కోటకొండ మొనగాడు (జానపద కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక వూర్లో ఒక మొనగాడున్నాడు.  వాడు ఆరడుగుల ఎత్తు, కండలుదీరిన ఒళ్ళు, మెలితిరిగిన మీసాలు, సింహంలాంటి గొంతుతో దేనికయినాసరే సయ్యంటే సయ్యంటూ అందరికన్నా ముందుండేటోడు.  వానంత వీరుడు ఆ చుట్టుపక్కల వూర్లలో యాడాలేడని పేరు.  అంతేగాదు వానికి చిన్నప్పటి నుండి అస్సలు భయమంటే ఏమిటో గూడా తెలీదు.  అర్ధరాత్రి శ్మశానంలో ఒంటరిగా పండుకోమన్నా పండుకునేటోడు.
ఆ వూరికి పక్కనే మానపాడు అని మరొక వూరుంది.  ఆ వూరిబైట మర్రిచెట్టు మీద ఒక దయ్యం వుంది.  అది భలే అల్లరిది.  రాత్రిపూట ఎవరయినా సరే ఆ దారెంబడి వచ్చినారంటే చాలు వాళ్ళ మీద బడి నానా అల్లరీ చేసేది.  దాని దెబ్బకు బెదపడి జనాలు కిందా మీదా పడి వురుకులాడ్తా వుంటే పడీపడీ నవ్వుకునేది. 
దాంతో చీకటిపడ్తే చాలు ఎవరయినా సరే...ఎంత పనున్నా సరే... చస్తేగూడా అటువైపు పోయేటోళ్ళు కాదు.
ఒకరోజు మన కోటకొండ మొనగాడు పనిబడి వాళ్ళత్తోళ్ళ వూరికి పోయినాడు.  పనయిపోయేసరికి బాగా చీకటిపడింది. వాళ్ళత్తోళ్ళ వూరి నుండి తిరిగి కోటకొండకు రావాలంటే మధ్యలో మానపాడు దాటాల.  వీనికి భయమంటే ఏమిటో తెలుస్తే గదా...బైలుదేరినాడు.  అది చూసి వాళ్ళత్తామామా ''అల్లుడూ... అల్లుడూ... మానపాడు దయ్యం మంచిదిగాదు. చూసిందంటే చాలు మీదపడి భయపడిస్తాది.  రాత్రయిందంటే ఆ దారెంబడి ఎవరూ పోరు.  నీవు గూడా ఈ రాత్రికి ఈన్నే పండుకోని రేప్పొద్దున్నే పో'' అన్నారు.  కానీ అట్లాంటి దాండ్లకు మనోడు బెదపడేరకం కాదు గదా... ఉత్త చేతుల్తో పులులను చంపేంత మొనగాడు వాడు.  అందుకే వద్దు...వద్దంటున్నా వినకుండా కత్తి బొడ్డుకాడ దోపుకోని బైలు దేరినాడు.
వాడట్లా...ఆ చీకటిలో... ఒక్కడే... నడుస్తా... నడుస్తా... నెమ్మదిగా మానపాడు చేరుకున్నాడు.  దూరంగా మర్రిచెట్టు కనబడింది.  వాళ్ళత్తామామ చెప్పినేది గుర్తుకొచ్చి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటా...అటూయిటూ గమనిస్తా పోసాగినాడు.
వాడు సరిగ్గా ఆ చెట్టు కిందకి వచ్చినాడో... లేదో... వీని సంగతి తెలీని ఆ దయ్యం పైనుండి ''ఓ'' అని అరుస్తా ఎగిరి వాని మీదకి దుంకింది.  కానీ వాడు భయపడ్తేనా...ఉత్తచేతుల్తో పెద్దపులిని ఎదిరించినోడు... దయ్యమట్లా దుంకడం... దుంకడం... లటుక్కున దాని జుట్టు పట్టుకోని గిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టి... ఛటుక్కున  బొడ్లో నుండి కత్తి తీసి పరపరపర దాని జుట్టు కోసేసినాడు. ఆ జుట్టంటే దానికి చానా చానా ఇష్టం.  దాంతో అది లబోదిబోమని ఏడుస్తా వాని కాళ్ళు పట్టుకోని ''పొరపాటయింది... ఇంగ జన్మలో మరలా ఎప్పుడూ  మనుషుల జోలికి రాను... నా జుట్టు నాకియ్యి'' అని వెంటపడింది.
వాడు ఆ జుట్టును బొడ్లో దోపుకోని ''నా ఎంబడే వచ్చి...నేను చెప్పిన పనులన్నీ చెయ్యి...అప్పుడిస్తా'' అన్నాడు.  సరే అని అది వానెంబడే ఎవరూ బెదపడకుండా ఆడమనిషి వేషం వేసుకోని మానపాడు నుండి కోటకొండకు వచ్చేసింది.
ఆ కోటకొండ మొనగానికి వూరిబైట ఒక పెద్ద పొలముందిగానీ అది బీడుభూమి.  చేనంతా రాళ్ళు, రప్పలు, పెద్దపెద్ద గుండ్లు, తిక్కతిక్క చెట్లూ వున్నాయి.  వాడు ఆ దయ్యాన్ని పిలిచి ''పో...పోయి... నా చేనంతా కన్నెగ శుభ్రం చేసిరాపో'' అన్నాడు.
