భగవంతుని ఉనికి ;- పొర్ల వేణుగోపాల రావు, టీచర్-ఎల్లారెడ్డిపేట.
 (1)
ఎచ్చట వెదకిన యుండును
ఖచ్చితముగ గాంచవచ్చు! కరుణామయుడే!
మెచ్చిన వరము లొసంగును
ముచ్చెమటల వైరమైన మోక్షము నిచ్చున్!
(2)
మీలను జూచిన కనపడు!
నేలను గాచిన వరాహ! నిరతము గొల్తున్!
పాలను జిలుకగ కూర్మము!
బాలుని బ్రోచిన నరహరి! పరమాత్ముడవే!
(3)
బలినడగించిన వామన!
పలుమారులు ధర తుడిచిన భార్గవ రామా!
పొలమును దున్నిన బలుడా!
శిలనే నాతిగ మలచిన శ్రీరఘురామా!
(4)
ప్రాణులకందరి వేల్పుగ
త్రాణముగా మారినావు! తండ్రివి నీవే!
బాణము పట్టని బావవు!
వేణువు నూదుచు గడిపిన వెన్నల దొంగా!
(5)
ఉనికిని ఎరిగిన వారికి
కనిపించుచు నిచ్చెదవుగ కైవల్యమునే!
వినిపించితి నా మొర నిట
పనిపెంచక కరుణజూపు! బాలుడనైతిన్!
*********


కామెంట్‌లు