శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం ; - : సి.హెచ్.ప్రతాప్
 శ్లో:: నమామి ధర్మ నిలయాం కరుణాం లోక మాతరం
పద్మప్రియాం పద్మ హస్తాం పద్మాక్షీం పద్మసుందరీం
పద్మోధ్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం
పద్మ మాలాధరం దేవీం పద్మినీం పద్మగంధినీం
అనుగ్రహ ప్రదాం బుద్ధిం అనఘాం హరివల్లభాం
అశోకా మామృతాం దీప్తాం లోకశోక వినాశినీం



కలియుగ దైవం, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం అయిన శ్రీ సాయినాధులు తమ భక్తులపై అనిర్వచనీయమైన ప్రేమను కనబరుస్తుండే వారు.కుల, మత, పేదా, ధనిక, వర్గ భేధాలు లేక అందరిపై తన కారుణ్యాన్ని సమానం గా కురిపిస్తుండే వారు. శ్రీ సాయినాధుని దివ్య ప్రేమకు పాత్రులైన వారు ఈ ప్రపంచం లో ఏ మారు మూల ప్రదేశం లో నివసించినా సరే క్షణాలలో అద్భుతాలను చవి చూస్తుండే వారు. అందుకు ఒక ఉదాహరణ ఈ క్రింద ఉదహరించిన లీల:
1910 వ సంవత్సరం లో ఘన త్రయోదశి పండుగ నాడు బాబా వారు మశీదులో ధుని ఎదుట కూర్చోని చలి కాచుకుంటున్నారు.ధుని బాగా మండడానికి కట్టెలను వేస్తున్నారు. శ్యామా, మాదవ్ లు బాబా వెనుకగా కూర్చోని వున్నారు. ఇంతలో హఠాత్తుగా బాబా కట్టెలకు బదులుగా తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా వుండిపోయారు. ఎంతో వేడిగా కాలుతున్న మంటలకు బాబా వారి చెయ్యి బాగా కాలిపోయింది.అయినా ఆయన లవలేశమైనా చలించలేదు. మాధవుడు, శ్యామాలు ఇది చూసి వెంటనే బాబా వారి నడుము పట్టుకొని బలం గా వెనుకకు లాగారు. కాలిపోయిన బాబా చేతులను చూసి " బాబా !ఈ విధం గా ఎందుకు చెసారు ?" అని ఏడుస్తూ అడిగారు. బాబా చిరునవ్వుతో " ఇక్కడకు చాలా దూరం లో వున్న గ్రామం లో నా భక్తురాలైన ఒక కమ్మరి స్త్రీ తన పిల్లవాడిని ఒడిలో వుంచుకొని కొలిమి కొడుతోంది.రోగ్ర గ్రస్తుడై మంచం లో వున్న ఆమె భర్త పిలవడం తో ఆమె తన బిడ్డను చూసుకోకుండా ఒకసారిగా లేచింది.ఒడిలో వున్న బిడ్డ కొలిమిలో పడ్దాడు. వెంటనే నేను నా చేతిని ఇక్కడ మంటలో పెట్టి అక్కడ బిడ్డను రక్షించాను. బిడ్దకు ఏం ప్రమాదం లేదు. అంతా క్షేమం గా వున్నారు" అని అన్నారు. ఆ మాటలను విన్న శ్యామా, మాధవ రావులు నిర్ఘాంత పోయారు.ఎక్కడో మారుమూల గ్రామం లో వున్న బిడ్దను రక్షించేందుకు బాబా తన చేతులను కాల్చుకోవడానికి సైతం వెనుకాడలేదు. బాబా వారి సర్వాంతతత్వానికి , కారుణ్యానికి, భక్త వత్సలతకు ఇంత కంటె ఇంకేమి ఉదాహరణ కావాలి ?
కొంతమంది బాబా భక్తులు ఇదంతా కట్టు కధ అని కొట్టిపారేసారు కాని నాలుగు రోజుల తర్వాత ఆ కుమ్మరి దంపతులు తమ బిడ్డతో శిరిడీకి వచ్చి బాబా కాళ్ళపై పడి తమ బిడ్డను రక్షించినందుకు తమకు కొత్త జీవితం ప్రసాదించినందుకు బాబాకు కన్నీటితో అభిషేకం చేసారు.అప్పటికి గానీ ఆ సంశయాత్మకులకు బాబా యొక్క దివ్య శక్తి అర్ధం కాలేదు.బాబా వారి రక్షణ కవచం ఎల్లవెలలా తమపై వుంటుందని, దానికి దేశ, కాల , మాన పరిస్థితులతో నిమిత్తం లేదని, దానిని పొందుటకు కావల్సింది కేవలం ధృఢమైన భక్తి శ్రద్ధలు, విశ్వాసం ఓర్పు మాత్రమేనని వారందరూ అనుభవపూర్వకం గా తెలుసుకున్నారు.మనం కూడా పై సద్గుణాలను అలవర్చుకొని బాబా వారి అనుగ్రహానికి పాత్రులౌదాం.

కామెంట్‌లు