సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -357
స్వవిష మూర్చితో భుజంగ ఆత్మానమేవ దశతి న్యాయము
******
స్వ అంటే తాను ధనము.విష అంటే నీరు, గరళము.మూర్చితో అనగా  మూర్ఛిల్లిన వాడు,‌మూఢుడు. భుజంగ అనగా పాము, సర్పము.ఆత్మ అనగా దేహము, మనసు, పరమాత్మ, బుద్ధి, జీవుడు, ధైర్యము, స్వభావము అనే అర్థాలు ఉన్నాయి.అమేవ అనగా అపరిమిత,మితి లేని దశతి అనగా కొఱుకుట.
"విషాతిరేకమున ఒళ్ళు తెలియని పాము తననే కరుస్తుంది అన్నట్లు."
పాము ఒకోసారి బుసలు కొడుతూ తనను తానే కరుచుకుంటుందట.ఆ కరిచిన గాట్ల నుండి విషము శరీరంలో చేరడంతో ,ఆ  విష ప్రభావం వల్ల మరణిస్తుంది.
ఇలా తమకు తామే కుయుక్తులు,మిడిసిపాటు ,గర్వం చేత అపాయము తెచ్చిపెట్టుకోవడం అన్న మాట.
అహం, కన్నూ మిన్నూ కానని అధికార మదం వ్యక్తి గతంగా ఎంత కీడు చేస్తాయో తెలిసేలా  చేస్తూ, అలాంటి వారిని ఉద్దేశించి ఈ  "స్వవిష మూర్చితో భుజంగ ఆత్మానమేవ దశతి న్యాయము" చెప్పబడింది.
 ఈర్ష్య,,అసూయలు,కోపం, ద్వేషం,మిడిసిపాటు అనేవి  మనిషి మనసులోని వికారాలు.అవి వ్యక్తి ప్రగతికి ప్రతిబంధకాలు. వీటిని పెంచి పోషిస్తే అవి ఎదుటి వారి కంటే తమకే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.
 దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను తెలుసుకుందామా...
స్వర్గానికి రాజైన ఇంద్రుడు ఒకానొక సమయంలో తాను చేసిన పాప ఫలితంగా మానస సరోవరంలో ఓ తామర తూడులో వుండి తపస్సు చేయసాగాడు.అందువల్ల స్వర్గాధిపతి స్థానానికి ఖాళీ ఏర్పడింది.
 ఇంద్రుడు తిరిగి వచ్చేంతవరకు ఆ పదవిని నిర్వహించగల సమర్థుడైన వ్యక్తి కోసం దేవతలు అన్వేషిస్తూ వుండగా నహుషుడి గురించి తెలిసింది.
నహుషుడు చంద్రవంశానికి చెందిన రాజు.పరాక్రమవంతుడిగా,ధర్మనిరతి కలిగిన చక్రవర్తిగా పేరు ఉండటం వల్ల వెంటనే దేవతలందరూ నహుషుడిని తాత్కాలిక ఇంద్రపదవిని అధిష్టించేందుకు ఆహ్వానం పలుకుతూ  నారద మహర్షిని నహుషుడి వద్దకు పంపించారు.నహుషుడు ఆనందంగా అంగీకరించాడు.అలా పరిపాలన చేస్తూ వుండగా క్రమక్రమంగా  నహుషుడిలో అధికార గర్వం, మిడిసిపాటు మొదలయ్యాయి.
ఓరోజు ఉద్యానవనంలో విహరిస్తున్న దేవేంద్రుడి భార్య శచీదేవిని చూశాడు.ఆమె యొక్క సౌందర్యానికి, అందచందాలకు ముగ్ధుడై పోయాడు. ఆమెను ఎలాగైనా తన పట్టపు రాణిగా చేసుకోవాలని అనుకుంటాడు.ఆ విషయాన్ని ఆమెకు తెలియజేయమని ఇది తన శాసనం కాదనడానికి వీల్లేదని హెచ్చరికను పంపుతాడు.
అది విన్న దేవతలందరికి చాలా కోపం వస్తుంది. కానీ తమంత తాముగా కావాలని ఎన్నుకున్న వ్యక్తి కదా!.ఏం చేయాలో వారికి తోచలేదు.విషయం తెలుసుకున్న శచీదేవి దేవతల గురువైన బృహస్పతికి చెప్పి తనను ఎలాగైనా ఈ గండం నుండి తప్పించమని వేడుకుంటుంది.అప్పుడు బృహస్పతి నహుషుడిని మునుల శాపానికి గురయ్యే విధంగా చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు.ఆ మాట వినగానే శచీదేవికి ఓ ఉపాయం ఆలోచించింది.నహుషుడికి కబురు పంపుతూ నేను పట్టపు రాణిని కాబట్టి సామాన్యుడిగా తన వద్దకు రాకూడదని, సప్త ఋషులతో పల్లకి మోయించుకుంటూ తన మందిరానికి రావాల్సిందిగా కబురు పంపిస్తుంది.
 కామం అధికార మదంతో కళ్ళు మూసుకుని పోయిన నహుషుడు వెంటనే సంతోషంగా సప్త ఋషులకు వర్తమానం పంపుతాడు.సప్తర్షులు  విని కోపోద్రిక్తులు అవుతారు.కానీ ఏమీ చేయలేక ఓర్పు వహించి నహుషుడు ఎక్కిన పల్లకిని మోయసాగారు.వారిలో అగస్త్య మహర్షి కొంచెం పొట్టిగా, బలహీనంగా ఉండటంతో పల్లకిని మిగతా వారితో సమానంగా మోయలేక పోయాడు.దాంతో  పల్లకి వేగం తగ్గింది.పల్లకీలో కూర్చున్న నహుషుడు కారణం తెలిసికొని అగస్త్య మహర్షిని అదిలిస్తూ సర్ప,సర్ప అంటాడు."సర్ప సర్ప" అంటే త్వరగా నడవమని అర్థం.కొరడాతో అదిలించడంతో అగస్త్య మహర్షికి బాగా కోపం వస్తుంది." అధికార మదంతో, కామంతో ఉచితానుచితాలు, ధర్మాధర్మాలను మరిచిపోయిన నీవు వెంటనే సర్పంగా మారి భూలోకంలో పడి వుండు " అని శపిస్తాడు.
అప్పుడు నహుషుడికి తాను చేసిన తప్పు తెలిసివచ్చింది.మిడిసిపాటు, అధికార మదంతో కమ్మిన పొరలు కరిగి పోయాయి.వెంటనే పల్లకి దిగి అగస్త్యుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడు.
ఇదండీ! "స్వవిష మూర్చితో  భుజంగ ఆత్మానమేవ దశతి న్యాయము"నకు సంబంధించిన కథా కమామీషు.
మిడిసిపాటు, అధికార మదం తెచ్చిన అనర్థాలు ఏమిటో  తెలుసుకున్నాం.,అలా చేయకూడదని అర్థమయ్యేలా  చెప్పిన ఈ న్యాయమును సదా గుర్తుంచుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు