ఒకూర్లో ఒక అవ్వ వుండేది. ఆ అవ్వ రోజూ పొద్దున్నే ఇంటి ముందు నున్నగా కసువు కొట్టి, పేడనీళ్ళు చల్లి, ముచ్చటయిన ముగ్గులు పెట్టేది. ఒకరోజు ఇంటి ముందు కసువు కొడ్తా వుంటే తెల్లని కోడిగుడ్డు ధగధగా మెరిసిపోతా కనబడింది. అవ్వ దాన్ని తీసుకోనొచ్చి అట్టు వేసుకుందామని పొయ్యి మీద పెట్టింది. పెనం బాగా సలసలసల కాగినాక పగలగొట్టడానికని గుడ్డు చేతిలోకి తీసుకోనింది.
అంతలో... దాని లోపలి నుంచి ''అవా... అవా... జాగ్రత్త... కొంచెం నెమ్మదిగా పగలగొట్టు'' అని వినబడింది. ''ఇదేందిరా నాయనా... కోడిగుడ్డు మాట్లాడ్తా వుందని అవ్వ ఆశ్చర్యపోయి దాన్ని జాగ్రత్తగా పట్టుకోని నెమ్మదిగా పగలగొట్టింది. అంతే... లోపల్నుంచి మన బొటనవేలుంటాది గదా... అంత చిన్న పొట్టెగాడు కిలకిలకిల నవ్వుకుంటా బైటికొచ్చినాడు. అవ్వ వాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకోని, వేడినీళ్ళు కాచి తలస్నానం చేపిచ్చి... మెత్తని బట్టతో శుభ్రంగా తుడిచి... చక్కగా పాపిడి దీసి దువ్వి, ముద్దు పెట్టుకోనింది.
పొట్టోడుండేది వేలెడంతనే గదా... మరి వానికి బట్టలెట్లా... అందుకని అవ్వ వాని కోసం రంగురంగుల బట్టముక్కలు తెచ్చి చిన్న అంగీ, చిన్న ప్యాంటు, చిన్న టోపీ కుట్టిచ్చింది. వాడు రంగురంగుల ప్యాంటూ అంగీ వేసుకోని, నెత్తిన టోపీ పెట్టుకోని ''మా మంచి అవ్వ'' అని సంబరంగా అవ్వను ముద్దు పెట్టుకున్నాడు.
పొట్టోడు ఒకరోజు ఇంట్లో తిరుగుతా వుంటే ఒక మూలన కొన్ని చెక్కముక్కలు కనబన్నాయి. అవన్నీ ఒక చోటేసుకోని ఉలి, రంపం, సుత్తి తెచ్చి కష్టపడి ఒక చిన్నబండి తయారు చేసుకున్నాడు. బండికి మంచి రంగులేసి పూలు కట్టినాడు. రెండు ఎలుకల్ని పట్టుకోనొచ్చి బండికి కట్టినాడు.
కట్టినాక ఇంగ బండిమీదెక్కి ఛల్ ఛల్ అనుకుంటా సంబరంగా వీధుల్లో అటూ యిటూ తిరుగుతా వుంటే దారిలో వానికి ఒకచోట ఒక రాగిబిళ్ళ దొరికింది. దాన్ని తెచ్చి అవ్వకిచ్చినాడు. అది చూసి అవ్వ ''ఒరేయ్... రాగిబిళ్ళ దొరికినోనికి రాజు కూతురితో పెండ్లయితాదంట... పో... పోయి... చేస్కోని రాపో'' అనింది.
పొట్టోడు సరేనని అవ్వ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకోని బండెక్కి రాజు కూతురిని పెండ్లి చేసుకోడానికి బైలుదేరినాడు. అట్లా పోతావుంటే దారిలో ఒక నల్లపిల్లి ఎదురయి ''పొట్టి బావా... పొట్టిబావా... యాడికెళుతున్నావ్'' అనడిగింది. దానికి వాడు ''రాజు బిడ్డను పెండ్లి చేసుకోడానికి'' అని చెప్పినాడు. ''ఐతే నేనూ వస్తా... నన్ను గూడా తీస్కోనిపో'' అనిందా పిల్లి.
వాడు సరేనని తలూపి ''ఈ చెవిలోకెక్కు'' అని దాన్ని ఎడమ చెవిలోకి ఎక్కించుకున్నాడు.
మళ్ళా పోతావుంటే దారిలో ఒక చిరుతపులి ఎదురయి ''పొట్టిబావా... పొట్టిబావా... ఎక్కడికెళుతున్నావ్'' అనడిగింది. దానికి వాడు ''రాజు బిడ్డను పెండ్లి చేసుకోడానికి'' అని చెప్పినాడు. ''ఐతే నేనూ వస్తా... నన్ను గూడా తీస్కోనిపో'' అనిందా పులి. వాడు సరేనని తలూపి దాన్ని కుడిచెవిలోకి ఎక్కించుకున్నాడు.
మళ్ళా నెమ్మదిగా ఛల్‌ఛల్‌మని ఎలుకల్ని అదిలిస్తూ పోతావుంటే దారిలో ఒక పెద్ద సముద్రమంత చెరువు అడ్డమొచ్చింది.
పొట్టోడంటే మామూలు పొట్టోడు కాదు గదా... పెద్ద అసాధ్యుడు. వెంటనే నోరు తెరచి అంత పెద్ద చెరువులోని నీళ్ళన్నిటినీ ఒక్క చుక్కకూడా మిగలకుండా సయ్యని పొట్టలోకి పీల్చేసుకున్నాడు. మళ్ళా ఛల్ ఛల్‌మని ఎలుకల్ని అదిలిస్తా సాయంత్రానికల్లా రాజ్యానికి చేరుకున్నాడు.
రాజు సభలో సింహాసనంపై కూచోనున్నాడు. పొట్టోడు చక్కగా లోపలికెళ్తా వుంటే భటులు అడ్డంపడి లోపలికి వెళ్ళనియ్యలేదు. వాడు సరేనని నెమ్మదిగా బండి వెనక్కి తిప్పి ఒక్కసారిగా ఛల్‌మని ఎలుకల్ని అదిలించి కండ్లు మూసి తెరిచేలోగా భటుల కాళ్ళసందుల్లోంచి రయ్యిన లోపలికి దూసుకోని పోయి సభ మధ్యలో బండి ఆపినాడు. రాజు వాన్ని చూసి కండ్లెర్ర జేస్తా ''ఎవర్రా నువ్... నా అనుమతి లేకుండా సరాసరి నా ముందుకొచ్చినావ్'' అన్నాడు కోపంగా. దానికి వాడు బండి మీద నుండి కిందికి దిగి ఏ మాత్రం భయం లేకుండా ''రాజా... నేను నీ కూతుర్ని పెండ్లి చేసుకోవడానికి వచ్చినా, నాకు నీ కూతురినిచ్చి మర్యాదగా పెండ్లి చేయ్'' అన్నాడు.
ఆ మాటలింటానే రాజుకి చిర్రెత్తుకొచ్చింది. వాన్ని కోపంగా ఎగాదిగా చూస్తా ''వేలెడంత లేవు... నీకు నా కూతురు గావాల్నా... రేయ్ ఎవరక్కడ'' అన్నాడు. వెంటనే సైనికులు పరుగెత్తుకోనొచ్చినారు. ''రేయ్... వీన్ని తీస్కోనిపోయి మన కోళ్ళ కొట్టంలో పాడెయ్యండ్రా... అవన్నీ వీన్ని పొడిచి పొడిచి చంపేస్తాయి'' అన్నాడు. సరేనని సైనికులు వాన్ని పట్టుకోని పోయి కోళ్ళ కొట్టంలో పడేసినారు.
కోళ్ళన్నీ ఒక్కసారిగా పొట్టోనొంక చూసినాయ్. ''కొక్కరోకో'' అని అరుస్తా పొడవడానికి ముందుకు వురుక్కుంటా వచ్చినాయి. వెంటనే వాడు ఎడమ చెవిలోని పిల్లిని పిల్చినాడు. అంతే అది 'మ్యావ్' అని భయంకరంగా అరుస్తా ఎగిరి కోళ్ళ మీదకి దుంకింది. ఇంకేముంది... కోళ్ళన్నీ పరుగో పరుగు. పిల్లి దాన్ల వెంటపడి దొరికిందాన్ని దొరికినట్టు మట్టసంగా చంపి తినేసింది. పొద్దున్నే భటులొచ్చినారు. చూస్తే ఇంకేముంది. పొట్టోడు హాయిగా కిలకిల నవ్వుతా కులాసాగా కనబన్నాడు. భటులు వురుక్కుంటా... రాజు దగ్గరికి పోయి ''రాజా... రాజా... ఆ పొట్టోడు మామూలోడు గాదు. మన కోళ్ళన్నిటినీ ఒక్కటిగూడా మిగలకుండా చంపి తినేసినాడు'' అని చెప్పినారు.
రాజుకి కోపం పెరిగిపోయింది. ''అట్లాగా... ఐతే వాన్ని పట్టుకోని పోయి మన ఎద్దుల కొట్టంలో పడేయండ్రా'' అన్నాడు. భటులు అలాగేనంటూ పొట్టోన్ని పట్టుకోని పోయి ఎద్దుల కొట్టంలో పడేసినారు. ఎద్దులంటే మామూలు ఎద్దులు కాదు. రాజుగారి ఎద్దులు. బాగా తినీ తినీ బలిసి కొవ్వెక్కి ఒక్కోటీ, ఒక్కో ఏనుగులాగున్నాయి. పొట్టోడు ఏ మాత్రం బెదరలేదు. వెంటనే కుడిచెవిలోని చిరుతపులిని పిల్చినాడు.
అంతే... చిరుతపులి గాండ్రిస్తా ఎగిరి ఎద్దుల మీదికి దుంకింది. పులిని చూస్తానే ఎద్దులన్నీ వురుకో వురుకు. పులి దాన్లెంబడి పడి దొరికిందాన్ని దొరికినట్లు చంపి తినేసింది. తర్వాత రోజు పొద్దున్నే భటులొచ్చి చూసినారు. చూస్తే ఇంకేముంది పొట్టోడు హాయిగా కిలకిలకిల నవ్వుతా కనబన్నాడు. భటులు వురుక్కుంటా రాజు దగ్గరికి పోయి ''రాజా... రాజా... ఆ పొట్టోడు మన ఎద్దుల్ని గూడా చంపి తినేసినాడు'' అని చెప్పినారు. రాజు ఆశ్చర్యపోయి ''ఇట్లా కాదు గానీ... వాన్ని తీసుకోని పోయి మంటల్లో యేసి కాల్చండ్రా'' అన్నాడు.
భటులు పొట్టోన్ని పట్టుకోని పోయి పెద్ద ఎండుగడ్డి వాము మీద పడేసి... గడ్డునూనె తెచ్చి వామంతా బాగా చల్లి నిప్పంటించినారు. అంతే... భగ్గున గడ్డంటుకోనింది. ఐనా పొట్టోడు ఏమీ భయపళ్ళేదు. ఒక్కసారిగా కడుపులో దాచిపెట్టుకున్న నీళ్ళన్నీ నెమ్మదిగా వదలసాగినాడు. మంటంతా ఆరిపోయింది. ఐనా నీళ్ళు వదలడం మాత్రం ఆపలేదు. వదుల్తూనే వున్నాడు. దెబ్బకి ఇండ్లు, చెట్లు, పశువులు అన్నీ కొట్టుకుపోసాగినాయి. జనాలంతా వురుక్కుంటా రాజు దగ్గరికి పోయి ''రాజా... రాజా... కాసేపాగితే రాజ్యమంతా మునిగి అందరూ చచ్చిపోయేట్టున్నారు. నీవే ఎట్లాగయినా మమ్మల్ని కాపాడాల'' అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
రాజుకి పొట్టోడు సామాన్యుడు కాదని అర్థమయిపోయింది. వురుక్కుంటా... పొట్టోని దగ్గరికి పోయి ''తప్పయిపోయింది నన్ను క్షమించు. నా కూతురిని నీకిచ్చి పెండ్లి చేస్తా. నా రాజ్యాన్ని నాశనం చేయొద్దు'' అని బతిమలాడాడు. అప్పుడు పొట్టోడు సరేనని నీళ్ళన్నీ వెనక్కు పీల్చేసుకున్నాడు. రాజు ఇచ్చిన మాట ప్రకారం పల్లకీ మీద పొట్టోన్ని ఎక్కించి మేళతాళాలతో రాజభవనానికి తీసుకొచ్చినాడు. తరువాత రోజు జనాలందరినీ పిలిచి భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరీ వేసి ఏడేడు పధ్నాలుగు లోకాలు అదిరిపోయేటట్లు బ్రమ్మాండంగా పెండ్లి చేసినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి