సుప్రభాత కవిత - బృంద
చీకటి దుప్పటి ముసుగున
లోకం నిద్దుర పోయే వేళ

దూరపు కొండల మధ్యన
వెలుగులు తొంగిచూచు వేళ

మంచు పూలు మెత్తగా
కరిగి మల్లెలల్లే జారుతున్నవేళ

నింగిలోని నీలినీడలన్నీ
రంగుల చీరలయ్యే వేళ

పచ్చటి పట్టుచీర కొంగు
పుడమి సవరించుకొనువేళ

వెచ్చని ప్రేమలేవో దివినుండీ
భువికి దిగివచ్చి తాకువేళ

అరమోడ్పు కనులతో అవని
అమాయకంగా నవ్వే వేళ

వల వేసిన  వెలుగు వలపున
అలవోకగా చీకటి చెదిరినవేళ

కిసలయం  భూపాలంలో
కీర్తనేదో పాడేవేళ

కనుపాపల దీపాలతో
స్వాగతం పలికే వేళ

మనుగడ మధురం చేసే
మరో కొత్త ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు