నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 చిదంబర రహస్యం 
--------------------------
     ఎప్పటికీ బయట పెట్టలేని రహస్యాన్ని చిదంబర రహస్యం అంటారు. ఈ భూమండలంలో  ఎన్నో వింతలు విచిత్రాలు ఉన్నాయి. అవి ఎవరికీ అంతుచిక్కవు. ఆఖరికి శాస్త్రజ్ఞులు కూడా వాటి గుట్టు విప్పలేరు. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటిలో ఓ ఆలయం ఉంది. అక్కడకు కాకులు రావు. అలాగే అక్కడ ఉన్నా నందీశ్వరుడు అంతకంతకు పెద్ద అవుతున్నాడట. దీనికి కారణం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు చిదంబర రహస్యం అనే నానుడిని ఉపయోగిస్తారు. ఈ చిదంబర రహస్యం వాడుక ఎలా వచ్చిందో చూద్దాం .
       చిదంబరం అనే ఊరు తమిళనాడు లో ఉంది. అక్కడ నటరాజ స్వామి దేవాలయం ఉంది .స్వామి మూడు రూపాలలో దర్శనమిస్తాడు . ఒకటి నటరాజు,  రెండు చంద్రమౌలేశ్వర స్పటిక లింగం, మూడు నిరాకారం. ఈ మూడోదైన ఏ ఆకారం లేని స్వరూపాన్ని దర్శించుకునేటప్పుడు భక్తులకు ఓ రహస్యం కనిపిస్తుంది. పంచ బూతాలలో  ఆకాశం ఓ బూతం. ఆ ఆకాశానికి గుర్తే ఈ నిరాకారం. ఇక్కడ భక్తులు  ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ధ్యానంలో చెప్పనలవికాని ఆనందం పొందుతారట. తన్మయత్వం చెందుతారట. ఇది ఎలా జరుగుతుందో అంతుపట్టడం లేదు. అందుకే ఆ ఆనందాన్ని చిదంబర రహస్యంగా చెప్తారు.  ఈ నిరాకార స్వామి గర్భాలయ వెనుక గోడ మీద ఓ చక్రం గీసి ఉంటుంది. దాని ముందు బంగారు మామిడి ఆకులు కట్టి ఉంటాయి. అవి కనిపించకుండా ఓ తెల్లటి తెర అడ్డంగా ఉంటుంది. పూజారులు ఈ తెరను తొలిగించగానే చక్రం, మామిడాకులు  రహస్యం కనిపిస్తుందట. మనం సాధారణ దృష్టితో చూస్తే అవి కనిపించవు. కానీ మన మనోనేత్రాలతో  చూస్తేనే చక్రం, మామిడాకులు కనిపించి ఆ ఆనందం పొందగలం. అదే ఆ  రహస్యం. ఆ రహస్యం ఏమిటో ఇంకా మీకు అర్థం కాలేదు కదూ? అదే మరి చిదంబర రహస్యం అంటే.
కామెంట్‌లు