సుప్రభాత కవిత ; - బృంద
గుండెలో సూటిగా  నాటిన
కిరణమేదో గుసగుస చెప్పినట్టు
కనులలో తన బొమ్మే  నింపుకున్న
కాసారం తృప్తిగా నవ్వినట్టూ...

కొండంత దీవెన నిండుగా
నింగినుండి  నేరుగా వచ్చి
సుమాలకు  వరమేదో
కోరుకున్న వెంటనే ఇచ్చినట్టూ

పుడమి నిండా అలుముకున్న
పుత్తడి వెలుగుల రేఖలు
పువ్వుల మోమున నవ్వులు
పూయించి మురిపించినట్టూ...

పాలమబ్బుల గుంపులు
పరుగుపరుగున  సాగి
పసిడి తేరున ఊరేగి వచ్చు
ప్రభాకరునికి జోతలు చేసినట్టూ..

స్వర్గానికి సొంతమైన 
ఆనందపు సీమలన్నీ
అవనిపైనే  అద్భుతముగా
ఆవిష్కరింప చేసినట్టూ..

కనులముందు కమ్మగా
కమనీయ కావ్యమేదో
కోకిల తన గళముతో
వీనుల విందుగా వినిపించినట్టూ

వెలుగుతున్న కాంతులతో
పెరుగుతున్న వెలుతురు
కోరుకున్న కోరికలను
ఏరి ఏరి ఎంచుకుని తీర్చినట్టూ

భువికి పండుగలాగా
కదిలివచ్చు దేవునిగని
ఎనలేని సంతోషముతో
ఎదనిండుగ ఆరాధనతో పలికే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు