సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -331
సుందోప సుంద న్యాయము
******
సుందోప సుందులు... సుందుడు ,ఉప సుందుడు అని ఇద్దరు అన్నదమ్ముల పేర్లు.
 'సుందోప సుంద న్యాయము' అంటే అన్నదమ్ములైన సుందుడు,ఉప సుందుడు వేరే వారి చేతుల్లో చనిపోక తామిద్దరే కొట్టుకొని చనిపోవడం.
.అన్నదమ్ములై వుండి కూడా ఒకానొక కారణం చేత ఇతరుల వల్ల కాకుండా తమకు తామే కొట్టుకొని విద్వేషాలు పెంచుకుని చంపుకునే దాకా వెళ్ళే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 మరి ఆ సుందోప సుందులు ఎవరో ఏమిటో ఆ కథేమిటో తెలుసుకుందామా...
 మహాభారతంలోని ఆది పర్వము అష్టమాశ్వాసంలో నారదమహర్షి ధర్మరాజుకు  సుందుడు ఉప సుందుల వృత్తాంతం చెబుతాడు.
నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు ఉప సుందుడు ఇద్దరు పుత్రులు.
వీరిద్దరూ బ్రహ్మ వరాల కోసం ఘోర తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. ఆ అన్నదమ్ములు ఇద్దరూ  ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేటట్లు, రకరకాల మాయలు చేయగలిగేటట్లు కామ రూప,కామ గమనం లాంటి కోరికలతో పాటు మరణమనేది లేకుండా అమరత్వం ఉండాలని కోరుకుంటారు.వారి కోరికలు విన్న బ్రహ్మ మరణమే రాకుండా వరం ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు ,మిగిలినవి ఇస్తానని చెబుతాడు. అయితే వేరే వారి చేతుల్లో చావకుండానైనా  ఉండే వరం  కావాలని కోరుకుంటారు సరేనని  బ్రహ్మ  ఆ విరమిస్తాడు. 
అలా వరాలు పొందిన సుందుడు, ఉప సుందుడు గర్వంతో విర్రవీగుతూ ముల్లోకాలను పీడించడం మొదలు పెడతారు.దేవతలనూ, మునులను రకరకాలుగా  హింసించసాగారు.
అలా వారి బాధలు భరించలేక దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు.
అయితే వాళ్ళు ఇతరుల చేత చావరు కాబట్టి వారిలో వారే ఒకరికొకరు చంపుకునే ఉపాయం ఆలోచించాలని బ్రహ్మ దేవుడు  చెప్తాడు.విశ్వకర్మను పిలిచి లోకోత్తరమైన సుందరిని సృష్టించమని చెబుతాడు.సరేనని విశ్వకర్మ తిలోత్తమ అనే అందమైన అమ్మాయిని సృష్టిస్తాడు.సుందోప సుందుల మధ్య కలహం,విరోధం‌ కలిగించమని తిలోత్తమను బ్రహ్మ ఆజ్ఞాపిస్తాడు.
బ్రహ్మ దేవుని ఆజ్ఞ మేరకు సుందోప సుందుల దగ్గరకు వెళ్ళి  తన అందచందాలతో  వారిద్దరినీ మురిపిస్తుంది. ఎవరికి వారే తమకు స్వంతం కావాలనే స్వార్థం కలిగేలా  మోహాన్ని పెంచుతుంది.
దాంతో అన్నదమ్ములిద్దరూ తిలోత్తమను తమకంటే తమకే కావాలని పోటీ పడతారు.అప్పుడు తిలోత్తమ వారితో "మీలో  ఎవరు బలవంతులో వారినే నేను వరిస్తాను,వశమవుతాను" అని చెబుతుంది.ఈ మాటతో విచక్షణ కోల్పోయిన ఇద్దరన్నదమ్ములు  ఒకరిపై ఒకరు శత్రుత్వం పెంచుకుని పరస్పరం యుద్ధం చేస్తారు. అలా ఇద్దరూ బలంలో కూడా సమానంగా ఉండటంతో చాలా కాలం  భయంకరంగా పోరాడుతారు.అలా చివరికి ఒకరికొకరు కత్తులతో పొడుచుకోవడంతో ఇద్దరూ మరణిస్తారు.
అలా అన్నదమ్ములు, దాయాదులు,మిత్రులు  ఏదో ఒక కారణంతో శత్రువులై పరస్పర నాశనానికి కారకులు ఐన సందర్బాలలో మన  పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 సద్వినియోగం చేసుకోవాల్సిన వరాలను దుర్వినియోగం చేయడమే కాకుండా , అసాధ్యమైన కోరికలు కోరుకోవడం, విచక్షణ మరచి శత్రుత్వం పెంచుకోవడం వల్ల ఇరువైపులా నాశనానికి కారకులు అవుతారని ఈ  కథ ద్వారా మనం గ్రహించవచ్చు.
ఇదండీ! సుందోప సుంద న్యాయము వెనుక ఉన్న అసలు విషయం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు