శ్రీగణేశ నిమజ్జనo ; "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి: 99127 67098
    గణేశ నిమజ్జనము
 ఆధ్యాత్మిక చింతనము
     మనకు నేత్రపర్వము
 ఓశంకర ప్రియులార!
       ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ , )
👌శ్రీగణేశుడు.. శ్రీశివ పార్వతుల కుమారుడు! మనకుకనిపించే ప్రకృతికి అధిపతి.. శ్రీ మహా గణపతి! వినాయకుని జన్మనక్షత్రమైన "హస్త"కు అధిపతి.. బుధుడు. అందువలన, శ్రీమహా గణాధిపతి స్వామివారికి... గరికపోచలు, వివిధ పత్రములు, పుష్పములతో పూజిస్తాము! శ్రీస్వామివారి విగ్రహాలను మట్టితోనే చేస్తాము. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలుచేసి, కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసములు.. మున్నగు వాటిని; నైవేద్యాలుగా సమర్పించుతాము!
🔱శ్రీ స్వామివారిని తొమ్మిదిరోజులు సేవించిన తరువాత, మేళతాలతో జలము నందు నిమజ్జనం కావిస్తాము! ఇందులో.. ఒక వేదాంత రహస్యం ఇమిడియుంది!  
        ఈ చరాచర ప్రపంచ మంతా! పాంచభౌతిక మైనది! అనగా పంచభూతాల నుంచి జనించిన ప్రతీదీ.. సజీవ, నిర్జీవ పదార్థమూ; మధ్యలో.. ఎంత వైభవంగా కొనసాగుతుంది! ఇంకెంతో విలాసంగా గడుపుతుంది! అవసానదశలో.. పంచ మహాభూతములలో కలిసి పోవలసిందే! ఈ యధార్థ సత్యమును.. ఆరాధకులు, మరియు సాధకులు... ఆధ్యాత్మిక చింతనము ద్వారా అలవర్చు కోవాలి! శుభమస్తు!
🚩 దత్తపది : "ఆట - పాట - బాట - మాట" పదాలతో 
వినాయక నిమజ్జనోత్సవమును స్వేచ్ఛాఛందంలో వర్ణించిన పద్యరత్నములు.. 
           🔆🪷🔆
      🚩తేటగీతి పద్యము
   అలికఫలకాన ముంగురు లాటలాడ 
    ప్రక్కలను జేరి భక్తులు పాటపాడ 
     మాత కిచ్చిన మాటను మరువకుండ
     వక్రతుండుడు తనయింటి బాటబట్టె!
        [ రచన: జంధ్యాల జయశంకర బాపూజీ., ]
         🔆🪷🔆
      🚩 మత్త కోకిల వృత్తం
    ఆటలాడుచు భక్తులందరు, హర్షమందుచు సాగిరే
    పాటవంబులు సూపుచున్, పలుపాటలన్ భజియించుచున్
     బాటలందున పూల జల్లుచు, వక్రతుండుని యాత్రలో
     మాటలందవు భక్తిభావ నిమజ్జనోత్సవ వేళలన్.
      ( రచన: అల్వాల లక్ష్మణ మూర్తి.,)
            🔆🪷🔆
 🚩శంకరాభరణ వృత్తం 
     ఆటలన్నియు నీకె రారా! ఆనందరూపా! గణేశా!
     పాటలన్ మురిపింతు రారా! పాపఘ్న! విఘ్నేశ దేవా!
     బాటలన్ని నిమజ్జనమ్మున్ భావింప నిండెన్ జనాలన్
     మాటలే కరువయ్యె వర్ణింపన్ నేత్రపర్వంబు గాదే!
     [ రచన: మైలవరపు మురళీకృష్ణ., ]
       🔱 "శంకరాభరణం" సమూహంవారి సౌజన్యంతో..
🕉️ గం గణపతయే నమః!

కామెంట్‌లు