వాడట్లా చెప్పడమాలస్యం ఆ దయ్యం వురుక్కుంటా... వురుక్కుంటా... చేనుకాడికి పోయి... రాళ్ళూరప్పలూ... చెట్లూగిట్లూ అన్నీ శుభ్రంగా తీసి పడేసి... వురుక్కుంటా వచ్చి ''నీవు చెప్పినట్లే నీ చేనంతా బాగుచేసినా... నా వెంట్రుకలు నాకియ్యి'' అనడిగింది.
దానికి వాడు కాలు మీద కాలేసుకోని కూచోని చిరునవ్వు నవ్వుతా ''చేను బాగు చేస్తే ఐపాయనా... నీళ్ళు కావద్దా... పో... పోయి... ఒక పెద్ద బావి తవ్విరాపో'' అన్నాడు.  వాడట్లా చెప్పడం ఆలస్యం ఆ దయ్యం వురుక్కుంటా చేనుకాడికి పోయి... ఏడు రాత్రులూ, ఏడు పగల్లూ కష్టపడి ఒక పెద్దబావి తవ్వి నీళ్ళు పడగానే వురుక్కుంటా వాని దగ్గరకొచ్చి ''నీవు చెప్పినట్లే నీ చేనులో బావి తవ్వినా... ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకియ్యి'' అనడిగింది.
దానికి వాడు కాలు మీద కాలేసుకోని కూచోని చిరునవ్వు నవ్వుతా ''చేనంతా బాగు చేసి, బావి తవ్వితే ఐపాయనా... పొలమెవడు దున్నుతాడు'' అన్నాడు.  వాడట్లా అనడమాలస్యం ఆ దయ్యం వురుక్కుంటా చేనుకాడికి పోయి...నాగలి ఎద్దులకు కట్టి... చేనంతా దున్ని... వురుక్కుంటా... వాని దగ్గరకొచ్చి ''నీవు చెప్పినట్లే నీ చేనంతా చక్కగా దున్నినా... ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకియ్యి'' అనడిగింది.
దానికి వాడు కాలు మీద కాలేసుకోని కూచోని చిరునవ్వు నవ్వుతా ''చేను బాగు చేసి, బావి తవ్వి, దున్నితే ఐపాయనా...పొలంలో నాట్లెవడు ఏస్తాడు'' అన్నాడు.  వాడట్లా అనడమాలస్యం ఆ దయ్యం విత్తనాల మూటలు భుజాన ఎత్తుకోని వురుక్కుంటా చేనుకాడికి పోయి చేనంతా బాగా నీళ్ళుగట్టి... భూమి బాగా తడి పీల్చినాక... విత్తనాలన్నీ నాటి వురుక్కుంటా మళ్ళా వాని దగ్గరకొచ్చి ''నీవు చెప్పినట్లే నీ చేనంతా విత్తనాలు నాటినా... ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకియ్యి'' అనడిగింది.
దానికి వాడు కాలు మీద కాలేసుకోని కూచోని చిరునవ్వు నవ్వుతా ''చేను బాగు చేసి,  బావి తవ్వి, దున్ని, నాట్లేస్తే ఐపాయనా...పంట ఎవడు పండిస్తాడు'' అన్నాడు.  వాడట్లా అనడమాలస్యం ఆ దయ్యం వురుక్కుంటా చేనుకాడికి పోయి... పంటకు అవసరమయినప్పుడల్లా ఎరువులేస్తా... నీరు పెడతా... పురుగుమందులు చల్లుతా... పశువులూ పక్షులూ వచ్చి తినిపోకుండా... రాత్రింబవళ్ళూ కాపలా కాసి ఆఖరికి బ్రమ్మాండంగా పంట పండినాక వురుక్కుంటా... వురుక్కుంటా... వాని దగ్గరకొచ్చి ''నీవు చెప్పినట్లే నీ చేనులో బ్రమ్మాండంగా పంట పండించినా... ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకియ్యి'' అనడిగింది.
దానికి వాడు కాలు మీద కాలేసుకోని చిరునవ్వు నవ్వుతా ''చేను బాగు చేసి, బావి తవ్వి, దున్ని, నాట్లేసి, పంట పండిస్తే ఐపాయనా...కోసి కుప్ప చేసి ఇంటికెవడు తెచ్చిస్తాడు'' అన్నాడు. వాడట్లా అనడమాలస్యం ఆ దయ్యం వురుక్కుంటా చేనుకాడికి పోయి... పంటనంతా కోసి, కుప్ప చేసి, బస్తాలకెత్తి ఇంటికి తెచ్చి ''నీవు చెప్పినట్లే పంటంతా నీ ఇంటికి చేర్చినా... ఇప్పటికన్నా నా వెంట్రుకలు నాకియ్యి'' అనడిగింది.
అప్పుడు వాడు దాని జుట్టు తీసుకోనొచ్చి ''ఇంగోసారి గనుక... నీవు ఎక్కడయినా... ఎవరినయినా... ఏడిపించినట్లు తెలిసిందనుకో... జాగ్రత్త... ఈసారి నీ జుట్టు కత్తిరించడంగాదు.  ఏకంగా నీ మెడనే కత్తిరిస్తా ఏమనుకుంటా వున్నావో'' అని బెదపడిచ్చి దాని జుట్టు దాని చేతిలో పెట్టేసినాడు.  అంతే... ఆ దయ్యం ఆ జుట్టును తీసుకోవడమాలస్యం మరలా ఆ చుట్టుపక్కల కనబడకుండా కిందామీదా పడతా పారిపోయింది.

కామెంట్‌లు