అరుగు- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అరుగులన్నిటిలోన
ఏ అరుగు మేలు?
అని నన్ను అడిగితే...
మా జోగిపేట గ్రామంలోని 
చింతల శంకరయ్యగుప్త గారి 
అరుగు మేలని నేను అంటాను 
ఎందుకో తెలుసా?...
ఎందరు పౌరాణికులు, 
ఎందరు భాగవతారులు, 
ఎందరు హరికథావిద్వాంసులు, 
ఎందరు బుర్రకథకులు 
అక్కడ తమ జీవికను పొందారో?!
ఎన్ని పురాణ ప్రబోధాలు
ఎన్ని హరికథా శ్రవణాలు
ఎన్ని భాగవత ప్రవచనాలు
ఎన్ని జానపద కళల ప్రదర్శనలు 
అక్కడ ప్రతిధ్వనించాయో?! 
ఇప్పటికీ నామనసులో అవి అన్నీ 
నాచుట్టే తిరుగుతున్నట్టున్నాయి 
అక్కడ కథలకు, గేయాలకు, వచనాలకు 
ఎన్ని హృదయాలు 
ఆనంద కందళితమయ్యాయో
ఎన్ని హృదయాలు 
కరుణా రసధునులయ్యాయో 
ఎన్ని హృదయాలు 
భక్తి రసప్లావితమయ్యాయో
ఎన్ని హృదయాలు 
అనురాగ సుగంధ పరిమళభరితమయ్యాయో 
అక్కడ ఎంతోమంది ఆడబిడ్డలకు
పుస్తె, మట్టెల దానం జరిగింది
అక్కడ ఎంతోమంది తల్లిదండ్రుల 
బాధాతప్త హృదయభారం తగ్గించబడింది 
అక్కడ ఎన్నో కుటుంబాలు
ఆసరా పొందాయి
అక్కడ ఎంతోమంది రైతులకు
గిట్టుబాటు ధర లభించింది 
ఆ అరుగు ఒక జ్ఞానవాటిక
ఆ అరుగు ఒక ధర్మపీఠం
ఆ అరుగు ఒక న్యాయస్థానం
ఆ అరుగు ఒక సంతోషచంద్రశాల
ఆ అరుగు ఒక ఆనందాల విరితోట
ఆ అరుగు ఒక పవిత్ర కోవెల
ఇప్పుడది కనుమరుగైనా
ఎప్పటికీ జనుల మదిలో 
సదా నిలిచే ఉంటుంది!!
*********************************

కామెంట్‌లు