సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 
న్యాయాలు -365
క్షీర నింబ న్యాయము
    *****
క్షీరము అంటే పాలు.నింబ అంటే వేప చెట్టు.
వేప చెట్టుకు పాలు పోసి పెంచినప్పటికీ దాని చేదు పోదు.
అలాగే ఎన్ని మంచి మాటలు బోధించినప్పటికీ దుష్టుడు తన దౌష్ట్యాన్ని వదిలిపెట్టడు అనే అర్థంతో మన పెద్దలు ఈ "క్షీర నింబ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 మరి  ఇలాంటి వారిని ఉద్దేశించి వేమన గారు రాసిన పద్యాన్ని చూద్దామా!
వేము పాలు వోసి ప్రేమతో బెంచిన/చేదు విరిగి తీపి జెందబోదు/ఓగునోగె గాక యుచితజ్ఞు డెటులౌను/ విశ్వధాభిరామ వినురవేమ "
వేప చెట్టుకు పాలు పోసి పెంచినప్పటికీ చేదు విరిగి తీపిగా కాదు.అదే విధంగా చెడ్డవారు చెడ్డవాడే కానీ మంచివాడు కాలేడు.
 ఇదే భావం వచ్చేలా వేమన మరో పద్యాన్ని కూడా ఉదాహరణగా  చెప్పాడు. అది కూడా చూద్దాం.
పాలు పంచదార పాపర పండ్లలో/ జాలబోసి వండ జవికి రావు/ కుటిల మానవులకు గుణమేల కల్గురా / విశ్వదాభిరామ వినురవేమ!
 ఎంత పంచదార పోసి పండినప్పటికీ పాపర పండ్లలో తీయదనం రాదు.అలాగే  దుష్టులకు మంచి గుణాలు ఎప్పటికీ అలవడవని అర్థము.
 ఇలాంటి అర్థం స్పురించేలా  రాసిన భాస్కర శతక పద్యాన్ని కూడా  చూద్దాం.
తడవగ రాదు  దుష్టగుణు దత్వమెరుగ యెవ్వరైన నా/  చెడు గుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోప చిత్తుడై/గదుదెగజూచుగా మరుగ గాగిన తైలము నీటి బొట్టుపై/'బడునెడ నా క్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!"
దుర్జనుడు తనకు హితము చెప్పిన వారిని కూడా నాశనము చేయుటకు చూస్తాడు కానీ హితమును అస్సలు వినడు. పెడచెవిన పెడుతుంటాడు.అంటే ఇతడు బాగా కాగిన నూనె వంటి వాడై హితమనెడు నీటి బిందువును భగ్గుమనెడి మంటవలె దహిస్తాడు అని అర్థము.
 ఇలా వ్యక్తి లోని దుష్టత్వం గురించి చెబుతూ చెడ్డ వ్యక్తి   తనలోని చెడ్డగుణాను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడు.అలా మార్చాలని ప్రయత్నం చేయడం వృథా ప్రయాస అని ఈ" క్షీర నింబ న్యాయము "ద్వారా గ్రహించవచ్చు.
 నిజమే కదా! మూర్ఖత్వం , దుష్టత్వం గల కొందరిని చూస్తుంటే ఇవి అక్షర సత్యాలు అనిపిస్తుంటాయి. అలాంటి వారి జోలికి పోకుండా ఉండటమే శ్రేయస్కరం కదా!మరి మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
===========================================
అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 💐
==============================================
మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీస్సులతో విజయవంతంగా 365 సంస్కృత న్యాయాలకు  నాదైన శైలిలో వివరణాత్మక, సందేశాత్మక వ్యాఖ్యలు చేయగలిగానని చెప్పడానికి చాలా సంతోషంగా సంతృప్తిగా వుంది.
 వచ్చే సంవత్సరంలో కూడా మరికొన్ని న్యాయాలు మీకు పరిచయం చేయాలని అనుకుంటూ వున్నాను. మీ ఆత్మీయమైన ఆశీస్సులతో 🙏

కామెంట్‌లు