మైలురాళ్ళు.....;- ప్రమోద్ ఆవంచ- 7013272452
తోడు..నీడ... మధ్య ఎంత పెద్ద అగాధం
అనుబంధాల నడమ ఎంత నిశ్శబ్దం,నిర్లిప్తత

ఆనందాల హరివిల్లు ఎడారుల్లో విహరిస్తుంటే
ఆశల పూల తీగను ఆకాశానికి కట్టి పెట్టాను

అజ్ఞాతపు ఛాయలు శూన్య గృహంలో సందడి
చేస్తున్నాయి
చీకటి విస్పోటనం నిశ్శబ్ద ప్రవాహంలో
కొట్టుకుపోతుంది 

కన్నీటి బిందువు ఒకటి గుండె లోతుల్లో
భారంగా కదులుతుంది 
పగలు రాత్రుల మైలురాళ్ళు సరిహద్దులను
దాటి ప్రయాణిస్తున్నాయి
అలికిడి ఆరాటాలు గుమ్మంలో
తచ్చాడుతున్నాయి

తూరుపు కొండల్లో విప్పారుతుందో ప్రాణం
పడమర మలుపుల్లో నిష్క్రమిస్తుందో
జీవం 

సముద్రపు హోరు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది
ప్రేమలతలు నీ(రు)వుగా పెనవేసుకుంటున్నాయి

నిత్యం  జ్ఞాపకాల చితి మండుతోంది 
ఒంటరి కపోతం కన్నీరు కారుస్తుంది

వేకువ గొంతు విప్పుకుంటున్నప్పుడల్లా నేను
నీవైపోతున్న!నిలువెల్లా నీరైపోతున్న!
దిగాలుగా ఉన్న తోటలో వేల జ్ఞాపకాలు 
చిగురిస్తున్నాయి.....
                               

కామెంట్‌లు