కందనవోలు అని ఒక నగరం వుండేది. అక్కడ జనాలందరూ హాయిగా కలసి మెలసి వుండేవాళ్ళు. ఎటువంటి గొడవలూ వుండేవి కాదు. కానీ అనుకోకుండా వాళ్ళకు ఒక ఆపద వచ్చి పడింది.
ఆ వూరిలో రోజుకొక ఇంటిలో దొంగతనం మొదలయ్యింది. దొంగ ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి వచ్చి పోతున్నాడో ఎవరికీ తెలిసేది కాదు. రాజభటులు, నగరంలోని యువకులు గుంపులు గుంపులుగా వీధులంతా కట్టెలు, కత్తులు పట్టుకొని కాపలా తిరగసాగినారు. కానీ దొంగ ఎవరికీ చిక్కలేదు. దొంగతనాలూ ఆగలేదు. దాంతో రాజు ఇలాగైతే లాభం లేదు అనుకోని ఎవరైతే ఆ దొంగను పట్టుకుంటారో వాళ్ళకి లక్ష బంగారు వరహాలు బహుమానమని చాటింపు వేయించినాడు.
ఆ వూరిలో ఆనందు అని ఒక పిల్లవాడు వున్నాడు. వాడు చానా తెలివైనోడు. 'ఎలాగైనా సరే ఆ దొంగను పట్టుకోని వాని ఆట కట్టించాలి' అనుకున్నాడు. దొంగతనం జరిగిన అన్ని ఇళ్ళు పరిశీలించి వచ్చినాడు. దొంగ ఏ ఇంటి తలుపులు పగలగొట్టలేదు. వేటికీ తాళాలు తీయలేదు.
దాంతో ఎలా లోపలికి పోతున్నాడా అని బాగా ఆలోచించసాగినాడు. అప్పుడు కిటికీలు కనబన్నాయి.
ఓహో... ఐతే... దొంగ కిటికీ ఊచల్లోంచి దూరి లోపలికి పోతున్నాడు. కానీ మనుషులు ఎంత చిన్నపిల్లలైనా అలా కిటికీల్లోంచి దూరలేరు. అంటే ఇది మనుషుల పని కాదన్నమాట.
మరి ఆ కిటికీలోంచి ఏవి వెళతాయి.
పక్షులు, జంతువులు...
ఏవైనా పక్షులు లోపలికి దూరి దొంగతనం చేసి పోతున్నాయా అని ఆలోచించినాడు. పక్షులయితే పిట్టలు, కాకులు, గద్దలు లాంటివి లోపలికి దూరతాయి. కానీ అవి ఎక్కడైనా బైట పెట్టిన నగలు, హారాలు ముక్కుతో పట్టుకొని ఎగిరి పోగలవు గానీ పెట్టెల మూతలు తీసి, బీరువాలు వెదికి నగలు తీయలేవు. కాబట్టి ఇది పక్షుల పని కాదు.
మరింకేమి వుంటాయి.
జంతువులు.....
జంతువుల్లో గూడా కుక్కలు, ఆవులు, ఎద్దులు, గుర్రాలు మొదలైన నాలుగు కాళ్ళతో నడిచేవి ఏవీ ఈ పని చేయలేవు. మరి రెండుకాళ్ళతో నడిచేవి ఏవి?
కళ్ళ ముందు తళుక్కున కోతి రూపం మెదిలింది.
కోతులైతే ఎటువంటి గోడలైనా ఎక్కగలవు. లోపలకు దూకగలవు. తలుపులూ కిటికీలు తీయగలవు. చిన్న చిన్న సందుల్లోంచి దూరగలవు. ఎత్తయిన చెట్టు మీద ఎవరికీ కనబడకుండా దాక్కోగలవు.
ఆనందుకి చిక్కుముడి వీడిపోసాగింది. నగరంలో కోతులు ఎవరు పెంచుకుంటున్నారా అని వెదుకుతా తిరగసాగినాడు.
అప్పుడు వానికి ఒక వీధిలో ఒక కోతులు ఆడించేటోడు కనబడ్డాడు. వాని వద్ద ఒక కోతి వుంది. అది చానా తెలివైనది. వాడు ఏ పని చెబితే ఆ పని తు.చ. తప్పకుండా చేసేది.
ఆరోజు చీకటి పడ్డాక ఆ కోతులు ఆడించేటోని గుడిసె వెనుక దాచిపెట్టుకోని గమనించసాగినాడు. కాసేపటికి వాడు ఒక్కడే బైలుదేరినాడు. నగరమంతా తిరుగుతా ఒక ఇంటి ముందు ఆగి ఒక అరటిపండు వేసి వెళ్ళిపోయినాడు. వాడు అలా వెళ్ళిపోగానే కోతి అక్కడికి వచ్చింది. అరటిపండు తిని ఆ ఇంటిగోడ దూకి లోపలికి వెళ్ళిపోయింది.
ఆనందు 'ఓహో! ఇదా సంగతి' అనుకోని సక్కగా రాజు దగ్గరికి పోయి జరిగిందంతా వివరించి చెప్పినాడు. వెంటనే రాజు సైనికులతో ఆ ఇంటిని తరువాత రోజు పొద్దున్నే చుట్టుముట్టినాడు. లోపలంతా వెదుకుతే ఎక్కడెక్కడ దొంగతనం చేసిన నగలన్నీ కనబడ్డాయి. వెంటనే రాజు 'వాన్ని, ఆ కోతిని బంధించి జైలులో వేయండి' అన్నాడు.
దానికి ఆనందు ''రాజా! ఆ కోతిని ఏమీ చేయకండి. దానికి మంచీ చెడు ఆలోచించే తెలివి లేదు. వీడు ఎలా చెబితే అలా చేయడం తప్ప దాని తప్పేం లేదు'' అన్నాడు.
రాజు ఆ కోతిని అడవిలో వదిలేసి వాన్ని జైలులో బంధించినాడు. ఆనందుకు లక్ష బంగారు వరహాలు కానుకగా ఇచ్చి వాని తెలివితేటలని మెచ్చుకున్నాడు.
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి