సాధువు మాట చక్కని బాట ;- డా.ఎం.హరికిషన్ - కర్నూలు-9441032212

 ఒక ఊరిలో ఒక పిసినారి వుండేవాడు. నిరంతరం ధనం సంపాదించడమే తప్ప వేరే ఆలోచనే లేదు. కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఎంత సంపాదించినా ఎవరికీ కాకి రెట్టంత సహాయం గూడా చేసేవాడు కాదు. బంధువులను గూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అందరినీ అనుమానిచ్చేవాడు, అవమానిచ్చేవాడు. దాంతో ఎవరూ అతని ఇంటి గడప కూడా తొక్కేవాళ్ళు కాదు.
ఎంత ధనవంతునికైనా ముసలితనం రాక తప్పదు గదా. అలా అతనికి డెబ్బయి ఏళ్ళు నిండాయి. ఒకసారి స్నానం చేస్తూ కాలు జారి కింద పడడంతో కాలి ఎముక విరిగింది. ఆసుపత్రిలో చేర్చారు. ఆ వయసులో అది తొందరగా అతుక్కోక పోవడంతో చాలా రోజులు ఆసుపత్రిలోనే వుండవలసి వచ్చింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు వ్యాపారాల్లో తీరిక లేకుండా గడపసాగాడు. భార్య ఇంటి దగ్గరి వ్యవహారాలు చక్కబెట్ట సాగింది. చుట్టూ పని వాళ్ళున్నారు గానీ పలకరించే వాళ్ళు లేరు. ఒకరోజు ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి బైటకు చూస్తా వుంటే వరండాలో నుండి మాటలు వినబడ్డాయి.
“ఎంత డబ్బుండీ ఏం లాభంరా, ఒక్కడే కుక్కచావు చస్తున్నాడు. రేప్పొద్దున ఈ పిసినారోడు సచ్చినా బాగయ్యింది ఈ వెధవకు అని నవ్వేటోళ్ళే తప్ప, అయ్యో పాపం అని జాలిపడేటోళ్ళు ఒక్కరూ వుండరు. మన కోసం కన్నీరు కార్చని నలుగురు మనుషులను సంపాదించుకోలేనప్పుడు అటువంటి బతుకు బతికితే ఎంత చస్తే ఎంత."
ఆ మాటలు వింటా వుంటే పిసినారికి మనసు కళుక్కుమంది. వాళ్ళ మాటలు నిజమే గదా అనిపించింది. జీవితం మీద విరక్తి వచ్చింది. కాలు బాగై ఆసుపత్రిలోంచి బైటకొచ్చేసరికి జ్ఞానోదయం కలిగింది. దాంతో అంతవరకు తనకు వచ్చిన చెడ్డ పేరంతా పోగొట్టుకోవాలి అనుకున్నాడు. తాను సంపాదించిన సొమ్మును మంచి పనుల కోసం దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టాడు. 
అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. అతనికి తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అనిపించింది. దాంతో ఎవరూ కనుక్కోకుండా మారువేషం వేసుకోని బైలుదేరాడు.
రచ్చబండ దగ్గర గ్రామస్తులు చాలా మంది చేరుతుంటారు. ఏవేవో చర్చలు చేస్తుంటారు. అక్కడికి పోయి కూర్చున్నాడు. ఒక గంటకి అక్కడ చర్చ రంగయ్య మీదకి మళ్ళింది. "రేయ్... పిసినారి రంగయ్య ఏదో పెద్ద ఎత్తే ఏస్తున్నట్టున్నాడురా. పిల్లికి బిచ్చం పెట్టనోడు ఒక్కసారిగా పిలిచి పిలిచి చేతికి ఎముక లేకుండా దానాల మీద దానాలు చేస్తావున్నాడు. వచ్చే ఏడాది గ్రామంలో ఎన్నికలున్నాయి గదా, ఆ పదవి మీద కన్నేసి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉపాయం పన్నినట్టున్నాడు. చూస్తా వుండండి. ఎన్నికలు రాగానే ఎగిరి ఏదో ఒక పార్టీలో చేరి జెండా ఎత్తుకొని ఓట్ల కోసం వస్తాడు” అన్నారు.
ఆ మాటలు వినగానే రంగయ్య అదిరిపడ్డాడు. మంచికి బోతే చెడు ఎదురయినట్లు ఇదేందిరా ఇట్లా అనుకుంటున్నారు అని ఆలోచించుకుంటా... తన తోటి వ్యాపారస్తులు రోజూ సాయంకాలం తోటలో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వుంటారు. అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు మాటల్లో “రేయ్... మన పిసినారి రంగయ్యకు మోకాలికి దెబ్బ తగిలితే మెదడు దెబ్బతిని పిచ్చెక్కినట్టుంది. బంధువులను, స్నేహితులను గూడా ఇంటి మెట్లు ఎక్కనియ్యని వాడు ఏకంగా బళ్ళూ, గుళ్ళూ, సత్రాలకు చందాల మీద చందాలు రాసిస్తా వున్నాడు. పిచ్చి ముదరక ముందే మనం గూడా వున్నవీ లేనివీ చెప్పి తలా ఇంత నొక్కేద్దాం. ఆ తరువాత ఎట్లాగూ ఇచ్చేది లేదు. సచ్చేది లేదు" అంటూ నవ్వుకున్నారు.
ఆ మాటలతో రంగయ్యకు నీరసం పెరిగిపోయింది. తోటి వ్యాపారస్తులు పిచ్చోడంటూ వుంటే, గ్రామ ప్రజలు ఆశబోతు అనుకుంటా వున్నారు. అసలు నా పెళ్ళాం కొడుకు ఏమనుకుంటున్నారో అనుకుంటా ఇంటికి పోయి ఎవరికీ కనబడకుండా ఒక కిటికీ చాటున దాచిపెట్టుకొని లోపలికి చూడసాగాడు.
“అమ్మా! నాన్నకెవరో మాయమాటలు చెప్పి మత్తుమందు పెట్టినట్టున్నారు. ఉన్న ఆస్తినంతా వరుసబెట్టి దానం చేస్తా వున్నాడు. ఇట్లాగే గమ్మున చూస్తూ వూరుకుంటే చివరికి చిప్పే గతవుతుంది. నా వాటా ఏదో నాకు పాడేస్తే నా దారి నేను చూసుకుంటా. నాన్నతో నువ్వు చెబుతావా లేక నన్నే అటోయిటో తేల్చుకోమంటావా" అంటూ గొడవ పడుతున్నాడు కొడుకు.
రంగయ్యకు కళ్ళు తిరిగాయి. నీరసంగా ఒక్కొక్క అడుగే వేసుకుంటా బైటకి వచ్చాడు. తోటి వ్యాపారస్తులు, ప్రజలు, ఆఖరికి పెళ్ళాం బిడ్డలు అందరూ తన గురించి చెడుగానే మాట్లాడుకుంటున్నారు. అంత వరకు ఉన్న ఉత్సాహమంతా ఒక్కసారిగా నీరుకారిపోయింది. ఒక గుడి ముందు చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు. అంతలో అక్కడికి ఒక ముసలి సాధువు వచ్చాడు. ముఖం చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో వుంది.
ఆ సాధువు రంగయ్యను చూస్తూ “ఏం నాయనా... ఒక్కనివే లోపల్లోపల బాధతో కుమిలిపోతావున్నావు. రహస్యం కాకపోతే నాతో పంచుకో, కొంచమన్నా తగ్గుతుంది" అన్నాడు చిరునవ్వుతో.
పిసినారి సాధువుకు జరిగిందంతా చెప్పి, "స్వామీ... నేను మారకముందు జనాలు ఇలాగే చెడుగా మాట్లాడారు. మారినాక కూడా అలాగే మాట్లాడుతా వున్నారు. ఇంక ఈ దానధర్మాలు చేసి ఏం లాభం" అన్నాడు విరక్తిగా,
సాధువు చిరునవ్వు నవ్వి "రంగయ్యా.... ఇంతవరకు నువ్వు ఎవరికైతే దానం చేస్తా వున్నావో వాళ్ళ మాటలు తప్ప అందరి మాటలూ విన్నావు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళ మాటలు గూడా వినిరా" అన్నాడు.
రంగయ్య పేరు మీద వూరి బైట ఒక సత్రం వుంది. అక్కడికి రోజూ వందమందికి తక్కువ కాకుండా పేదవాళ్ళు, యాత్రికులు వస్తా వుంటారు. వాళ్ళకు అక్కడ కడుపు నిండా ఉచితంగా అన్నం పెడతా వుంటారు. రంగయ్య అక్కడికి వెళ్ళాడు. అన్నం తిని వెళుతున్న వాళ్ళంతా.... అక్కడ గోడకు తగిలించిన రంగయ్య చిత్రపటాన్ని చూస్తా “ఈ మహానుభావుడు ఎవరో గానీ దేవునిలెక్క అందరికీ కడుపు నిండా అన్నం పెడతా వున్నాడు. మా ఆయుష్షు గూడా పోసుకొని వెయ్యేళ్ళు చల్లగా బతకాలి అని భక్తిగా నమస్కరించి పోతున్నారు. ఆ మాటలు వింటూ వుంటే రంగయ్యకు ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంతవరకు వున్న నీరసం ఎగిరిపోయి ఉత్సాహం పరవళ్ళు తొక్కసాగింది. సక్కగా సాధువు దగ్గరికి వచ్చి చిరునవ్వుతో నమస్కరించాడు.
"చూడు నాయనా... నిన్ను ఒక్కమాట అడుగుతాను. సూటిగా జవాబు చెప్పు. నువ్వు మంచివానిగా ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి అనుకొంటున్నావా, లేక మంచివానిగా బ్రతకాలనుకుంటున్నావా" అన్నాడు.
సాధువు మాటల్లోని మర్మం అర్థం చేసుకుంటూ “మంచివానిలా బ్రతకాలనే గదా స్వామీ ఈ ప్రయత్నం" అన్నాడు.
సాధువు ప్రశాంతంగా నవ్వి “నిజంగా మంచివానిగా బ్రతకాలి అనుకొనేవాడు. ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారా అని ఆలోచించడు. తాను చేస్తున్న పని మంచిదా కాదా, పదిమందికి ఉపయోగపడుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు. మంచిపనైతే ఎవరేమనుకుంటున్నా లెక్కచేయకుండా ముందుకు సాగుతాడు. చెడ్డపేరు తెచ్చుకోవడానికి ఒక్కక్షణం చాలు. కానీ మంచి పేరు సంపాదించుకోవడానికి జీవితకాలం పడుతుంది. అలాగే నువ్వేదయినా నిర్ణయం తీసుకునేటప్పుడు నీ బాధ్యతలు గూడా చక్కబెట్టాలి. పెళ్ళాంబిడ్డలకు కూడా నచ్చచెప్పాలి" అన్నాడు.
రంగయ్య ఇంటికి వచ్చి భార్యా పిల్లలని పిలిచి తన నిర్ణయం చెప్పి ఆస్తిని మూడు భాగాలు చేశాడు. ఒకటి కొడుక్కి మరొకటి భార్యకు ఇచ్చి తన వాటా దానధర్మాలకు ఉపయోగించసాగాడు.
**********

కామెంట్‌లు