సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -327
సింహ స్యైక పద న్యాయము
******
సింహము అంటే ఏమిటో అందరికీ తెలిసిందే.అడవికి రారాజైన మృగరాజు మృగపతి కేసరి సారంగం సింగము అనే పదాలు గుర్తుకు వస్తాయి.
 సైకము అంటే సూక్ష్మత్వము, సూక్ష్మము అని అర్థము.పదః అంటే పాదము,పాద చిహ్నము,,పద్య చరణము, శబ్దము, స్థానము, మర్యాద, అవస్థ, కారణము,విషయము,వేద పరిచ్ఛేదము అనే అర్థాలు ఉన్నాయి.
సింహ స్యైక పదము అంటే "సింహం వేసే మొదటి అడుగు సాహసోపేతమైన సూక్ష్మ దృష్టితో వేస్తుంది"అని అర్థము.
శత్రువు పైకి దాడికి వెళ్ళేటప్పుడు గాని, మరొకప్పుడు గాని  సింహం వేసే మొట్టమొదటి అడుగు  మహా ఠీవితో మహా సాహసముతో వేస్తుంది.తరువాత ఏం జరుగుతుందో అని ఆలోచించదు.అంటే తాను  వేసే అడుగులో,చేసే ప్రయత్నంలో తన యొక్క శౌర్య,ధైర్య పరాక్రమాలు కనిపిస్తాయి.
అలా ఎవరైనా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ధైర్యంతో ముందుకు సాగే వ్యక్తులను ఉద్దేశించి ఈ "సింహ స్యైక పద న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
మరి వేసే అడుగు , చేసే పయనం మంచిదా కాదా అనేది తర్వాత విషయం. కానీ వెనుకా ముందు ఆలోచించకుండా, పర్యవసానాలు దృష్టిలో పెట్టుకోకుండా కొందరు అలా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతుంటారు.
ఒకోసారి  వాళ్ళలా చేసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారు, ఆ పనికి పురికొల్పే వారు కూడా ఉంటారు.అలాంటి వారి మాటలు విని మంచి, చెడుల విచక్షణ మరిచి అడుగేసే వారికి కూడా ఈ న్యాయం వర్తిస్తుంది.
పూర్వకాలంలో రాజుల్లో  ఇలాంటి వారు ఉండేవారు.తమ తమ మంత్రులచే ప్రేరేపింపబడి యుద్ధ సన్నద్ధులై వెనుకా ముందు ఆలోచించకుండా బయలు దేరే వారు.అలాంటి వారికి కూడా ఈ న్యాయం వర్తిస్తుంది.
 అందుకే ఈ న్యాయమును దృష్టిలో ఉంచుకుని మన పెద్దలు ఓ హెచ్చరిక కూడా చేశారు. వేసే అడుగులో,చేసే పనిలో "ఆరంభ శూరత్వం" కూడదని చెబుతారు.
మహా భారతంలోని దుర్యోధనుడిలా "రాజు వెడలె రవి తేజము లలరగ కుడిఎడమల డాల్ కత్తులు మెరయగా" అన్నట్లు వీరోచితంగా  వెళ్ళడం కాకుండా  తర్వాత విషయాలను కూడా ఆలోచించాలని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అదండీ! "సింహ స్యైక పద న్యాయము" లోని అంతరార్థం.
మనమూ సింహంలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందాం. కానీ ఎదురయ్యే యిబ్బందులు, పర్యవసానాలు కూడా దృష్టిలో పెట్టుకొని  ఆరంభం నుంచి ఆఖరు వరకు పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధిద్ధాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు