నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 కర్కోటకుడు
------------------
     ఈ నానుడిని క్రూరుడు అని అర్థం వచ్చేందుకు ఉపయోగిస్తాం. అదేపనిగా కష్టపెట్టేవారిని, మేలు చేసిన వారికి కూడా కీడు తలపెట్టే వారిని కర్కోటకుడు అని పిలుస్తారు. కర్కోటకుడు అనే మాటలోనే చాలా కాటిన్యం దాగి ఉంది కదూ? కర్కోటకుడు  కథ ఏమిటో, ఆ పదం ఎందుకు వాడుకలోకి వచ్చిందో చూద్దాం.
       కాస్యప రాజుకు ఇద్దరు భార్యలు. వినత, కద్రువ. వారు ఒక రోజు విహారానికి వెళ్లారు. వారికి తెల్లని గుర్రం కనిపించింది. "అది పూర్తిగా తెల్లగా ఉంది" అంది వినతి. "కాదు కొంత భాగం నల్లగా ఉంది" అని వాదనకు దిగింది కద్రువ.  వాస్తవానికి ఆ గుర్రానికి ఎక్కడ నలుపు లేదు. గుర్రాన్ని బాగా పరిశీలించి  వాస్తవం తెలుసుకోవాలనుకున్నారు. అప్పటికే పొద్దు పోయింది. చీకటి ఆవరించింది. దీంతో మరునాటికి వాయిదా వేసి వెళ్లిపోయారు.
        కద్రువ ఎలాగైనా గెలవాలి అనుకుంది. తన సంతానమైనా నాగులను పిలిచింది. గుర్రాన్ని నల్లగా చేయమని అడిగింది. అందుకు పుత్రులెవరు అంగీకరించలేదు.  కానీ  కర్కోటకుడు అనే పాము మాత్రం తన తల్లి మాటను నెగ్గించాలి అనుకుంది. పొద్దునే వెళ్లి గుర్రానికి చుట్టుకుంది. దీంతో గుర్రం  నల్లగా కనిపించింది. కద్రువ గెలిచింది. కర్కోటకుడు అనే దుర్మార్గపు పాము సాయం వలన న్యాయం అన్యాయంగా మారింది. చేసుకున్న ఒప్పందం ప్రకారం మంచిదైన వినత చెడ్డదైన కద్రువకు  దాసి అయింది .
        ఒకసారి కర్కోటకుడు  మంటల్లో చిక్కుకున్నాడు. అదేసమయంలో భార్యను రాజ్యాన్ని పోగొట్టుకున్న  ఉత్తముడైన నలమహారాజు బికారిలా అడవిలో తిరుగుతున్నాడు. మంటల్లో గిలగిలలాడుతున్న కర్కోటకుడిని చూశాడు. వెంటనే వెళ్లి ఆ పామును బయటకు తీసి కాపాడాడు. కాపాడిన ఆ నలుడినే కర్కోటకుడు కఠినంగా కాటేశాడు. పాము విషముతో  నల్లగా మారి కురూపి అయ్యాడు. అందుకే విశ్వాసం లేకుండా  కష్టాలు పెట్టి  నష్టాలు కలగజేసే వారిని కర్కోటకుడు అనే నానుడితో పిలుస్తారు.
కామెంట్‌లు