సర్వోత్కృష్టుడు.. శివుడు- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల., సంచార వాణి:- 99127 67098
 🪷బ్రహ్మాది దేవతలచే
     సేవింపబడు భర్గుడు
     సర్వోత్కృష్టుడు.. శివుడు!
      ఓ శంకర ప్రియులార!
          ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.)
⚜️పరమేశ్వరు డొక్కడే..  బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు... మున్నగు  దేవతలందరికీ పూజనీయుడు!  సాంబశివ పరoబ్రహ్మమే.. సర్వోత్కృష్టమైన ఆరాధ్యదైవము! శ్రీస్వామి వారిని.. ఆరాధకులు, మరియు సాధకు లందరూ.. భక్తి ప్రపత్తులతో వేడుకోవాలి!
🔱శంభో శివా! నీవే శాంతి, సౌఖ్యములకు మూల కారణుడవు! మంగళస్వరూపుడవు! ఈ లోకంలో.. స్వల్పఫలముల నొసంగు దేవతలు వేలకొలదిగా నున్నారు. వారిసేవను గానీ, వారిచ్చే ఫలములు గానీ, నేను కలలోకూడా ఆశించడం లేదు! ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నున్న, బ్రహ్మదేవుడు , విష్ణుమూర్తి .. మున్నగు దేవతలకు కూడా దుర్లభమైన మీ పాదసేవను; నేను శాశ్వతముగా వేడుకొను చున్నాను! అనగా, ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలముల నొసంగుదురు. ఓ కైవల్య నాథ! నీ వొక్కడవే .. శ్రీకైవల్యపదమైన మోక్షమునొసంగు స్వామివి!. అందుచే వారిచ్చు ఫలమును కోరక, నీ పాదపద్మముల సేవను మాత్రమే యాచించెదను! అని, జగద్గురు శంకర భగవత్పాదులు ప్రస్తుతించారు!
🌷సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః 
     న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్!
     హరిబ్రహ్మాదీనామపి నికట భాజా మసులభం
      చిరం యాచే శంభో! శివ! తవ పదాంభోజ భజనమ్!!
       ( శ్రీ శివానంద లహరి., 4.వ. శ్లోకము)
🪷శ్రీ స్వామివారి పాదపద్మసేవ .. అందరికీ అవశ్యము కోరదగినది! అదియే.. పొందదగినది! అని, ఆది శంకరులు.. ఈ ప్రార్థనా శ్లోకమునందు పేర్కొనుచున్నారు!
          🚩ఉత్పల మాల
      వేలకువేలు దేవతలు, వేడిన కోరికలిచ్చు, వారినిన్ 
     బేలతనంబు తోడుతను వేడను, నే కలలోన కూడ, నీ 
    మ్రోలనునున్న, ధాతృ హరి ముఖ్యులకైన, నసాధ్యమైన నీ
     మూలపు పాదసేవనము, ముందుగ నీయగ వేడెదన్ శివా!!
            [ డా. "శ్రీపాదుక" కొల్లూరు అవతార శర్మ.,]
   🕉️ నమఃశివాయై నమఃశివాయ!

కామెంట్‌లు