పందెం:- సరికొండ శ్రీనివాసరాజు
 "అమ్మమ్మా కథ చెప్పవా?" అని అమ్మమ్మ దగ్గర చేరింది సిరి. అమ్మమ్మ చిన్నారి సిరికి "కుందేలు తాబేలు పరుగు పందెం" కథ చెబుతుంది. అటుగా వెళ్తున్న వాసు "ఎప్పుడూ అవే కథలా అమ్మమ్మ! పస లేని కథలు. తాబేలు కుందేలు మీద గెలవడం సాధ్యమా! సోది కథ." అని వెళ్లిపోతాడు వాసు. అమ్మమ్మ పట్టించుకోకుండా కథ చెప్పడం కొనసాగించింది.
      వాసు చిన్నప్పటి నుంచీ ఆ తరగతిలో మొదటి ర్యాంక్. తనకు చదువులో పోటీ లేదు. అలా వాసు 9వ తరగతికి వచ్చాడు. "10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో నాదే ఫస్ట్ ర్యాంక్. నాకు ఎవ్వరూ పోటీకి రారు." అన్నాడు వాసు. అది విన్న శ్రుతి "గొప్పలు చెప్పుకోకు. నిన్ను మించిన వారు మరొకరు రావచ్చు." అన్నది శ్రుతి. వాసు పగలబడి నవ్వాడు. "నీకు పోటీ రాము ఉన్నాడు. తెలుసా?" అన్నది శ్రుతి. "వాడా? ఎప్పుడూ నాకు 570కి ఎక్కువ మార్కులు వస్తే వాడికి 450 లోపు మార్కులు వస్తాయి తెలుసా?" నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మా ఇద్దరికీ." అంటూ పగలబడి నవ్వాడు వాసు. రామూను పిలిచి "ఒరేయ్ రామూ! ఈ స్కూల్లో ఉండగా నువ్వు కనీసం ఒక్కసారి అయినా నన్ను చదువులో ఓడిస్తే నీకు పదివేల రూపాయలు బహుమానంగా ఇస్తాను. డన్." అన్నాడు. "ఓడిస్తాడు చూడు." అన్నది శ్రుతి. 
       ఆ తర్వాత శ్రుతితో రాము "అలా అన్నావేం శ్రుతీ! నా వల్ల అవుతుందా?" అన్నాడు రాము. "అవుతుంది. చదువుకు కావల్సింది ఏకాగ్రత. సినిమాలు చాలా శ్రద్ధగా చూసి ఉన్నది ఉన్నట్లు స్టోరీస్ చెబుతుంటావు కదా! అలాగే చదువు కూడా! పరధ్యానం పక్కన పెట్టి, మాస్టార్లు చెప్పే పాఠాలు ఏకాగ్రతతో విను. సందేహాలు వస్తే మాస్టార్ల వద్ద నివృతి చేసుకో. ఏరోజు పాఠాలు ఆరోజు చదువు. గెలుపు నీదే." అన్నది సీనియర్ స్టుడెంట్ 10వ తరగతి టాపర్ అయిన శ్రుతి. క్రమంగా రాము మార్కులు పెరుగుతున్నాయి. 
       10వ తరగతికి వచ్చాక వాసు ఇంటి పొరుగున ఉన్న సోముతో సావాసం చేశాడు. మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. ఒక పక్క వాసు చెల్లెలు వాణీ హెచ్చరించిది కూడా. సోషల్ మీడియాకు బానిస అయితే చెడిపోక తప్పదని. రాముతో పందెం గుర్తు చేసింది. వాసు పగలబడి నవ్వాడు. రామూను చులకన చేసి, గెలుపు తనదేనన్నాడు. 10వ తరగతి ప్రీ ఫైనల్లో రాము 587 మార్కులు సాధిస్తే వాసు 420 మార్కులు సాధించాడు. చిత్తుగా ఓడిపోయాడు.

కామెంట్‌లు