నమ్మకం ;- చెప్యాల శరణ్య- ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా-9550809625
  అనగనగా సీతారాంపూర్ అనే ఊరిలో సాంబయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు రాహుల్. రాహుల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రాహుల్ తండ్రి సాంబయ్య అప్పుడప్పుడు దిగులుతో ఉండసాగాడు. తండ్రి దిగులుతో ఉండడం గమనించిన రాహుల్ ఏమైందని తండ్రిని అడిగాడు. ఏం లేదు రాహుల్ అంటూ తండ్రి బదులిచ్చి నవ్వసాగాడు. కానీ తన తండ్రి ఏదో బాధలో ఉన్నాడని రాహుల్ అర్థం చేసుకున్నాడు.
                      తమ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం సాగడం లేదని తండ్రి బాధపడుతున్నాడని రాహుల్ గమనించాడు. తండ్రి ఒకటే వరి పొలం వ్యవసాయం చేయడం మూలంగా పంట సరిగా పడడం లేదని, రాహుల్ గ్రహించాడు. ఓ రోజు తండ్రి సాంబయ్యతో మాట్లాడుతూ రాహుల్ మా మాస్టర్ బడిలో శ్రద్ధతో చదివితే బాగా చదువు వస్తుందని అంటారు. మరి మీరు కూడా శ్రద్ధతో వ్యవసాయం చేస్తే పంటలు బాగా పండుతాయని, పంట మార్పిడి మూలంగా కూరగాయల సాగు కూడా చేయాలని రాహుల్ అన్నాడు.
               కొడుకు మాటలు విన్న సాంబయ్య ఆశ్చర్యపోయాడు. తన తప్పును తెలుసుకొని అనేక రకాల విత్తనాలతో వ్యవసాయం చేస్తూ, ఎప్పుడు పొలం వద్దనే ఉంటూ పంటను కాపాడుకోసాగాడు. కూరగాయల సాగు చేసి కూరగాయలు అమ్మడంతో చిల్లర ఖర్చులు కూడా తీరసాగాయి. చివరకు తన కొద్దిపాటి పొలంలో అధిక ధాన్యం లభించింది. సాంబయ్య చాలా సంతోషించారు. చిన్నవాడైనా రాహుల్ సూక్ష్మ బుద్ధికి సంతోషించాడు. రాహుల్ ని బాగా చదివించసాగాడు. ఊర్లోని ప్రజలు కూడా సాంబయ్య వలే పంట మార్పిడి చేస్తూ అధిక లాభాలు పొందసాగారు.
నీతి : మనం ఏ పని చేసినా శ్రద్ధ  పెట్టి చేసినట్లయితే విజయం సాధిస్తాం.


కామెంట్‌లు