సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -347
స్థావర జంగమ విష న్యాయము
*****
స్థావరము అనగా కదలనిది,కొండ,వింటినారి,నిలకడ,సంచరింపని వృక్ష పర్వతాదులు. జంగమము‌ అంటే కదిలేది,తిరుగునది,జంగము వాడు.విష అనగా నీరు,గరళము, విషము  అనే అర్థాలు ఉన్నాయి.
 కదలనిది విషానికి సంబంధించినదై ఉండి కదిలేదానిని బాధిస్తుందనీ,కదిలేది కూడా విషపూరితమై వుండి కదిలే విషపూరితమైన దానిని బాధిస్తుందనీ ...ఇలా రెండు రకాల సందర్భాల్లో ఈ"స్థావర జంగమ విష న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇక అసలు విషయానికొద్దాం... 
విషము యొక్క ధర్మము ప్రాణహాని చేయడం.అలాంటి విషమునకు మళ్ళీ విషమే నాశకము అంటే విరుగుడు అవుతుందనీ, విషానికి విషమే హాని కలిగిస్తుందని అని పెద్దలు అంటుంటారు.
అయితే అలాంటి విషములు రెండు రకాలు ఉంటాయట.ఒకటి స్థావరము, రెండవది జంగమము అని. మరి అందులో ఏది నాశకము/నశింప జేయునది ఏది?నాశ్యము అనగా  నాశనం చేయబడేది ఏది? అనేదే పెద్ద ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు వత్సనాభ మరియు తెల్ల ఈశ్వర మూలికల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వత్సనాభ అనేది విషపూరితమైన మూలిక.ఇది విషపూరితమైన భాగాలను తొలగించిన తర్వాత ఆయుర్వేదంలో మరియు ఇతర సాంప్రదాయ ఔషధాల చికిత్సలో ఉపయోగిస్తారు.
అంతే కాదు ఈ మూలిక విషం అయినప్పటికీ పాము విషానికి విరుగుడుగా పనిచేయడం గమనించవచ్చు.ఇది కదలని వృక్ష జాతికి చెందినది అంటే స్థావరము.అయినా కదిలే అనగా జంగమమైన పాము విషాన్ని హరిస్తుందన్న మాట.ఇలా కదలనిదైన చెట్టు కదిలేదానిని పాము విషాన్ని బాధిస్తుందనీ అర్థము.
అలాగే తెల్ల ఈశ్వర మూలిక కూడా  ఇదే విధంగా పని చేస్తుంది.దీనిని ఈశ్వర వేరు అంటారు. ఇది తేలు కాటు లేదా పాము కాటు వేసిన  సందర్భాల్లో విషాన్ని తొలగించేందుకు వాంతి అయ్యేలా  ఆకు యొక్క తాజా రసం ఇస్తారు . అలా ఇవ్వడం వల్ల తేలు,పాము విష ప్రభావం తగ్గుతుంది.అలాగే మొక్క వేరును ఆవు మూత్రంతో నూరి కరిచిన చోట ఆ మిశ్రమాన్ని పూయాలి. వేరును నమిలి మింగుతూ వుండాలి.ఇలా చేయడం వల్ల విషం శరీరమంతా వ్యాపించకుండా వుంటుంది.ఇలా "స్థావర జంగమ విష న్యాయము" ఇక్కడ కూడా వర్తించిందన్న మాట.
అయితే జంగమమ న్యాయం కూడా ఇందులో ఇమిడి ఉంది కదా! అదెలాగో చూద్దాం.
విష సర్పము తన విషము తాను మింగితే ఏమీ కాదు.కారణం దాని కడుపులోని రసాయనాలు విషాన్ని జీర్ణం చేస్తాయి.కానీ తనను తాను కాటేసుకుంటే మాత్రం  వేరే జంతువులు, మనుషులు చనిపోయినట్లు అది కూడా చనిపోయే అవకాశం ఉంది.ఎందుకంటే దాని  విషం ఇతర జంతువుల వలె కాట్ల ద్వారా రక్తంలోకి ప్రవేశించడం వల్ల ప్రాణాంతకం అవుతుంది.తాను కాటేసిన జంతువు రక్తంలో ఎలా స్పందిస్తుందో  దాని సొంత రక్తంలోనూ అదే విధమైన స్పందన  వస్తుంది.అందుకే ఆ విష ప్రభావం వల్ల మరణిస్తుంది .
ఇలా విషపూరితమైన పాము తన విషము వల్లే  చనిపోతుందనేది  తెలుసుకున్నాం .
ఇలా "స్థావర జంగమ విష న్యాయము" ద్వారా స్థావరము,జంగమములలో రెండు రకాలుగా నశింప చేస్తూ,నశింపబడుతూ వుంటాయని తెలుసుకోగలిగాం.అది కేవలం మూలికలు,పాములకేనా అనే సందేహం ఎవరికైనా వస్తుంది.
ఏమి ఎరగనట్టు ఉండి మూడో వ్యక్తికి తెలియకుండా  ఇతరులకు హాని  చేసేవారు వుంటారు. మరికొందరు దుష్టత్వం కలిగి చివరకు తమకు తామే  నశింప జేసుకునే వారు ఉంటారు. అలాంటి వారందరిని చూసే కాబోలు ఇలాంటి న్యాయములు పుట్టుకొచ్చాయి‌.కదండీ!. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు