సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -346
స్థవిర లగుడ న్యాయము
*****
స్థవిర అనగా ముదుసలి, ముసలి వాడు. లగుడ అనగా కర్ర,దండము అనే అర్థాలు ఉన్నాయి.
 ముసలి వ్యక్తి  విసిరేసిన కర్ర సరిగా లక్ష్యమును చేరక పోవుటయే కాకుండా తనకో, చుట్టుపక్కలనున్న వారికో హాని కలిగిస్తుందని అర్థము.
అవును కదా! వృద్ధాప్యం వల్ల శరీర అవయవాలు నియంత్రణలో వుండవు. చేసే పనుల్లో కొంత అస్తవ్యస్తత కనిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ దీనిని దృష్టిలో పెట్టుకొని మన  పెద్దలు ఓ న్యాయాన్నే సృష్టించారు.అది ఎందుకో చూద్దాం.
సమయం సందర్భం లేకుండా  మాట్లాడే మాట కాని విషయం కాని ప్రయోజనం చేకూర్చదు.పైగా అలాంటివి అపార్థాలకు దారి తీస్తాయి.అందరిలో పరువు కూడా పోగొడతాయి అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అనగా గురి తప్పిన బాణంలాంటి  అసందర్భమైన మాట ఎదుటి వారిని గాయం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది "పిచ్చోడి చేతిలో రాయి" లాంటిది.
 పిచ్చోడు తన చేతిలోని రాయితో ఎలా గురిపెట్టి కొట్టాలో తెలియదు.ఎవరిని కొట్టాలో కూడా తెలియదు.అతడు విసిరిన రాయి ఎవరికైనా తగలవచ్చు.లేదా దానిని విసిరేటప్పుడు జారి తనకే గాయం చేయవచ్చు.అలాంటి వాడి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.
 మనం మాట్లాడే మాట ఆ విధంగా ఉండకూడదని ఈ న్యాయము చెబుతోంది.అందుకే నండూరి కృష్ణమాచార్యులు ఏమంటారంటే....
 "వాక్కు కున్న శక్తి వాడి కత్తికి లేదు/ మార్చగలదు మాట మనిషి మనసు/ జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త/ శబ్దములకు గొప్ప శక్తి కలదు/"
మంచి మాట చాలు మనసులో గాయమ్ము/ మాన్పజాలు గొప్ప మందు వోలె/ సామ్యమైన మాట సంతాపమును బాపు/ మాట చూర గొనును మనిషి యెడద" అని అంటారు.
 మాట పదునెక్కిన కత్తి లాంటిది.దానికి మనిషిని మార్చే శక్తి ఉంది.అందుకే నోటి నుండి వచ్చే మాట మంచిదై వుండాలి.మంచిని పెంచేలా వుండాలి. అది దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని ప్రోత్సాహించేలా వుండ కూడదు. మానసికంగా కృంగి పోయేలా చేయకూడదు. కాబట్టి మాట్లాడే మాట "స్థవిర లగుడ"వలె వుండకూడదు.
మాట మనసులోని గాయాన్ని మాన్పించే  ఔషధంలా వుండాలి, సంతాపాన్ని, దుఃఖాన్ని  పోగొట్టేలా వుండాలి.అలాంటి మంచి మాట ఎదుటి వారి హృదయాన్ని గెలుచుకుంటుంది.
కాబట్టి కర్ర లాంటి మాటను విసిరేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.కాలు జారితే వెనక్కి తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము.మనల్ని నలుగురిలో నిలబెట్టేది,పడ గొట్టేది మాటేనని గ్రహిద్దాం.సందర్భోచితంగా మాట్లాడుదాం.మన మాట వల్ల ఎవరూ నొచ్చుకోకుండా చూసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు