సుప్రభాత కవిత ; - బృంద
వేలవేల వర్ణాలతో
నేలను నింపిన
వెలుగుల వాన

అడ్డు ఏదీ ఆపనిదీ
అణువణువూ నిండినదీ
ఆదిదేవుని అనుగ్రహం

కిరణాలే ఘంటములై నేలపై
కమ్మని కావ్యాలు  వ్రాసే
భానుని ప్రకాశము

చెట్టూ పుట్ట చైతన్యమొంద
చెలువైన వన్నెలు నింపె
హిరణ్యగర్భుని ప్రభలు

అందరికీ ఎపుడూ 
అన్నిటా తోడుంటానంటూ
ఆదరించు ఆదిత్యుని కళలు

జగమును అమర పథముగ చేసి
జనులను సన్మార్గమున నడిపే
జన జీవన ప్రదాత దీవెనలు

వెలుగుల జల్లున తడిసిన
పుడమికి  పుట్టెడు వరములు 
పంచిన ప్రభాకరుని దీవెనలు

లోకానికి అండగా వచ్చే
వెలుగుల కుండకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు