మెరుపు కోసం!!!- ప్రతాప్ కౌటిళ్యా
రెండు పర్వతాలను కలుపుతున్న మేఘం
రెండు లోయల్ని కలుపుతున్న పర్వతం
ఆకాశ అఘాతంలో ఎక్కడో స్పష్టంగా
ఇలాగే కనిపించే దృశ్యం ఒకటి
భూమిపై ఇంద్రధనస్సు లాంటి సాక్ష్యం నిజం

అజరామరమైన గర్భం ఎందుకో
గందరగోళం లాంటి గోళాలతోనే
నిండిపోయినట్లు చూపులు చెబుతున్నాయి

కీటకాలు అంటారేమిటి
కంటికి కైలాసంలోని మూడో కన్ను అదిరిపడింది!!

మానస సరోవరం తవ్వినకొద్దీ
గతమంతా కాలం ఒళ్లో నిద్దుర చెదిరి మేల్కొంది.!!

సాగదీసిన బంగారు తీగలా
కిరణం శతకోటి వెలుగుల్ని పోగు చేసి పెట్టింది.
త్రిశంకు స్వర్గంలా!!

దేవలోకంలోని అప్సరసలు
కలువని నదుల్లా చల్లబడ్డ మంచుకుండలై
ములుగుతున్నవీ!!

బ్రదలైన అగ్ని శిఖరాలను
మెల్లిగా స్వర్గానికి మళ్ళించిన
దివిటి చుక్కలు సముద్రంలో
ప్రతిబింబిస్తున్నవీ  మౌనంగా!!

నిప్పుల వాన దిగంతాల లోతుల్లో
కలబడుతున్నట్లు కాయాలు  రెండు
భూమిపై కలవరిస్తున్నవీ!!

ఘర్షణ పడ్డ ఉరుములు మెరుపులు
నక్షత్రాల దాకా పాకుతున్నాయి!!

దిగులు పడ్డ శబ్దం
నిప్పును ఆశ్రయించి ఆరిపోయింది.!!

లోతుల్లోనే బతుకుతున్న చీకటి
నిశ్శబ్దంగా లోకాన్ని మింగేసింది!!!

అంతరాల సహాయంతో కొత్త జన్మలెత్తిన
దుమ్ము ధూళి
మెల్లిగా గడ్డగట్టుకుపోతుంది!!!

ఎప్పటికీ వీడని నీడల్లా 
కదులుతున్న ఆకాశం కుంగిపోయి
నడవడం మానేసింది.!!!

ఎదురుగా దారి చూపే దీపాల్లా
వెలుగు అలలు ఆవిరై
దారి తప్పి పొంగిపొర్లిపోయాయి!!!

అందనంత ఆకర్షణ ముస్తాబై  ముంగురుల్నితీర్చిదిద్దుతుంది!!!

అంతులేని వింత శరీరాల్లాంటి మెరుపు కోసం.
ఎక్కుపెట్టిన విల్లంబు ఎదురుచూసింది అనంతం లోతుల్లో!!!!

ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు