త్యాగమేరా జీవితం!;- పొర్ల వేణుగోపాల రావు- ఉపాధ్యాయుడు- ఎల్లారెడ్డి పేట, రాజన్న సిరిసిల్లా జిల్లా.
తొమ్మిది నెలలు బజ్జున్న అమ్మబొజ్జను త్యాగంచేస్తే వచ్చిందీ జీవితం

పుట్టిన వెంటనే నవ్వును త్యాగం చేస్తే వచ్చింది ఉంగా..శబ్దం

అప్పటిదాకా ఆసరా..బొడ్డు త్రాడును త్యాగం చేస్తే లభించింది అమ్మ స్తన్యం!

మూసిన కనురెప్పల స్నేహాన్ని కొద్దిగా త్యాగం చేస్తే కనిపించిందీ లోకం

మూసిన గుప్పిళ్ళలో ఉన్న శూన్యాన్ని త్యాగం చేస్తే దొరికింది అమ్మవ్రేలు!

అంతవరకు ఇంట్లో ఉన్న నిశ్శబ్దాన్ని త్యాగం చేస్తే వినిపించాయి బోసినవ్వులు!

పంచినకొద్దీ పెరిగే ప్రేమలో..అమ్మానాన్నల త్యాగాలెన్నో!

గురువుల అమూల్య త్యాగాల ఫలితం వారిచ్చిన జ్ఞానం

సమాజంలో ప్రతివర్గం చేసిన త్యాగాల ఫలితం నా ఎదుగుదల!

అత్తమామల నోములపంటని త్యాగం చేస్తే నాకు ఇల్లాలు దొరికింది

నా అర్ధాంగి చేసిన రక్తమాంసాల త్యాగం నా వారసత్వం అయ్యింది

జీవితమంటేనే త్యాగం.. త్యాగమేరా జీవితం

పంచభూతాల సమ్మేళనంలో పిసరంత భాగం నీ దేహం!

పిలుపువచ్చినప్పుడు చేసేస్తాం దీన్ని కూడా త్యాగం!

త్యాగానికి మూలం ప్రేమ! త్యాగానికి అర్థం ప్రేమ! త్యాగానికి ఫలితం ప్రేమ!
********


కామెంట్‌లు
పొర్ల వేణుగోపాల రావు చెప్పారు…
నా కవితను ప్రచురించినందుకు సంపాదకులు శ్రీ వేదాంత సూరి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.. ధన్యవాదములు సర్🙏🙏🙏