సునంద భాషితం 0 వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -343
సౌధ సోపాన న్యాయము
******
సౌధ అనగా, రాజ గృహము,నగరు, మేడ భవనము.సోపానము అనగా మెట్టు అనే అర్థాలు ఉన్నాయి.
సౌధము లోకి వెళ్ళాలి అంటే ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి.అప్పుడే సౌధం లేదా  మేడలోకి వెళ్ళ గలం.
సోపానారోహణ,అవరోహణ సమయంలో మెట్లు ఎక్కడం దిగడం ఒక క్రమ పద్దతిలో జరుగుతుంది.జరగాలి కూడా.అలా కాకుండా ఒకేసారి మేడ పైకి చేరాలంటే అధునాతన సౌకర్యం లిఫ్ట్ ఉండాలి. అప్పుడు అలా మెట్లు ఎక్కే బాధ లేకుండా వెళ్తాము.అంతేగాని  మామూలుగా అయితే మెట్లు ఎక్కకుండా మేడలోకి వెళ్ళలేం కదా!
ఈ "సౌధ సోపాన న్యాయము"లో దాగిన అంతరార్థం ఏమిటంటే మనిషిగా తన యొక్క స్థాయిని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత దశలోకి తీసుకుని వెళ్ళాలి.
అలా వెళ్లకుండా అమాంతంగా వెళ్ళాలనుకోవడం స్వార్థ పూరితమైన ఆలోచన. దాని వల్ల దుష్ఫలితాలే వస్తాయి.
ఏదైనా ఒక పని చేసి తద్వారా  ఫలితాలు సాధించాలంటే దానికి సంబంధించిన పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలతో పాటు  ఓ క్రమ పద్ధతి కూడా తెలిసి ఉండాలి.
 పరీక్ష లేదా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలంటే ఏం చేస్తాం.దానికి ముందు అభ్యాసం,తగిన సాధన చేస్తాం కదా!.అలా చేస్తేనే క్రమక్రమంగా అనుకున్నట్లు ఉత్తీర్ణత సాధిస్తాం.అంతే గానీ అడ్డదారిలో ఎకాఎకీ మెట్లెక్కే వారికి ఏదో ఒక మోహం లాగుతూ వుంటుంది.అది పరమ పద సోపానపటంలో పాము మింగినట్లు మళ్ళీ మొదటికి తీసుకుని వస్తుంది.అలా అధఃపాతాళానికి జారిపోవడం జరుగుతుంది.
ఈ న్యాయాన్ని మరో కోణంలో చూస్తే.,.మన జీవితము ఒక  మేడ లాంటిదని చెప్పవచ్చు.అదెలాంటి మేడంటే ధర్మాధర్మాలు తెలిసి,న్యాయమైన పద్ధతిలో, విలువలతో,ఆదర్శాలతో ఉన్న గొప్ప సంస్కారవంతమైన మేడ. ఆ మేడను ఎక్కేటప్పుడు  స్వార్థం,మోహం లాంటి అవరోధాలు ఎదురవుతాయి.వాటి ప్రలోభాలకు లొంగకుండా ఒక్కో మెట్టు బహు జాగ్రత్తగా ఎక్కుతూ ఆ మేడను చేరాల్సి వుంటుంది. చివరి మెట్టు వరకూ అవే జాగ్రత్తలు పాటించాలి.చివరి మెట్టు వరకు ఎలాగూ వచ్చాం కదా అని ఏ కొంచెం అలసత్వం వహించినా, ఆలోచనలో ఏదైనా తేడా వచ్చినా ఇన్ని మెట్లు ఎక్కినదంతా వృధా అయిపోతుంది.ఆ చివరి మెట్టు జారుడు మెట్టై అమాంతంగా పైనుండి పాతాళానికి వెళ్ళి పోతాం.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సినారె గారు ఓ సినిమా కోసం ఇదే అర్థం వచ్చేలా రాసిన పాటలోని ఈ వాక్యాలను చూద్దామా...
 "జీవితమే ఒక వైకుంఠ పాళీ -నిజం తెలుసుకో భాయీ/ ఎగరేసే నిచ్చెనలే కాదు -పడదోసే  పాములు ఉంటాయి"అనే వాక్యాలు  సదా గుర్తుంచుకోవాలి.
 ఇదే "సౌధ సోపాన న్యాయము" ద్వారా తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన జీవిత సత్యం. దీనిని గమనంలో పెట్టుకొని జీవిత మేడను అధిరోహించి ఆనందకరమైన,సంతృప్తి కరమైన జీవితాన్ని గడుపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు