సోమ కళాధర మౌళి.. శివుడు "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి:- 99127 67098
 🔱సాంబశివ పరoబ్రహ్మ
     చైతన్య ప్రకాశము నందు
    రమియించు నాదు హృది!
    శివా నమో! నమః శివా!
 ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
⚜️ఆరాధకులు, మరియు సాధకులు... సాంబ సదాశివుని, తదేక దృష్టితో ధ్యానము చేస్తున్నప్పుడు; శ్రీస్వామివారి కృపా కటాక్షము... వారిపై ప్రసరించుతుంది! ఆ పారమేశ్వరమగు చిత్కళాప్రకాశము నందు.. తన హృదయము .. నిత్యము రమించుచుండు గావుత! అని, ఆకాంక్షిoచు చున్నారు, జగద్గురు ఆది శంకరులు!
🔱శిరము నందు చంద్రరేఖయు, కోమలమైన మేఘమువంటి కంథరమును గలిగి, సర్వనియామక మైనదియు; పార్వతీ పరమేశ్వర రూపముతో శోభిల్లుచున్న, మహా మహిమాన్వితమగు పరంజ్యోతి స్వరూపమైన.. శ్రీసాంబ శివపరబ్రహ్మము నందు... నాదు హృదయము ఎల్లవేళలా విహరించు చుండుగాక! అని, ఆత్మారాముడగు సోముని, శ్రీశివ పరమాత్మను.. భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి, భక్త మహాశయు లందరూ!
🔱సోమకళాధర మౌలౌ
    కోమల ఘనకంధరే మహామహసి
    స్వామిని గిరిజానాథే 
     మామక హృదయం నిరంతరం రమతామ్!!
        ( శ్రీ శివానంద లహరి.. 93వ శ్లోకము.,)
         🪷🔆🪷
           🚩చంపక మాల 
    శిరమున చంద్రరేఖయును, జెల్వుగ కోమల నీలమేఘ సుం
    దర వరకంథరంబు, నధినాయక మౌనది, పార్వతీ సతీ 
    హరయుత రూపశోభిత, మహామహితంబగు జ్యోతి యందునన్
     స్థిరముగ నాదు మానసము చేరి, రమించెడు గాక! యెప్పుడున్!!
        ( రచన:- మధుర కవి దేవుల పల్లి చెంచు సుబ్బయ్య శర్మ., )
            🔆🪷🔆
        🚩కందపద్యం
     స్వామి, గిరీశుని లోపల 
     మామక చిత్తంబు రతిని మైమరవంగా;
      సోమకళాధర మౌళిని,
      కోమల శితికంఠు నేను కూర్మి భజింతున్!
           ( రచన:- డా. శ్రీపాదుక )
🕉️ నమః శివాయై చ నమః శివాయ!

కామెంట్‌లు