గరుడ పురాణం ప్రాశస్థ్యం;- సి.హెచ్.ప్రతాప్
 హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి విపులంగా వివరించడం జరిగింది. గరుడ పురాణం ప్రాశస్థ్యం గురించి వర్ణించడం అసాధ్యం అని స్వయంగా మన సనాతన మహర్షులే అన్నారు.గరుడ పురాణంలో విష్ణువు తన ప్రియమైన వాహన పక్షి రాజు గరుడతో మరణం, మరణానంతర సంఘటనల గురించి మాట్లాడాడు. ఇది గరుడ పురాణంలో వివరించబడింది. గురుడు పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి చెప్పబడింది. జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని మరణానంతరం స్వర్గాన్ని పొందుతాడని ఈ పురాణం సోష్టం చెస్తోంది. మరోవైపు, చెడు పనులు చేసేవారు మరణానంతరం యమరాజు యమదూతలచే హింసించబడతారు . అలాంటి ఆత్మ కూడా నరకంలో బాధపడవలసి ఉంటుంది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
శిశువు తన పూర్వ జన్మ కర్మలను అనుసరించి  ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడ్వటం మొదలు పెడతాడు. ఆ తర్వాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు, శరీర బాధలు చెప్ప లేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలను మూట కట్టుకుని వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు. తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మను ఎతుత్తాడు. ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణం చెప్తుంది.అందుకే ఈ జన్మ జన్మల కర్మ పరంపర నుండి తప్పించుకునేందుకు భగవంతుని పాదాలను ఆశ్రయించదం ఒక్కటే సరైన మార్గమని ఈ పురాణంలో వివరించబడింది. మనలోని ఆత్మ ఆమర్త్యమైనదని గీతలో కూడా పేర్కొనబడింది. ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసిన పాపాలు, పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది.కొంతమంది ఆత్మలు మరణించిన వెంటనే మరో శరీరాన్ని పొందుతాయని.. మరికొన్ని ఆత్మలు.. మూడు రోజుల నుంచి 10, 13 రోజుల సమయం తీసుకుంటాయని గరుడ పురాణంలో చెప్పబడింది. ఆకస్మాత్తుగా మరణించినవారు మళ్లీ పునర్జన్మ పొందడానికి దాదాపు ఒక సంవత్సర కాలం పడుతుందట. మరణించిన వారి ఆత్మ దాదాపు 13 రోజుల పాటు తమ ఆత్మీయుల చుట్టు ఉంటుందని గరుడ పురాణంలో చెప్పబడింది.
గరడ పురాణం విన్న తర్వాత వారి ఆత్మీయులకు కార్యక్రమాలలో తప్పులు జరగవు. అలాగే మెక్షాన్ని పొందే చర్యలను చేయడం ద్వారా ఈ విధంగా గరుడ పురాణం.. ప్రజలకు మార్గనిర్ధేశం చేస్తుంది .ఈ పురాణం ఎంత మాత్రం అశుభం కాదు. మన మలి జీవితం శుభకరంగా వుండాలంటే ఈ జన్మలో ఎటువంటి కర్మలు చేయాలో ఈ పురాణం సవివరంగా వివరిస్తుంది. 

కామెంట్‌లు