సుప్రభాత కవిత - బృంద
గగనానికీ భువనానికీ
అనుసంధానంగా 
తూరుపును వెలిగించే వేకువ

కొండల నడుమ 
కాంచన కలశం ఒలికినట్టు
బంగరు  మెరుపుల వేకువ

కోనల  పక్షుల కువకువలకు
ఇదే తరుణమంటూ
వనమంతా కమ్ముకునే వేకువ

మబ్బుల నీళ్ళనీ
ముద్దుగ రంగులు నింపుకుని
ముచ్చటగా ఎదురుచూసే వేకువ

గిరి శిఖరాలు తపమొనరించే
మునియోగులై నిలచి
రవికి స్వాగతం పలికే వేకువ

మెల్లగ వీచే కొండగాలి
వెదురుపొదలలో దూరి
వేణుగానంలా వినిపించే వేకువ

ఎరుపెక్కిన పువ్వుల బుగ్గలు
చూసి మురిపెంగా ముద్దులు
ముద్రించే వెలుగుల వేకువ

నిదురించే ఊరిలోకి
నిశ్శబ్దంగా  ప్రవేశించి
ఉరికే ఉత్సాహం  నింపే వేకువ

తెలియని అందాలెన్నో కనులకు చూపించి తెల్లవారకనే  లేచి 
చూసి తరించమనే వేకువ

సహజమైన  సొగసులతో
అలరారే భువిని చూసి
మైమరచి కౌగిలించే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు