సుప్రభాత కవిత - బృంద
చూడగానే తలపుల లో
కలిగే భావనలకు
అక్షర రూపమివ్వాలని
కలం కోసం వెదికా....

వనంలో నర్తిస్తూ న న్నే చూస్తున్న
మయూరం చూసి
తన ఈక నొకటి ఇచ్చింది

సిరాగా మారిపోతానంటూ
నీలాల సంద్రం వద్దకు చేరింది

నీ అందమైన అక్షరాల కూర్పుకు
నన్ను కాగితంలా వాడుకో
అంది ప్రశాంతమైన గగనం

భావాలకు సరిైన రంగులు
అక్షరాల్లో పొదగమని
హరివిల్లు రంగులు
అరువిచ్చింది

ఇంతలో ఈ  కవనం విషయం
వనమంతా  చుట్టి చేరవేసింది
మలయ సమీరం.

తీగెపై విరిసిన పువ్వులు అన్నీ
అక్షరాల అందం  చూడాలని
రేకుల రెప్పలు తెరచి చూస్తున్నాయి

ప్రకృతి  మొత్తం పరవశించి
ఆక్షరాకృతి దాల్చే అందమైన
భావాలకై ఎదురుచూస్తోంది..

వెలుగుల వెల్లువలో
సొగసులన్ని వింతగా 
అందాలు సంతరించుకోగా

అణువణువూ కదులుతూ
అంతరిక్షాన 
సాక్షాత్కరించే నదిగో
ఆరంజ్యోతి....

అనుభవమే చాలంటూ
అక్షరాలే వద్దంటూ
ఆహ్లాదమంతా అంతరంగాన
ఆవరించేలా చేసిన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు