సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -279
శీతకిరణ కరావలంబన న్యాయము
****
శీత కిరణః అంటే చంద్రుని కిరణాలు. కర అంటే చేయి లేదా హస్తం.ఆవలంబం అంటే ఆలంబన.కరావలంబం అంటే చేతితో పట్టుకోవడం.
చంద్రుని కిరణాలను చేతులతో పట్టుకోవాలని ప్రయత్నించడమన్న మాట.
చంద్రుని కిరణాలనైనా, సూర్యుని కిరణాలనైనా ఎవరమూ పట్టుకోలేము. వాటిని చల్లగానో,వేడిగానో, మరో విధంగానో అనుభూతించడమే కానీ పట్టలేము కదా! .
 మరి కాంతి కిరణాల గురించి కొంత సమాచారం తెలుసుకుందాము. 
కాంతి ఏ ఋజు మార్గంలో ప్రయాణిస్తుందో ఆ ఋజు మార్గాన్ని చూపే సరళరేఖను కాంతి కిరణం అంటారు.అనేక కిరణాల సమూహాన్ని కాంతి కిరణ పుంజం అంటారు. ఇలా అవి ప్రయాణించే దశలను, దిశలను గురించి భౌతిక శాస్త్ర పరంగా చెప్పగలము.కానీ ఏ పండులానో ,పువ్వు లానో వాటిని చేతులతో పట్టుకోజాలము.
అవన్నీ భౌతిక శాస్త్ర పరమైన విషయాలు కదా! మరి మనకు ఈ న్యాయం గురించి పెద్దవాళ్ళు ఎందుకు చెప్పినట్లు అని ఆలోచన చేస్తే.... దీనిని ఎంతో  నిశితంగా పరిశీలించి మానవ జీవితానికి అన్వయించి చూపారని అర్థమవుతుంది.
అది ఎందుకు,ఎలానో చూద్దామా...
గగన కుసుమం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం, మనసును అదుపులో పెట్టుకోవడం.. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కానివి. ఆకాశమే శూన్యం.ఆ  శూన్యం నుంచి కుసుమాన్ని తేలేం కదా!.అలాగే  శూన్యమైన ఆకాశానికి నిచ్చెనలు వేయడమూ అసంభవమే.
ఇక మనసు ఒక సముద్రం లాంటిదైతే అందులోని ఆలోచనలు అలల వంటివి. వాటిని ఆపడం,చేతులతో పట్టుకోవడం సాధ్యమవుతుందా? కాదని మనందరికీ తెలిసిందే.
అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ఉంది  అదేంటో చూద్దామా...
 ఒకానొక వ్యక్తి ఓ గురువు గారి దగ్గరకు వెళ్ళి "అయ్యా గురువు గారూ! నా మనసులో ఆలోచనలు  ఆగకుండా నిరంతరం వస్తూనే ఉన్నాయి.వాటితో చిరాకు, తలనొప్పి కలుగుతోంది .వాటిని ఆపే మార్గం చెప్పమని అడుగుతాడు.
 అప్పుడు గురువు గారు  ఆ వ్యక్తిని సముద్రం ఒడ్డుకు తీసుకుని వెళ్తాడు.అక్కడ  అతడికి ఓ చెంచా ఇచ్చి సముద్రంలోని అలలు ఆగినప్పుడు ఆ చెంచాతో అందులోని నీళ్ళు పట్టుకుని రమ్మని చెప్తాడు.
అప్పుడా వ్యక్తి "జీవితాంతం ఇక్కడే గడుపుతూ కదలకుండా సముద్రాన్ని గమనించినా ఆ అలలు ఆగవు.నేనా నీళ్ళు తేలేను" అంటాడు.
అప్పుడు గురువు గారు నవ్వుతూ "మనిషి మనసు ఓ సముద్రం. అందులోని ఆలోచనలు అలల వంటివి. వాటినుండి తప్పించుకోపడం సాధ్యమయ్యే పని కాదు. కానీ వాటి నుండి పక్కకు తప్పుకోవాలంటే ఏదో ఒక పనిని కల్పించుకుని చేస్తూ వుండాలని చెబుతాడా గురువు గారు.
అలా అసాధ్యమైన వాటిని గురించి  అతిగా ఆలోచన చేయకుండా,పట్టుకోవాలనే అసంభవమైన  కోరికలను పెంచుకోకుండా, సాధ్యమైన వాటినే చేస్తూ వుంటే సంతృప్తి, సంతోషం కలుగుతాయి. గుప్పిట్లో పొగను పట్టుకోలేమని తెలుసు కదా . మరి వృధా ప్రయాస పడటం ఎందుకనే అర్థం ఈ "శీత కిరణ కరావలంబన న్యాయము"లో దాగి ఉంది. కాబట్టి అసంభవాల జోలికి వెళ్లకుండా, సంభవాలు, సాధ్యాలూ ఏమున్నాయో గమనించి వాటి దిశగా అడుగులు వేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు