దానధర్మములు;- సి.హెచ్.ప్రతాప్
 ధనము కూడబెట్టి దానంబు చేయక
తానుదినక లెస్స దాచుకొనగ
తేనెటీగగూర్చి తెరువరికియ్యదా
విశ్వదాభి రామ వినురవేమ !
అర్ధం:
ఓ వేమా! ధనమును బాగా సంపాదించి , దానధర్మములు చేయక, తానూ తినక,దాచుకొనుట అన్నది ఎటువంటిదంటే, తేనెటీగ కష్టపడి సంపాదించిన తేనె దారినపోయే బాటసారుల పాల్జేసిన విధముగా నుండును.యుగధర్మాలను అనుసరించి పుణ్యం పొందే మార్గాలు మారుతూ ఉంటాయి. కృత యుగంలో తపస్సుతో పుణ్యం వచ్చేది. త్రేతాయుగంలో యజ్ఞ, యాగాదులు చేయడం ద్వారా పుణ్యం సంపాదించేవారు. ద్వాపర యుగంలో ‘ధర్మం’ పాటించడం ద్వారా పుణ్యాన్ని పొందేవారు. కౌరవులు ‘ధర్మాన్ని’ వదిలి పాపం మూటగట్టుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పాండవులు ‘ధర్మాన్ని’ విడిచిపెట్టలేదు. ఫలితంగా శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందారు. కలియుగంలో పుణ్యం పొందే మార్గం దానధర్మాలు అని శాస్త్రం చెబుతోంది. తపస్సు ఆచరించడం ఈ రోజుల్లో అందరికీ సాధ్యమయ్యే పనికాదు. యజ్ఞాలు నిర్వహించడమూ కష్టసాధ్యమే! ధర్మమార్గంలో పయనిస్తూ దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు. పుణ్యం కోసం దానాలు చేయడం స్వార్థం అవుతుంది. నిస్వార్థంగా దానం చేయడం ఉత్తమ లక్షణం. గరుడ పురాణం ప్రకారం, పేదవారు ఎప్పటికీ దాన ధర్మాలు చేయకూడు. పేదవారిగా ఉన్నప్పుడు దానం చేయడం వల్ల మరింత పేదలుగా మారొచ్చు. కాబట్టి పేరు ప్రతిష్టల కోసం దానధర్మాలు చేయడం మానుకోండి. అయితే ఎవరు దానం చేయాలంటే.. ఒక వ్యక్తి తాను సంపాదించిన సొమ్ము లేదా ఆస్తిలో పదో వంతు అంటే పది శాతం వరకు దానం చేయాలని శాస్త్రాల్లో వివరించబడింది. ఎవరికైతే అవసరం ఉంటుందో వారికే దానం చేయాలి. అప్పుడే మనం  చేసిన దానానికి తగిన ఫలితాలు లభిస్తాయి

కామెంట్‌లు