*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *శతరుద్ర సంహిత --(0291)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

శివ భగవానుని అష్టమూర్తులను, అర్ధనారీశ్వర రూప వర్ణన........

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*

*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు: 
*పరమేశ్వరుని "అర్ధనారీశ్వర" రూప వర్ణన*
*సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ యొక్క కోరిక తీర్చడానికి, ఈ అర్ధనారీశ్వర రూపం చూపించారు, శంభుడు. బ్రహ్మ సృష్టి ఆరంభమైనా కానీ, వారితో సృష్టింపబడిన జీవులు ఈ విశ్వం అంతటా కనిపించడంలేదు. బ్రహ్మ ఒకరిని సృష్టి చేస్తే ఒకరు, పది మందిని సృష్టి చేస్తే పదిమంది గానే ఉంటున్నారు, గానీ వృద్ధి చెందడంలేదు. ఇది చూసి ఆలోచనలో ఉండిపోయారు, బ్రహ్మ. అప్పుడు, "బ్రహ్మ దేవా! ఇప్పుడు మైథునీ సృష్టి చేయవలసింది" అని అశరీరవాణి వినిపించింది. "మైథుని, మిథునము అంటే, స్త్రీ, పురుష దాంపత్యము. ఈ దాంపత్యజీవనుము వలన పిల్లలు కలుగుతారు. అప్పుడు, మీచే చేయబడ్డ సృష్టి వృద్ధి చెందుతుంది." అని చెప్పి ఆకాశవాణి అదృశ్యం అవుతుంది.*

*మైథునీ సృష్టి చేసే ఆలోచనలో ఉన్న, పద్మయోనియగు బ్రహ్మ, తనకు మైథుని సృష్టి చేయడం కుదరదు, అని తెలుసుకున్నారు. ఎందుకంటే, అప్పటి వరకు పరమేశ్వరుని నుండి స్త్రీ జాతి ప్రకటితము కాలేదు కనుక. శంభుని కృప లేకుండా తాను చేయదలచుకున్న మైథునీ సృష్టి కార్యము, పూర్తి కాదని తెలుసుకుని, శివా సహితుడు అయిన శివుని మనసులో నిలుపుకుని, ధ్యాన తపస్సులో కూర్చున్నారు.*

*బ్రహ్మ కోరే తపఃఫలము తెలిసిన శంకరుడు, ఆయన కోరిక తీర్చడానికి అర్ధనారీశ్వర రూపంలో, అయన ముందు ప్రకటితమయ్యారు. స్వామి రాకను తెలుసుకున్న బ్రహ్మ, సాష్టాంగ దండప్రణామము చేసారు. విశ్వకర్త, దేవాధిదేవుడు అయిన సాంబుడు, "ప్రజాభివృద్ధిని కోరి నీవు చేసిన ఈ తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీ కోరిక తీరుస్తాను" అని చెప్పి, ఒకే శరీరంలో తనతో సగభాగంగా ఉన్న ఉమను వేరు చేసారు. శివుని నుండి వేరుపడిన పార్వతిని చూసి, "సృష్టి ప్రారంభంలో, దేవాధిదేవుడైన నీ భర్త శంకరుడు, నన్ను సృష్టించారు. నేను, దేవతాది సమస్త ప్రజలను, పదే పదే, మానసికంగా సృష్టించాను. కానీ, వారి వృద్ధి కలుగలేదు."

*"శివే! ఇప్పుడు నేను స్త్రీ పురుషుల సంయోగము చేత సృష్టి వృద్ధి చేయదలచుకున్నాను. ఇప్పటి వరకు నీ కటాక్షము లేక అక్షయమగు స్త్రీ జాతి ప్రకటితము కాలేదు. స్త్రీ జాతిని సృష్టించే శక్తి నాకు లేదు. నీవు పరమ శక్తివి, కనుక నారీ శక్తిని సృష్టించ గలిగే వరం నాకు ప్రసాదించు. ఇది నీవు మాత్రమే చేయగలవు. నీచే ఇవ్వబడే ఈ వరము వలన జగత్తు ప్రాదుర్భావం జరుగుతుంది. కనుక, దయతో ఆ వరమును నాకు ఇవ్వు, జగజ్జననీ!" అని బ్రహ్మ ఉమను వేడుకున్నారు. "అమ్మా, నా కోరిక తీర్చడానికి నీవు, నా కుమారుడైన దక్షునకు కుమార్తెగా పుట్టాలి, తల్లీ" అని కోరారు బ్రహ్మ. "తథాస్తు" అని తన కనుబొమల మధ్య నుండి తనతో సమానమైన శక్తని సృష్టి చేయగా అది చూచిన, పరమేష్టి, "దేవీ! బ్రహ్మ నిన్ను ప్రార్ధించినారు, కనుక, నీవు ఆతని ఎడల ప్రసన్నురాలవై, ఆతని కోరిక నెరవేర్చ"మన్నారు. శివాజ్ఞ మేరకు, సతీ దేవి అట్లే అని, దక్షుని ఇంట కుమార్తెగా జన్మించింది. మరల శివుని శరీరంలో కలసి " అర్ధనారీశ్వర" రూపంలో నిలిచింది. మైథునీసృష్టి ప్రారంభమైంది. ఈ అర్ధనారీశ్వర రూప వర్ణన, సత్పరుషులకు మంగళప్రదము.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss
కామెంట్‌లు