సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -270
వ్యాల నకుల న్యాయము
*******
వ్యాలము అంటే కౄరమైన  సర్పము/ పాము.నకులము అంటే ముంగిస.
వ్యాల నకులము అంటే పాము,ముంగిస.
పాము,  ముంగిస అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది వాటి మధ్య గల జాతి వైరము.
సృష్టిలో  ఓ జంతువు వుంది అంటే దానికి కావలసిన ప్రధాన ఆహారపు ఏర్పాటు కూడా వుంటుంది.
అలా పిల్లికి  ఎలుక, పాముకు కప్ప ఎలుక, పులికి జింక... ఇలా ఒక జాతి జంతువులకు మరో  జాతి జంతువులు  ఆహారంగా వుండటం, వాటిని వేటాడి పట్టుకొని తినడం  ఈ సృష్టిలో మనం చూస్తూనే, గమనిస్తూనే ఉన్నాం.
అలా ముంగిసకు ప్రధానమైన ఆహారం పామే.అంతే కాకుండా ప్రబల శత్రువు కూడా పామే.బతకాలి అంటే ఆహారం కావాలి. ఇలా ఆహారం కోసము  శత్రు జంతువులను వేటాడాల్సిందే. కాబట్టి ముంగిస ఎంతో ధైర్యంగా , ఎలాంటి భయం లేకుండా విషపూరితమైన పెద్ద త్రాచుపామును సైతం వేటాడి తింటుంది.
పైగా పాము కనబడితే చాలు ఎదురెల్లి మరీ పోట్లాటకు సిద్ధం అవుతుంది.అలా వాటి పోట్లాటలో  తుది గెలుపు  ముంగిసలదే వుంటుంది..ఎప్పుడో ఓసారి ముంగిస బాగా అలసిపోయో పాము కాట్ల వల్ల గాయాల పాలయ్యో చనిపోతుంది తప్ప పాము విషానికి మాత్రం కాదట.
 సరే మరి ఈ  పాము, ముంగిసల జాతి వైరము గురించి ఓ న్యాయంగా చెప్పడంలో పూర్వీకుల ఆంతర్యం  ఏమై వుంటుందా అని ఆలోచించి చూస్తే...
మానవులకు ఎందుకు అన్వయించి  చూపారా ఈ న్యాయాన్ని అని నిశితంగా పరిశీలిస్తే వాస్తవాలు మనసును కలచి వేస్తాయి.గుండె బరువెక్కిస్తాయి.
కారణం మనుషులంతా ఒకే జాతి అయినప్పటికీ, అందరికీ తెలిసినప్పటికీ పాము ముంగిసల కంటే ఘోరంగా పోట్లాడుకోవడం.
ఇక వాళ్ళ వైరం ఎక్కడి దాకా  పోతుందంటే ఎదుటి వారి ప్రాణాలను సైతం తీసేవరకు.అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని    వేదనతో  బహుశా " ఈ వ్యాల నకుల న్యాయము"ను ఉదాహరణగా చెప్పివుంటారు.
ప్రకృతిలోని జంతువులు తమ మనుగడ కోసం పోట్లాడితే, కౄరత్వం గల మనిషి మాత్రం తన జాతిని మట్టుపెట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి లేదు కదా!.
 అందుకే ప్రతి వారూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనుషులమంతా ఒక్కటే.మన అందరిదీ ఒకే జాతి . మనమెవ్వరం ఈ భూమ్మీద శాశ్వతంగా ఉండే వాళ్ళం కాదన్న విషయం మరవొద్దు.బతికినంత కాలం  మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడిపితే మనసుకు, మనిషికి తృప్తి సమాజానికి మేలు జరుగుతుంది.కక్షలు కార్పణ్యాలు లేని  మానవ ప్రపంచం ఆవిష్కృతమైంది ఉంతుంది. అంతే కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు