సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -359
హంస కాక న్యాయము
*****
హంస అనగా అంచ, సూర్యుడు, జీవుడు, విష్ణువు, యోగి, పరమాత్మ అనే అర్థాలు ఉన్నాయి.కాకి అనగా వాయసము.
హంస కాక అంటే హంస హంసే.కాకి కాకే అని అర్థము.
కొండకొన పైన  కూర్చున్నా కాకి కాకే. ఇసుకతిన్నె మీద  సంచారము చేసినా హంస హంసే అని అర్థము. 
మరి దేని ప్రత్యేకత దానిదే కానీ అందులో హంసకు ప్రత్యేకమైన గౌరవ స్థానం ఉంది. సరస్వతీ దేవి వాహనంగానూ,జ్ఞానానికి, ప్రాణానికి గుర్తుగాను హంస గురించి చెబుతూ వుంటారు.
కాకిని మూఢుడి క్రింద లెక్కిస్తూ ఏనుగు ఎక్కి పోయినా మూఢుడు మూఢుడేననీ,కాలి నడకన పోయినా పండితుడు పండితుడే.వారి  జ్ఞానానికి  విలువ, గౌరవం లభిస్తుంది కానీ ఎక్కి తిరిగే వాహనాల వల్ల కాదు అనే అర్థంతో ఈ "హంస కాక న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ఈ న్యాయములోని హంస గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందాం.హంస అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క వాహనమే.
 ఇక హంస గురించి చెప్పాలంటే చూడటానికి ఒక అందమైన పక్షి .ఇది నీటిలో  విహరిస్తూ వుంటుంది.నీటిలో  విహరించినా దాని యొక్క రెక్కలు తడవకుండా వుండటం విశేషం. హిందూ మతంలో హంసలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని "పరమ హంస" అని పిలుస్తారు.  రామకృష్ణ పరమహంసను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 
ఆధ్యాత్మిక వాదులు హంసను జ్ఞానానికి సంకేతంగా భావిస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతన చేసే వ్యక్తి సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ వున్నప్పుడు సుఖ దుఃఖాలు అనేవి మనసుకు అంటుకోకుండా హంసలా జీవించాలని పెద్దలు చెబుతుంటారు. ఆహారాన్ని వెదికే సమయంలో నీటిలో ఒక దగ్గర మునిగి మరెక్కడో తేలుతూ వుంటుంది కానీ దాని రెక్కలు మాత్రం అస్సలు తడవవట.
ఇవి ప్రతి గ్రీష్మ ఋతువులో మానస సరోవర సరస్సుకు వస్తాయట.అలా వేద కాలం నుండి జరుగుతూ వుందట కానీ అవి ఎక్కడనుండి తరలి వస్తాయో తెలియదట. ప్రస్తుతం  వాటి రాక తగ్గిందని అంటున్నారు.
 
 అలాంటి హంసను ఉచ్ఛ్వాస,నిశ్వాసాల ఊపిరిగా అంటే ప్రాణంగా హంసను భావిస్తారు. మనిషి మరణించినప్పుడు "ప్రాణ హంస ఎగిరిపోయింది" అనడం మనందరికీ తెలిసిందే.
 ఆ విధంగా  హంసకు  హిందూ మత పరంగా,యోగ శాస్త్ర పరంగా, నిత్య జీవితంలో ప్రాణానికి గుర్తుగా ప్రత్యేకత వుంది.
 మరిక కాకి విషయానికి వస్తే ఇదొక నల్లని పక్షి. దీనిని ఇతర పక్షుల వలె ఇళ్ళలో పెంచుకోరు.దీనిని సంస్కృతంలో వాయసం అంటారు.హిందూ పురాణాలలో కాకి శని దేవుని వాహనంగా చెప్పబడింది.కాకి ఇతర జంతువులు చేసే శబ్దాలను అనుకరించగలదట.కాకి రోజుకు నలభై మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదట. కాకి తన గూడును వదిలి వెళ్ళి సంవత్సరం గడిచిన తర్వాత కూడా అదే ప్రాంతానికి గుర్తు పెట్టుకొని వస్తుంది.
ఇక కాకి అరుపూ వినసొంపుగా ఉండదు. రూపమూ చూడబుద్ధి కాదు.పైగా శని దేవుని వాహనం కావడం వల్ల కాకిని చెడుకు సంకేతంగా భావిస్తారు.
కాకిని మూఢుడిగా హంసను జ్ఞానిగా పరిగణిస్తూ... మనుషుల్లో  ఇలాంటి వారికి అన్వయించి ఈ "హంస కాక న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 మరి మనం హంస వలె  గౌరవాన్ని పొందుదాం. సంసార సాగరాన్ని ఈదేటప్పుడు హంసను గుర్తు తెచ్చుకుని సుఖ దుఃఖాలకు అతీతంగా మన దేహంలోని ప్రాణ హంస ఎగిరిపోయేంత వరకు ప్రశాంత జీవితాన్ని గడుపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు