కీర్తి శేషులు.. అచ్యుతుని రాజ్యశ్రీ
 మనం చనిపోయిన వారిని కీర్తి శేషులు అంటాం.నిజానికి మనం చేసే మంచి పనులతో నల్గురి గుండె ల్లో ఉంటే అది చాలు.మనల్ని గూర్చి చెప్పుకోకుండానే సమాజసేవని  నిశబ్దంగా చేయొచ్చు.వారి జీవిత చరిత్రలు చదవాలి.తెలుసుకోవాలి.అలాంటి వారి లో ముఖ్యులుదేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు.స్వతంత్రపోరాటంలో తెలుగు ప్రాంతాల్ని ఒక్క త్రాటి పై తెచ్చారు.గుంటూరులో ఓ నాలుగు వాటాల ఇల్లు కట్టారు.అద్దెకు ఇవ్వలేదు.ఒకవాటాలో ఆయన ఉండి రెండోవాటాలో బీద చదువు కునే పిల్లలకు ఇచ్చారు.మూడోవాటాని రాజకీయమీటింగులకి నాల్గవది ఎవరైనా వస్తే అక్కడ బస చేయటానికి.అన్నీ ఫ్రీ! పైసా వసూల్ చేయలేదు.
ఇంకో మహానుభావుడు డాక్టర్ అహోబలరావుగారు.ఆయన బీదలకు ఉచితంగా వైద్యం చేయడమే కాదు దగ్గరుండి పథ్యం తినిపించేవారు.నారింజపచ్చడి ఆవుపాలతో పథ్యం పెట్టేవారు.రోగులు తిరిగి తమ ఇంటికి వెళ్ళేందుకు దారి ఖర్చులు ఇచ్చేవారు.ఆయన మరణించినప్పుడు గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాలో జనం గోలుగోలున ఏడ్వటం ఆనాటి చారిత్రక సంఘటన.కానీ అహోబిలరావుగారి పేరు మరుగున పడింది.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఇంటికి వచ్చిన వారికి వెంటనే అతిధిసత్కారాలు చేసి వారు ఊరి ప్రయాణ ఏర్పాట్లు భోజనం కూడా సిద్ధంగా ఉంచేవారు.టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేపరు నడపటం కష్టంగా ఉంది అని కబురు పెడితే టన్ను కాగితాలు పంపిన ఉదారహృదయుడు. ఇలాంటివారి గూర్చి జనాలకి తెలియాలి.కానీ మనం మాత్రం కొంత మందిని మాత్రమే ఆకాశానికి ఎత్తేసి వారి భజనే మీడియా లో చేస్తాం.పిల్లలకి పాఠాలుగా పెట్టాలి.హిందీ ఇంగ్లీష్ తెలుగు లో పాఠాలు ఉండాలి.జీవితచరిత్రలో ముఖ్య అంశాలు ఆసక్తి కరవిషయాలు ప్రచురించాలి. మనం దౌర్భాగ్యం ఏమంటే క్రికెట్ సినిమా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశభక్తులకి ఇవ్వం.పేపర్లో అలాంటి వారి గురించి చదవం.మన అమ్మమ్మ బామ్మ తాతముత్తాతల పేర్లు ఇంటి పేర్లు తెలీని విద్యార్ధులు న్న బడులున్న కాలంలో ఉన్నాం🌹

కామెంట్‌లు