సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -355
స్థాలీ పులాక న్యాయము
*****
స్థాలీ అంటే మట్టి కుండ,వంటపాత్ర, వంట కుండ.పులాకం అంటే అన్నం మెతుకు,గంజి పులగం అనే అర్థాలు ఉన్నాయి.
స్థాలీ పులాకం అంటే వంట పాత్రలో వండిన అన్నం మెతుకు.
"పర్యాప్తో హ్యేకఃపులాకః స్థాలీ నిదర్శనాయ"అంటే అన్నం ఉడికినదో లేదో తెలిసికొనుటకు గిన్నెలోని ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలని అర్థము.
ఈ స్థాలీ పులాక కార్యక్రమం అనేది హిందూ మతాచార వివాహ తంతులో ఓ ప్రత్యేక ఆకర్షణీయమైన ఘట్టంగా వుంటుంది.
వివాహ సమయంలో నూతన వధూవరులను కూర్చోబెట్టి వధువు చేత స్థాలీ పాకం చేయిస్తుంటారు.ఇక్కడ స్థాలీ అంటే పాత్ర.పాకం అంటే వంట. పాత్ర లేదా కుండలో చేసిన వంట స్థాలీపాకం.అయితే అందులో వండిన పదార్థం పులాకం.పులాకం  అనగా మెతుకు.వధువు పూజారి గారు చెప్పినట్టు సమిధల మీద పాత్ర పెట్టి వంట వంట చేస్తుంటే వరుడు పాత్రకు మంట తగిలేలా సహాయం చేస్తాడు.ఇక అన్నమంతా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి  వధువు ఒకటి రెండు మెతుకులు  పట్టుకొని చూస్తుంది.అలా వధువు చేసిన స్థాలీ పులాకంతో వరుడు హోమం పూర్తి చేస్తాడు.
అయితే అది పెళ్ళి తంతు కానీ  ఒక్క  మెతుకు పట్టుకొని చూసి  అన్నం మొత్తం ఉడికిందా లేదో  అలవోకగా చెప్పడాన్ని స్థాలీ పులాకం అంటామన్న మాట. అంతే కానీ పాత్రలోని మెతుకు మెతుకు చూడాల్సిన అవసరం లేదు కదా!
అలాగే ఏదైనా వంట చేసినప్పుడు అందులో  సరిపడ ఉప్పు వేశామా? లేదా? తెలుసుకోవడానికి మచ్చుకు  ఓ చెంచాతో తీసుకుని రుచి చూస్తాము.
ఇలా వంటకాలు కానీ పదార్థాలు కానీ కొంచెం తీసుకుని దానికి సంబంధించినవన్నీ  సరిపోను అందులో వున్నాయా?లేదా? ఉడికిందా? లేదా అనేది కొంచెం తీసుకుని పరిశీలించడం, నిర్ధారించడం చేస్తాము.అలా చేయడం వల్ల మొత్తం ఎలా వుందో చెప్పగలం.
 మరి ఈ న్యాయములోని  విషయము పండితులు చెబుతారా? పామరులా? అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అలవోకగా చెప్పగలరు.
అయితే అందులో అసలైన అంతరార్థం  నిగూఢంగా దాగి ఉంది. అదేమిటంటే ఎవరైన వ్యక్తి గుణగణాలేంటో చెప్పడానికి అతడు చేసిన మంచి పనులు,ప్రవర్తించే తీరు చాలు.ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెప్పడానికి. 
 
ఆ విధంగా వ్యక్తి మనస్తత్వాన్ని   అర్థం చేసుకోవడానికి ఒకటో రెండో బలీయమైన సంఘటనలు,సన్నివేశాలు చాలు. ఫలానా వ్యక్తి  ఎలాంటి వాడో నిర్థారణ చేయడానికే.అలాంటి సందర్భంలో  మన పెద్దలు ఈ "స్థాలీ పులాక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. అంతే కాదండోయ్! ఫలానా పార్టీ ఇలాంటిది,అలాంటిది అని చెప్పడానికి కూడా అన్నం  మెతుకు లాంటి ఓ ఉదాహరణ చెప్పి "స్థాలీ పులాకం" లా అర్థం చేసుకొమ్మని గుంభనంగా చెబుతుంటారు.
ఇవండీ "స్థాలీ పులాక న్యాయము"నకు సంబంధించిన విశేషాలు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు