నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 ససేమిరా 
------------         
         ససేమిరా అనే నానుడి మనం తరచు వింటూ ఉంటాం. ఎవరైనా మంకుపట్టు పడితే ససేమిరా అన్నాడు అంటూ ఉంటాం.  అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచటానికి సి.ఎమ్. జగన్మోహనరెడ్డి ససేమిరా అంటున్నాడు అనే వాక్యం దీనికి ఉదాహరణగా చెప్పుకోవొచ్చు.  తాను పట్టిన పట్టును వదలకుండా వుండే మనస్తత్వాన్ని ససేమిరా నానుడితో పోల్చటం పరిపాటి అయింది. ఈ నానుడి మంచన కవి రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలో ఉన్న ఓ కథ ఆధారంగా ఉద్భవించినట్టు చెబుతారు.  అదేమిటో చూద్దాం.
      పూర్వం విశాల నగరాన్ని నందుడు అనే రాజు పాలించేవాడు. అతడికి జయంతుడు అనే కొడుకు ఉండేవాడు. అతడు ఒట్టి మూర్కుడు. దురహంకారి. మంత్రిని, రాజోద్యుగులను లెక్కచేసేవాడు కాదు. తన ఇష్టానుసారంగా వ్యవహరించేవాడు. అతడి ప్రవర్తన తప్పని మందలించిన ముసలి మంత్రి  'శత నందుడిని' రాజ్యం నుండి భహిష్కరించాడు. 
     ఒక సారి అతడు వేటకు వెళ్ళాడు. క్రూర మృగాలు ఉన్నాయని ఎంతమంది చెప్పిన వినకుండా  అడవి మధ్యలోకి వెళ్ళాడు. కొంతసేపు వేటాడాడు. బాగా దాహం అయింది. నీటి కోసం వెతికి వెతికి విసిగి వేసారి ఓ చెట్టుకింద కూలబడ్డాడు. అంతలో ఓ పులి వచ్చింది . అతడు గబగబా చెట్టు ఎక్కాడు. అప్పటికే ఎక్కడ ఓ ఎలుగుబంటి ఉంది. అతడు భయంతో వణికిపోయాడు. రక్షించమని వేడుకున్నాడు. ఎలుగుబంటి ధైర్యం చెప్పింది. "భయపడకు నిన్ను కాపాడతాను" అని కిందపడకుండా తన ఒడిలో పెట్టుకుంది. వెంటనే కిందున్న పులి ఇలా చెప్పింది. "ఎలుగు మిత్రమా! ఈ మానవుడిని ఎందుకు కాపాడతావు.  వీడు మనిద్దరికి శత్రువే. వీడిని కిందకు తొయ్యి. హాయిగా తిని వెళ్లిపోతాను" అంది.  శరణు కోరి వచ్చాడు.  కాబట్టి శత్రువైన కాపాడాల్సిందే. ఇది ధర్మం" అని మరి కాస్త గట్టిగా పట్టుకుంది ఎలుగుబంటి.
       కొంత సేపటికి ఎలుగుబంటి నిద్రపోయింది.  కిందున్న పులి ఇలా అంది. " ఓ మానవుడా! ఎలుగును కిందకు నెట్టు. దాన్ని తిని నా దారిన నే పోతాను. నీ దారిన నీవెళ్లు" అంది.  వెంటనే వాడు ఎలుగుబంటిని కిందకు నెట్టాడు. అది అప్రమత్తంగా ఉండి సమయస్ఫూర్తితో  కొమ్మకు వేలాడుతూ కిందకు పడకుండా ఆగిపోయింది. కృతజ్ఞత చూపకుండా రక్షించిన నన్నే చంపటానికి ప్రయత్నించావు కనుక  "మతి భ్రమించి తిరుగు" అని శపించింది..
     అప్పటి నుండి వాడు మతిభ్రమించి తిరగసాగాడు. ఎవరేమి అడిగినా 'ససేమిరా' అనేవాడు. మరో మాట  పలికే వాడు కాదు.
     అలా తిరుగుతూ తిరుగుతూ తండ్రి పంపిన పరివారానికి దొరికాడు. అతడి దుస్థితికి  తండ్రైన రాజు ఎంతో చింతించాడు. వైద్యులతో చికిత్స చేయించాడు. మంత్ర వేత్తలకు చూపించాడు. అంత్రాలు వేయించాడు. అయినా ఫలితం లేదు. చివరికి రాజ్య బహిష్కరణకు గురైన మంత్రి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు.
         'ససేమిరా'' అనే ఈ నాలుగు అక్షరాలతో ప్రారంభిస్తు నాలుగు శ్లోకాలతో ఎలుగుబంటి కాదంత చెప్పాడు. అతడికి శాప విమోచన కలిగింది. మాములుగా అయ్యాడు. 
        ఇలా జయంతుడిలా మూర్ఖంగా ఉంటూ, ఎవరి చెప్పిన వినకుండా మంకుపట్టు పట్టె  విషయాన్ని గుర్తు చేసే సందర్భంలో  ఈ నానుడి వాడకంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కథను 'ససేమిరా' చదవను అనకండేం.. ఇప్పుడే చదవండి. సరేనా?
కామెంట్‌లు