శ్రుతిలయలు - : సరికొండ శ్రీనివాసరాజు
  శ్రుతి మరియు లయ ఒకే తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి ఎవరు మొదటి ర్యాంక్ వస్తారో చెప్పడం కష్టం. ఒక్కోసారి ఇద్దరూ సమానమైన మార్కులతో ఒకే ర్యాంక్ వస్తారు. లీడరుగా ఏమైనా బాధ్యతలు అప్ప చెబితే పోటీలు పెట్టుకుని సరిగా చేయరు. బాగా చదివే విద్యార్థుల మధ్య వైరం పనికిరాదని,  అది వారికే నష్టం అని తెలుగు ఉపాధ్యాయుడు వాసు మాస్టర్ ఎంత చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే ఉండేది. 
      ఇద్దరూ 9వ తరగతికి వచ్చారు. అప్పుడప్పుడు తాను రెండవ ర్యాంకు రావడం శ్రుతి తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అవమానంగా భావించిన లయ తనను మరో పాఠశాలలో చేర్పించమని తలిదండ్రులపై బాగా ఒత్తిడి తెచ్చింది. తనకు ఇక్కడ పాఠాలు అర్థం కావడం లేదని అబద్దం చెబుతుంది. వేరే పాఠశాలలో చేరింది. కొత్త పాఠశాలలో తానే మొదటి ర్యాంకు వస్తుంది లయ. కానీ పోటీ ఎవరూ లేక రాను రాను మార్కులు బాగా తగ్గుతున్నాయి. 
       ఒకరోజు లయ పాత పాఠశాల ఉపాధ్యాయురాలు శర్వాణి లయ ఇంటికి వచ్చింది. లయ మార్కులు తల్లిదండ్రుల ద్వారా విన్నాక ఆశ్చర్యపోయింది. "చూడు లయా! నీ కంటే సీనియర్ విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న శ్రావణి, అలివేలు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి సందేహాలు మరొకరు నివృత్తి చేసుకుంటూ కలసి చదువుకునే వారు. ఫలితంగా ఆ ఇద్దరికీ మీ ఇద్దరి మార్కుల కన్నా చాలా ఎక్కువగా వచ్చేవి. మీ ఇద్దరూ కూడా మీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మీ శ్రుతిలయలు ఇద్దరూ వారి లాగా కలసి చదువుకంటే మీకే మంచిది కదా అన్నది శర్వాణి టీచర్. అలాగే చేసింది లయ. శ్రుతిలయలు ఇద్దరూ ప్రాణ స్నేహితులై కలసి చదువుకుంటూ మార్కులు బాగా పెంచుకున్నారు. కలసి ఉంటే కలదు బలం.

కామెంట్‌లు