సుప్రభాత కవిత ; -బృంద
అలుపెరుగక ఎదురుచూసిన
అద్బుతం నడిచివచ్చు
అడుగు సవ్వడులు అవిగో!

అంతరంగచర్చలతో అలసిన
మనసుకి ఊపిరులూదే 
సమీరమదిగో!

కౌముదిలో తడిసి మురిసిన
వసుమతి మగతనిదుర
పోద్రోలే చైతన్యపు ప్రభలవిగో!

నిదురించిన ఏటినీటిని
మృదువుగ  తాకుతూ
మనసుపొరలను
కదిలించే  వెలుగులవిగో!

మేఘమాలలకు మెరుపులద్ది
ముంగిలంతా రంగు నింపి
మంచుతెరలను తొలగించే
తొలి కిరణ కాంతులవిగో!

అనంత సుఖములు తెచ్చి
ఆనంద సాగరాన ముంచే
ఆత్మీయమిత్రుని  ఆగమన
తరుణ మరుదెంచెనదిగో!

కదలని శిఖరాల వంటి
కలతలు కనుమరుగు చేసి
కమ్మని కలలు నిజాలుగ
కనులముందు నిలిపే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు