తూరుపు కొండల్లో వెలుగుపువ్వు
విరిసి వెలుతురు విరజిమ్మితే
గుండెనిండి కురిసే మెరుపులతో
దోవలోని గడ్డిపువ్వు నవ్వదా!
చిత్తాన గుత్తంగా దాచిన
మొత్తం అభిమానం
కొత్త అందాలతో అలరారగా
పొత్తంలా రెక్కలన్ని విచ్చుకోదా?
నిదురకాచిన రేయినంతా
ఎదురుపడి సాగనంపే
బెదురులేని బంగరు వెలుగులు
కుదురుగా భువిపై కురవదా??
కలత దాచిన కనులలాగా
నెలలు నిండిన నెలతలాగా
జలము దాచిన నీరదాలు
ఇలను ముద్దాడ సిద్ధం కాదా!
మౌనమైన మనసులోన
మోగుతున్న రాగమేదో
సాగుతున్న గాలి ఎరిగి
ఊగుతున్న కొమ్మకు తెలుపదా?
పచ్చిక పై ముచ్చటగా
వెచ్చగ తాకుతూ సాగే
పచ్చని కిరణాల వెలుగు
తెచ్చిన కాంతుల ఇల మురవదా?
నిన్నను అగిన కాలంలో
కన్నుల దాగిన స్వప్నం
మిన్నుల విడి మనకోసం
ఎన్నో వరములు తేదా??
మనోరంజకమైన నారింజ
వెలుగులకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి