సంగమవ్రతం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 దశాబ్దాలుగా వలసగుప్పిట్లో గువ్వల్లా
పరిమళమే ఎరుగని ప్లాస్టిక్ పూలలా
రక్తమాంసాలున్న సిమెంట్ విగ్రహాలలా
మేం అలా ఉండిపోయాం ఆశానిరాశల డోలాయమానంలోనే!
వేలసంతకాల్ని ఒక్కసారిగా ఆరబోసిన నా చిగురాశల విరితోటలో
ఏ శీతల చంద్రికాకిరణ హృదయమో కరిగి
మా కలయికని వాస్తవం చేయాలి!
ఏ దయార్ద్రపవన గీతికానయనమో చెమ్మగిల్లి
మాకు ఏకత్వాన్ని కట్టబెట్టాలి!
కాని.... ఈ పరిస్థితుల్లో
ఏ చల్లని చినుకైనా సూటిగా తాకితే గాయంచేస్తుంది
వెచ్చదనాల నిప్పుతో చెలగాటం ఆడినా
అది తనువునే నిలువుగా కాల్చేస్తుంది
ఇలావుండి దాంపత్యజీవితాన్ని ఎలా సాధిస్తాం?
దాంపత్యమంటే పార్వతీపరమేశ్వరులదే, సీతారాములదే
మనమూ అలాంటి ప్రఖ్యాతిగాంచాలంటే మరి....ఎలా?
గాలి గాలిగానే వుంటుంది వేణువునుండి రాగమై రవళించేదాక
నీరు నీరుగానే వుంటుంది ఇంద్రధనువు చివరిరంగుగా విరిసేదాక
భూమి భూమిగానే వుంటుంది విత్తు మొక్కై ఎదిగేదాక
అందుకే, ఏకత్వ సాధనకోసం నిరంతరం
ఒకరితో ఒకరు అనుగమిస్తూ సంగమవ్రతం ఆచరించాల్సిందే!!!
*********************************

కామెంట్‌లు