సుప్రభాత కవిత బృంద
రెక్కలు విప్పుకుని ఎగరాలని
కొత్తగ జగతిని చూడాలనీ
మొత్తం తానై తిరగాలనీ
విత్తులు నాటిన కలలు

గుండెల గాయం దాచేసి
మండుతున్నా మెత్తగ నవ్వుతూ
రూపుదాల్చిన సంతోషంలా
గడిపే క్షణాలెన్నో!

పెదవి దాటని మాటగా
కొదవ దాటని కోరికగా
ఎదను దాచిన వేదనలన్నీ
ఎందుకోసం?

కొన్ని మనసులకెందుకో
ఏవీ అందవు..ఎగిరినా
అన్నీ ఉన్నా ఏవో ఎరుగని
పంజరాలు కొందరికి..

అరుదుగా వచ్చే ఆనందానికే
విరివిగా తోచే సంతోషం
కొరివిగా మారిన కలిమి
కోట్లున్నా కొన్నిటికి లేమి

అడుగడుగున  ఆరాటం
అంతేలేని పోరాటం
అనుకోని అపదలొస్తే
బ్రతుకే ఒక విరాటపర్వం

చేసిన పాపం తెలియదు
తగిలిన శాపం తెలియదు
తెచ్చుకున్న కర్మం తెలియదు
అసలెందుకు జన్మో తెలియదు

అన్నీ అమరినా
ఎన్నో పోగొట్టుకున్నా
ఏమీ ఆశించకున్నా
ప్రతిఫలం వేదనే!

ఖేదము మోదమై తీరాలి
చీకటి తర్వాత తెల్లవారాలి
స్వప్నాలు దాచిన కళ్ళకు
సర్వం కైవసం కావాలి

ప్రతి నావకూ ఒక తీరం
ప్రతి కెరటం తగ్గించు దూరం
నీటివాలున సాగే పడవకు
కోరిన గమ్యం దొరికే 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు