పునరుత్థానం- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 శిలలను శిల్పాలుగా మార్చే 
ఓ శిల్పాచార్యా! నీకు వందనం!
ఈ శిలారణ్యాన్ని
శిల్పారామంగా చేస్తున్న శిల్పీ! 
నీకు పాదాభివందనం!
కొట్టి కొట్టి, రాసిరాసి,
గీకిగీకి, తట్టితట్టి
పెద్ద ముక్కలే కాదు,
చిన్న చిట్టి ముక్క కూడా మిగలకుండా 
నిర్దాక్షిణ్యంగా పీకేసి, వెన్నముద్దలా చేసి 
వికృతాకారాన్ని
విలక్షణ, శిలక్షణ శిల్పంగా 
ఉసురుపోసే నీవు
ఏ శిలను దేవుణ్ణి చేస్తావో
ఏ శిలను మంగళతోరణంగా మలుస్తావో
ఆ రహస్యం నీకే తెలుసును
నీవు శిల్పబ్రహ్మవుసుమా!
నీ శక్తియుక్తుల ముందు,
నీ ఆలోచనల ముందు
నీకెవరూ సాటిరారు!
నీకెవరూ పోటీలేరు!
నిన్నెవరూ గెలవలేరు! 
అందుకే ఇస్తున్నా నీకు
శిల్పకళా అక్షర నీరాజనాలు! 
మానవతను మరచిన మా మనసులు
శిలలైనాయి
మా మనో శిలలను కూడా 
చక్కని శిల్పాలుగా మార్చవయ్యా!
మరి,
మమ్మల్ని ఎలా మార్చుతావో,
ఏమార్చుతావోగాని
నీ హస్తకళా నైపుణ్యంతో
మా మనసు పొరలను
పొరలు పొరలుగా
నీ ఆలోచనా లోచనాల ఉలితో విడదీసి
మా లోపలి, లోలోపలి
మనిషికీ మానవత్వానికీ
పునరుత్థానం కలిగించు!!
*********************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
అద్భుతంగా ఉంది కవిత. అభినందనలు సార్ 🌹🙏🌹👌👏👏