వాడు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 వాడు ఏతల్లి కన్నబిడ్డో
వాడికి అక్షరాలేరావు, కానీ
అక్షరాలు రాసేందుకు పెన్నులమ్ముతాడు
వాడికి చదువేరాదు, కానీ
అర్థాలుచూపే నిఘంటువులమ్ముతాడు
వాడికి తొడుగ బట్టలేలేవు,కానీ
చక్కని దుస్తులమ్ముతాడు
వాడికి బొమ్మలతో ఆడుకోవడం తెలియదు, 
కానీ
చూడచక్కని బొమ్మలమ్ముతాడు
వాడికి ఏకారూ తెలియదు, కానీ
కార్లలోవాడే సామానమ్ముతాడు
వాడికడుపు వీపుకంటుకుపోయింది, కానీ
రకరకాల పళ్ళమ్ముతాడు
వాడికి పండుగలంటే తెలియదు, కానీ
క్రిస్మస్ కు టోపీలు,దసరా కు జమ్మిఆకు
చవితి కి గణేశ ప్రతిమలు, 
దీపావళి కి పటాకులు అమ్ముతాడు
వానాకాలం గొడుగులు, చలికాలం గరంటోపీలు
ఎండాకాలం తాటిముంజలు 
సీజనల్ గా అమ్ముతాడు
ఇలా అన్ని సీజన్లూ వాడివే
వాడు రోజూ మైళ్ళకొద్దీ నడుస్తాడు
గంపలకొద్దీ చిరునవ్వులపువ్వులు రువ్వుతాడు
వాడికడుపు అంట్లగిన్నైనా
వాడికళ్ళు శోకాశ్రుపుష్పస్వప్నశకలాలైనా
వాడికాళ్ళు విధివంచిత శాపగ్రస్తాలైనా
వాడికడుపు ఏరోజూ నిండలేదు
వాడు ఏతల్లి అవాంఛిత 
గర్భశుక్తిముక్తాఫలమో
తెలియని వాడు
వాడు ఈ ప్రపంచ విపణివీధుల్లో
నిలబడిన దిష్టిబొమ్మ!!!         
*******************************

కామెంట్‌లు