట్ట సంబరంగా కొంగ దగ్గరికి పోయి ''కొంగమామా... కొంగమామా... కొంచెం సాయం చేయవా... ఈ సీతాకోకచిలుక దారి తప్పిపోయింది'' అంటా జరిగిందంతా చెప్పింది.
అప్పుడు ఆ కొంగ కాసేపు ఆలోచించి ''చూడు అల్లుళ్ళూ... నాకు తెలిసి ఈ వూరికి చుట్టుపక్కల దాదాపు పది చెరువులు వున్నాయి. నీది ఏ చెరువో ఎలా కనుక్కోవడం. ఇంకొంచం బాగా ఆలోచించు. ఆ చెరువు గట్టున ఏమైనా వున్నాయా'' అని అడిగింది.
సీతాకోకచిలుక బాగా ఆలోచించి ''ఆ... మతికి వచ్చింది ఆ చెరువు గట్టున ఒక పెద్ద మామిడిచెట్టు వుంది'' అనింది సంబరంగా.
కొంగ నవ్వి ''నా చూపంతా చెరువులోని చేపలపైనే గానీ... చుట్టూ వుండే మొక్కలపై వుండదు. మామిడితోటలంటే చిలుకలకు బాగా తెలుసు. అవి ఎక్కడ మంచి పళ్ళున్నా వదలవు. పోయి వాటిని అడుగు'' అని చెప్పింది.
ఆ మాటలకు సీతాకోకచిలుకకు నీరసం ముంచుకు వచ్చింది. బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అది చూసి పిట్ట ''అల్లుడూ నువ్వు దిగులు పడకు. ఓపిక పడితే విజయం మనదే. చివరి వరకు పోరాడాల గానీ ఇలా సగంలోనే నీరసపడగూడదు. లే పోదాం'' అంటా తీసుకోని పోయింది.
రెండూ తిరుగుతా వుంటే ఒక చోట ఒక జామచెట్టు మీద ఒక రామచిలుక దోరకాయ కొరుకుతా కనబడింది. వెంటనే పిట్ట సంబరంగా చిలుక దగ్గరకు పోయి ''చిలుకమామా... చిలుకమామా... కొంచం సాయం చేయవా... ఈ చిన్ని సీతాకోకచిలుక దారి తప్పిపోయింది'' అంటా జరిగిందంతా చెప్పింది.
అది విని చిలుక నవ్వి '' నేనెప్పుడూ అలా పోలేదు గానీ... ఒకసారి మా మామ చెప్పాడు. ఇలాగే ఉత్తరం వైపు ఒక గంట సర్రున దూసుకోని పోతే ఒక చెరువు, దాని పక్కన రంగురంగుల తోట, చెరువు ఒడ్డున పెద్ద మామిడి చెట్టు వున్నాయట. ఒకరోజు పోయి తనివితీరా తిని వద్దాం అనుకుంటా వున్నా. బహుశా నీవు చెబుతున్న తోట అదే కావచ్చు'' అంటా ఎలా పోవాలో దారి చెప్పింది.
వెంటనే పిట్ట, సీతాకోకచిలుకను భుజం మీద ఎక్కించుకోని రివ్వున ఎగురుతా... అక్కడక్కడ ఆగి పళ్ళు తింటా... నీళ్ళు తాగుతా... సాయంకాలానికంతా చెరువుగట్టు మీద వున్న మామిడిచెట్టును చేరుకోనింది. ఆ పూలతోటను చూసేసరికి సీతాకోకచిలుక ''ఇదే మా తోట'' అంటా సంబరంగా ఎగిరి గంతులు వేసింది. తోటలోని మిగతా సీతాకోకచిలుకలన్నీ వాటి చుట్టూ గుంపయినాయి. జరిగిందంతా తెలుసుకోని పిట్టను బాగా మెచ్చుకున్నాయి. మంచి మంచి మాగిన మామిడి పళ్ళతో, తీయని తేనెతో గొప్ప విందును ఇచ్చినాయి.
***************************

కామెంట్‌లు