పేడ పిడకలు( బాల గేయం)- ఎడ్ల లక్ష్మి
పిడకలమ్మ పిడకలు
అవి పేడ పిడకలు 
దాలిలోన పెట్టారు
నిప్పులు కొన్ని  వేసారు

మెల్లిగా పిడకలు రగిలాయి
కుండలో పాలు పోసారు
పిడకల మీద పెట్టారు
పాలు చిక్కగా కాగాయి

అవ్వ వచ్చి చూసింది
మీగడ తోడు పెట్టింది
గుంజకు కవ్వం కట్టింది
పెరుగు కుండలో పోసింది

గిరగిర కవ్వము తిప్పింది
వెన్న ముద్దలు తీసింది
గురిగిలో వేసి కాచింది
బువ్వలో నెయ్యి వేసింది

పచ్చిపులుసు పోసింది
బొజ్జ నిండా తిన్నాము
తాత వద్దకు వెళ్ళాము
నీతి కథలు విన్నాము


కామెంట్‌లు