సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

 సికతా తైల న్యాయము
******
 సికతా అంటే ఇసుక. తైల అంటే నూనె, చమురు.
 ఇసుకలో నుంచి నూనె తీయడం ఎలాగోలా సాధ్యం అవుతుంది.  కానీ ఈ న్యాయం అర్థం అది కాదు.ఇసుకలో నూనె తీయడమైనా కష్టపడి సాధించవచ్చేమో కానీ మూర్ఖుని సరిగా చేయలేము అనే అర్థంతో   ఇది చెప్పబడింది.
 మరి ఈ న్యాయానికి సంబంధించిన పద్యాలు కొన్ని చూద్దాం.
 భర్తృహరి సంస్కృత సుభాషితానికి ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన తెలుగు పద్యాన్ని చూద్దామా...
"తివిరి యిసుమున దైవంబు దీయ వచ్చు/ దవిలి మృగతృష్ణలో నీరు ద్రావ వచ్చు/ దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు/ జేరి మూర్ఖుల మనసు రంజింప రాదు."
అంటే ఎలాగోలా ప్రయత్నించి ఇసుక నుంచి చమురును తీయవచ్చు. ఎండమావి లోని నీరు త్రాగవచ్చు.తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధింపవచ్చు. కానీ మూర్ఖుని మనస్సును సమాధాన పెట్టుట అంటే అర్థం చేయించడం, సంతోషపరచడం, మార్చడం మాత్రం ఎవరి వల్లా కాదు.అది సాధ్యము కాని పని అని అర్థం.
ఇలా మూర్ఖుడైన వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం, ఒప్పించడం ఎవరి వల్ల కాదనే అర్థంతో ఈ "సికతా తైల న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 మరి ఇంతకీ మూర్ఖులైన  వారు ఎలా వుంటారో వారి మనస్తత్వాన్ని గుణగణాలను గురించి చెప్పాలంటే  వారిలో మూడు రకాల మూర్ఖులు , లేదా మూర్ఖత్వం ఉంటుందని పెద్దలు అంటుంటారు.
అందులో ఒకరకం మూర్ఖత్వం ఏమిటంటే తెలియనితనం. చెప్పినా అర్థం చేసుకోలేక పోవడం.అలాంటి వారికి తాము మూర్ఖులనీ, మూఢులనీ తెలుసు కానీ దాని నుండి బయట పడలేరు.
 
మరో రకం మూర్ఖులు "చెబితే వినరు ఒంట బుట్టదు.అలాంటి వారికి  చెప్పాలని ప్రయత్నించడం కూడా  మూర్ఖత్వమే అనే అర్థంతో  చెప్పిన ఓ  పద్యాన్ని చూద్దామా...
"కరిరాజున్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వా/డరు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప,దీ/పు రచింపన్ లవణాబ్ధికిన్ మధు కణంబుం జింద యత్నించు, ని/ద్ధరిణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారాను కారోక్తులన్"
అనగా మదించిన ఏనుగును తామర పూల కాడలతో కట్టి బంధించడానికి ప్రయత్నించే వాడు, అడవిలో నిప్పులా మెరిసే దిరిసెన పూలతో వజ్రాన్ని కోయాలనుకునే వాడు, ఒక్క తేనె చుక్క వేసి ఉప్పగా ఉన్న సముద్రంలో నీటిని తీయగా మార్చాలని చూసేవాడు...  వీళ్ళంతా మూర్ఖులు.అలాంటి మూర్ఖులకు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేసే వాడు కూడా మూర్ఖుడే అంటారు.
అలాంటి మూర్ఖులను మార్చే ప్రయత్నం దుస్సాహసమే అవుతుందన్న మాట. ఇలాంటిదే మరో పద్యాన్ని కూడా చూద్దాం.
"మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా/యక చల దూర్మికా నికరమైన మహోదధి దాట వచ్చు మ/స్తకమున బూవు దండవలె సర్పమునైన భరింపవచ్చు మ/చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్/"
అంటే మొసలి నోట్లో చిక్కిన మాణిక్యాన్నైనా బయటికి తియ్యవచ్చు. నిరంతరం చలించే పెద్ద పెద్ద అలలతో కూడిన మహా సముద్రాన్నైనా దాటవచ్చు. పామునైనా తలలో పూదండలాగా ధరించవచ్చు. కానీ మూర్ఖుని మనస్సును ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు.
  ఇక ముచ్చటగా మూడో రకం మూర్ఖులు ఉంటారు. ఇక వారైతే తమకు తెలియని విషయాలు లేవంటూ  గర్వంతో ప్రవర్తిస్తుంటారు. అది వారి  అహంకార పూరితమైన  మూర్ఖత్వానికో మచ్చుతునక అన్నమాట. తమ మూర్ఖత్వాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా అదేదో తమకున్న ప్రత్యేక అర్హత అనుకుంటూ గర్వంగా  భావిస్తుంటారు.
 ఇలా  మన చుట్టూ ఉన్న సమాజంలో  అప్పుడప్పుడు కొంత మంది మూర్ఖులు తారస పడుతూ ఉంటారు.అమాయకత్వంతో కూడిన మూర్ఖత్వం ఉన్న వారిని కొంతైనా మార్చవచ్చేమో గానీ తెలిసీ తెలియని వారిని, అన్నీ తెలుసనుకునే వారిని అనగా రెండు, మూడు రకాల మూర్ఖులు ఉన్నారు కదా! వారిని మార్చేందుకు ప్రయత్నించ వద్దనే విషయాన్ని ఈ న్యాయము ద్వారా గ్రహించవచ్చు.
రకరకాల మూర్ఖత్వం గురించి చెప్పుకుంటున్న ఈ సందర్భంలో "పిచ్చి పిచ్చి పిచ్చి  రకరకాల పిచ్చి" అని ప్రముఖ నటి, గాయని భానుమతి రామకృష్ణ గారు పాడిన పాట గుర్తుకు వస్తుంది కదండీ!
 ఏమైతేనేం "సికతా తైల న్యాయం" ద్వారా మూర్ఖత్వం గురించి మనకు చాలా విషయాలు తెలిశాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు