సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -364
హిరణ్య నిధి న్యాయము
**"****
హిరణ్యము అనగా,మాడ, ధనము,బంగారము,రేతస్సు,గవ్వ, బంగారు పాత్ర,వెండి,వెలగల లోహము, భాగ్యము,ఆస్తి అనే అర్థాలు ఉన్నాయి..నిధి అనగా పాతర,నిక్షేపము, స్థానము, సముద్రము అనే అర్థాలు ఉన్నాయి.
భూమిలో బంగారపు గని ఉన్నప్పటికీ దానిని తెలుసుకోలేని వారు దాని మీదుగా ప్రతి రోజూ నడుస్తూనే వుంటారు.
గని వున్నది తెలుసుకున్న వారు  దృఢమైన దీక్ష పట్టుదలతో దానిని త్రవ్వి స్వంతం చేసుకుంటారు.
 వివేకి-అవివేకి పండితుడు-మూఢుడుమధ్య ఉన్న తేడాను తెలియజెప్పే న్యాయం ఇది.తెలివైన వాడు, వివేకవంతుడు తేనెటీగ లాంటి వాడు చుట్టూ ఉన్న పువ్వుల వంటి వారి నుంచి జ్ఞాన మకరందాన్ని  గ్రహిస్తాడు.అవివేకి ఈగ వంటి వాడు అక్కడే తిరుగుతూ వున్నా  ఆ పూలను పట్టించుకోడు.
 మరిక  హిరణ్యము  దొరికే ఈ భూమి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా!.
 జీవుల ఉనికికి, మనుగడకు భూమే ఆధారం.జీవి బతికి బట్ట కట్టాలంటే ఈ ధరణి మీద వివిధ రూపాల్లో లభించే ఆహారం మీద ఆధారపడాల్సిందే.ఈ భూమి అనేక మొక్కలు, ప్రాణులు మొదలైన వాటికి జన్మనిచ్చే మాతృ స్వరూపం. సహన మూర్తి.అందుకే పుడమికి తల్లి గౌరవం ఇస్తుంటారు.
ఇక భూమి లోపల అనేక విలువైన నిధులు కలవు. భూ గర్భం నుంచి ఇప్పటివరకు 108 రసాయనాలను కనిపెట్టారు.భూమిలో అనేక రకాల గనులు,శిలాజ ఇంధనాలు, తీయని నీటి వనరులు ఉన్నాయి.
ఇవన్నీ ఇచ్చే అవనమ్మను రైతులు నిత్యం దైవంగా భావించి వంగి నమస్కారం చేస్తారు. వారే కాదు అందరూ నేల తల్లికి ప్రణామం చేయాలి.
ప్రత్యక్షంగా  కనిపిస్తున్న భూమాత గొప్పతనాన్ని  మరింత తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడే జ్ఞాని , పండితుడు.
 ప్రముఖ సినీ గేయ కవి సుద్దాల అశోక్ తేజ గారు నేలమ్మ గొప్పతనం గురించి "నేలమ్మా నేలమ్మా/ నీకు వేల వేల వందనాలమ్మా  అంటూ అద్భుతమైన పాట రాశారు.
అందుకే వేమన మట్టి గురించి చెబుతూ  ఇలా అంటాడు.
మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి/ మంటిలోన దిరిగి మనుజుడాయె/మన్నుమంటి గలువ మనుజుడే తత్వము/ విశ్వధాభిరామ వినురవేమ"
మనిషి మట్టిలో పుట్టి,మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి చివరకు మట్టిలోనే కలిసిపోతున్నాడు.మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము.ఇది తప్పు పట్టరాని నిజం. అది గ్రహించక మట్టిని అసహ్యించుకునే వాళ్ళు కొందరు వుంటారు. వాళ్ళను మూఢులు, అవివేకులు అని చెప్పవచ్చు.
అలాగే  భూమి యొక్క గొప్ప తనము గురించి రాసిన భర్తృహరి సుభాషితాన్ని చూద్దామా...
"చెలువౌ రత్న ఘటంబునం దతడు సు శ్రీఖండ ఖండంబులం /దిల పిణ్యాకము వందె,నారుగల కర్థిన్ సప్తపర్ణావృతుల్/నిలిపెన్, జిల్లెడు దూదికై పుడమి దున్నెన్  బైడి నాగేళ్ల,ని/మ్కుల గర్మక్షితి బుట్టి యెవ్వడు దపంబుల్ సేయ డప్రాజ్ఞతన్/"
అనగా ఈ భరత ఖండము గొప్ప కర్మభూమి ఇందులో పుట్టి ఎవరు పుణ్యమును చేయడో అట్టివాడు రత్నభాండములో చందనపు చెక్కలతో తెలకపిండిని ఉడక బెట్టేవానితోనూ,అరిక పైరునకు అరటి కంచెలేసిన వానితోనూ, జిల్లేడు దూదికై బంగారు నాగలితో భూమిని దున్నేవాడితోనూ సమానుడు అని భావము.
ఇక్కడ భరత ఖండము అని చెప్పారు కానీ అసలు ఈ భూమ్మీద పుట్టిన ప్రతి వ్యక్తి అంతో  ఇంతో పుణ్యం చేయాలి. అప్పుడే ఈ జన్మకు సార్థకత చేకూరుతుందని అర్థం చేసుకోవాలి.
 ఈ హిరణ్య నిధి న్యాయము  కేవలం భూమి గురించే కాదు  హిరణ్య  నిధి వంటి  పండితులు, విద్వత్తు కలవారు  మన చుట్టూ వుంటారు. వారి ద్వారా ఎంతో విజ్ఞానం సంపాదించవచ్చు.కానీ అలాంటి వారిని గుర్తించక కొందరు  'ఆ వారిలో ఏముందిలే ' అని పట్టించుకోరు.  అలాంటి వారిని మూఢులు అనవచ్చు.
మరికొందరు అలాంటి వారి వద్ద శిష్యులుగా, స్నేహితులుగా, మరే విధంగానో  చేరి, వారిలోని విద్వత్తును,  పాండిత్యాన్ని, వివిధ  విషయాల  అమూల్యమైన విజ్ఞానాన్ని ... పట్టుదల దీక్షతో నేర్చుకుని వారిలా గొప్ప పేరు తెచ్చుకుంటారు.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు